
మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో 11 మంది చిన్నారుల మృతికి కారణమైన దగ్గు మందు రాసిన డాక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ తాగిన పక్షం రోజుల్లోనే చిన్నారులు కిడ్నీ ఫెయిల్ అయి మృతిచెందారు. ఈ నేపథ్యంలో కాఫ్ సిరప్ సూచించిన డాక్టర్ ప్రవీణ్ సోనీని పరాసియా ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నట్లు భోపాల్ పోలీసులు ఆదివారం ఉదయం ప్రకటించారు.
డాక్టర్ సోని ప్రభుత్వ వైద్యుడు అయినప్పటికీ చింద్వారాలో ఓ ప్రైవేటు క్లినిక్ నడుపుతున్నారని ఎస్పీ అజయ్ పాండే తెలిపారు. ఈ క్రమంలో వివిధ ప్రాంతాల నుంచి చికిత్స కోసం తన వద్దకు వచ్చిన చిన్నారులకు ఆయన కోడ్రిఫ్ సిరఫ్‌ను సూచించారు. దీంతో 11 మంది చిన్నారులు అస్వస్థతకు గురై మరణించారు. ప్రస్తుతం డాక్టర్‌ను విచారిస్తున్నట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో కోల్డ్రిఫ్ సిరప్ అమ్మకాలను మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిషేధించింది. డాక్టర్‌పై కేసు నమోదుచేసిన పోలీసులు అదుపులోకి తీసుకుంది. ఆ సిరప్‌ను ఉత్పత్తి చేస్తున్న శ్రీసన్ ఫార్మాస్యూటికల్స్‌పై ప్రభుత్వం కేసు నమోదుచేసింది. ఈ కంపెనీ తమిళనాడులోని కాంచీపురంలో ఉన్నది. మధ్యప్రదేశ్ ప్రభుత్వ సూచనతో శ్రేసన్ ఫార్మా యూనిట్‌లో తమిళనాడు సర్కారు తనిఖీలు నిర్వహించింది. అక్కడ తయారవుతున్న కోల్డ్రిఫ్ సిరప్‌లో డైఇథైలిన్ గ్లైకాల్ 48.6 శాతం ఉందని తేలింది.
అత్యంత విషపూరితమైన ఈ రసాయనం వల్ల కిడ్నీలు విఫలమవుతాయని అధికారులు పేర్కొన్నారు. దీంతో తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం వెంటనే రాష్ట్రవ్యాప్తంగా కోల్ట్రిఫ్ సిరప్ అమ్మకం, వాడకాన్ని నిషేధించింది. హోల్‌సేల్, రిటైల్ దుకాణాల్లో స్టాక్‌ను ఫ్రీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కంపెనీకి ఉత్పత్తిని నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. తయారీ లైసెన్స్‌ను రద్దుకు షోకాజ్ నోటీస్ పంపారు.
అటు శ్రీసన్ ఫార్మాస్యూటికల్స్‌పై కేంద్ర ఔషధ నాణ్యత నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీఓ) కూడా చర్యలకు ఉపక్రమించింది. ఆ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే తమిళనాడు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ)కు లేఖ రాసింది. ఇక మరణాలకు కారణమైనట్లు అనుమానిస్తున్న మరో దగ్గుసిరప్ నెక్స్ట్రో డీఎస్ నమూనా ఫలితాల వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
ఇక యాంటీబయాటిక్స్, దగ్గు మందు తదితర 19 రకాల ఔషధాలను తయారుచేస్తున్న పరిశ్రమల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తోంది. ఎక్కడెక్కడ ఔషధాలు కల్తీ కావడానికి అవకాశాలున్నాయి, వాటిని ఎలా నివారించాలనే లక్ష్యాల ఆధారంగా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయని పేర్కొంది. హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని ఔషధ తయారీ కేంద్రాలపై అధికారులు దృష్టిసారించారు.
More Stories
‘ఐ లవ్ ముహమ్మద్’ పోస్టర్లు కాదు, శాంతిభద్రతల సమస్య
ఛత్ పండుగ తర్వాతే బిహార్ ఎన్నికలు
బిహార్ యువతకు స్వరాష్ట్రంలోనే ఉపాధి కల్పించే లక్ష్యం