`త్రిశూల’ వ్యూహంతో జనసేన బలోపేతంపై పవన్ దృష్టి

`త్రిశూల’ వ్యూహంతో జనసేన బలోపేతంపై పవన్ దృష్టి
కూటమిలో కొనసాగుతూనే పార్టీ బలోపేతం పైన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టి సారిస్తున్నారు. ప్రణాళికాబద్ధంగా పార్టీని పటిష్ఠపరచడంపై  అందరూ దృష్టి పెట్టాలని పార్టీ నేతలకు సూచించారు. త్రిశూల వ్యూహం అమలు చేయాలని నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దం కావాలని పవన్ నిర్దేశించారు. అదే సమయంలో జిల్లా పర్యటనలకు పవన్ సమాయత్తం అవుతున్నారు.
“కూటమిని బలపరుస్తూనే జనసేన పార్టీ బలోపేతానికి ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయాలి. దీనికోసం త్రిశూల వ్యూహాన్ని అమలు చేయాలి. ఇందుకు సంబంధించిన విధివిధానాలు త్వరలోనే తెలియజేస్తాం. వాటిని ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో అమలు చేయాలి” అని జనసేన ప్రజాప్రతినిధులకు పవన్‌ కల్యాణ్‌ సూచించారు. శనివారం రాత్రి మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ శాసన సభ పక్ష సమావేశం నిర్వహించారు. 
 
మూడు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో జనసేన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పాలన, రాజకీయపరమైన అంశాలపై పవన్‌ వారికి దిశా నిర్దేశం చేశారు. “ప్రజా ప్రతినిధులుగా అందరం యువత, మహిళల ఆకాంక్షలను అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఈ వర్గాల అభివృద్ధి, సంక్షేమం, రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి” అని పవన్‌ స్పష్టం చేశారు.
 
 “ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ 5 నియోజకవర్గాల చొప్పున బాధ్యత తీసుకొని పార్టీ శ్రేణులతో మమేకం కావాలి. జనసైనికులు, వీర మహిళలకు భరోసా కల్పించాలి. వారితో పాటు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించండి. ప్రభుత్వ పథకాల అమలు, లబ్ధిదారులకు సంక్షేమం ఏ విధంగా చేరుతోంది, యువతకు నైపుణ్య శిక్షణ, మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం తదితర విషయాలపై దృష్టి సారించండి” అని చెప్పారు.
 
ప్రభుత్వంద్వారా చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలని పేర్కొంటూ ఇందుకోసం ఒక్కోఅంశంపై ఒక్కో కమిటీ వేసుకుందామని, ఆరు వారాల్లోగా ఆయా కమిటీలు నివేదికలు అందించాలని పవన్‌ తెలిపారు. జనసైనికులు, వీర మహిళలకు భరోసా కల్పించాలని, వారితో పాటు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించాలని నిర్దేశించారు.

సార్వత్రిక ఎన్నికల్లో బలం ఉన్న నియోజకవర్గాల్లోనూ పొత్తు ధర్మం ప్రకారం పోటీకి దూరంగా ఉన్నామని అక్కడి జనసేన కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని నిర్దేశించారు. యువతకు, కొత్త నాయకత్వానికి ప్రోత్సాహం ఇవ్వాలని పవన్ కల్యాణ్​ స్పష్టం చేశారు.