విశాఖ సముద్ర తీర కోత నివారణకు కేంద్రం రూ 222 కోట్లు

విశాఖ సముద్ర తీర కోత నివారణకు కేంద్రం రూ 222 కోట్లు
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం విశాఖపట్నం జిల్లాలోని తీర ప్రాంత పరిరక్షణకు రూ.222.22 కోట్ల మంజూరుకు అనుమతిచ్చింది. ఇందులో కేంద్రం వాటా రూ.200 కోట్లు అని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో ప్రభావితమయ్యే ప్రాంతాలకు రికవరీ, రీకన్‌స్ట్రక్షన్‌ ప్రాజెక్టు కింది జాతీయ ప్రకృతి వైపరీత్య నిర్వహణ నిధి నుంచి ఈ సాయం అందించనుంది. 
 
జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థతో కలిసి విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) ఈ ప్రాజెక్టు చేపట్టనుంది. ఈ పనుల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) రూపకల్పన ఇదివరకే పూర్తయింది. ఈ నిధులతో విశాఖ తీర ప్రాంతంలో రక్షణ చర్యలు చేపట్టనున్నారు.  వీఎంఆర్‌డీఏ సముద్ర తీర ప్రాంతంలో కోతను తగ్గించడానికి ప్రణాళికలను రూపొందించింది. ఇక దీనికోసం కేంద్రం నిధులు ఇస్తున్న క్రమంలో 30 కిలోమీటర్ల తీరప్రాంతాన్ని రక్షించడానికి చర్యలు చేపట్టనుంది. 
 ఈ ప్రాజెక్టు నిధులలో 90 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. మిగిలిన 10 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారిన ప్రతిసారి విశాఖ తీరం దెబ్బతింటోంది. అలల తీవ్రతకు బీచ్‌ రోడ్డు కోతకు గురవుతోంది. పర్యాటక ప్రదేశాలు సముద్రంలో కలిసిపోతున్నాయి. ఏకంగా బీచ్‌లే మాయమైపోతున్నాయి.
జాతీయ తీర ప్రాంత పరిశోధన కేంద్రం (ఎన్‌సీసీఆర్‌) అంచనా ప్రకారం 1990-2018 మధ్య కొన్ని మీటర్ల ప్రాంతం సముద్రంలో కలిసిపోయింది. ఈ 28 ఏళ్లలో 40.1 శాతం ప్రాంతం స్థిరంగా ఉంటే 37.5 శాతం ప్రాంతంలో కొత్తగా ఇసుక మేటలు ఏర్పడ్డాయి. 22.4 శాతం తీరం కోతకు గురైంది. ప్రస్తుతం ఉమ్మడి విశాఖ జిల్లాలో తీర ప్రాంతం కోతకు 16% గురైనట్లుగా నమోదయింది. అలాగే 37.5% ప్రాంతంలో కొత్త ఇసుక మేటలు ఏర్పడ్డాయి.

విశాఖ బీచ్‌ రోడ్డులో పెదవాల్తేరు వద్ద జాలరిపేట, జాలరి ఎండాడ, శివగణేష్‌నగర్, భీమిలి వద్ద మత్స్యకార గ్రామాల వద్ద తీరం కొట్టుకుపోతోంది. ఎక్కువగా గోకుల్‌పార్క్, కురుసురా జలాంతర్గామి ప్రాంతాలకు తరచూ ముప్పు ఏర్పడుతోంది. కొత్త నివారణకు రూ.180 కోట్లతో నిర్మాణ పనులు, మరో రూ. 40 కోట్లతో నిర్మాణేతర పనులు చేపట్టనున్నారు. తీరంలో రక్షణ గోడలు, రిటెన్షన్‌ గోడలు, గ్రోయిన్లు నిర్మిస్తారు. షెల్టర్‌ బెల్టులు ఏర్పాటు చేస్తారు.
భీమిలి వద్ద మత్స్యకార బోట్లు వచ్చే ప్రదేశం, మంగమారిపేట, జాలరి ఎండాడ నుంచి శివగణేష్‌నగర్‌ వరకు రక్షణ గోడలు నిర్మించనున్నారు. భీమిలి బీచ్‌ రోడ్డు, తోట వీధి, ఆర్‌కే బీచ్‌ రోడ్డులో రిటెన్షన్‌ గోడలు, గోకుల్‌ పార్క్‌తో పాటు మరికొన్ని చోట్ల గ్రోయిన్లు నిర్మిస్తారు. కోతకు గురవ్వకుండా రుషికొండ, చేపల ఉప్పాడలో చర్యలు చేపడతారు.