భారత దేశ స్వాతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర

భారత దేశ స్వాతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర
ఆకారపు కేశవరాజు
విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ సహమంత్రి
 
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘాన్ని పూజ్య డాక్టర్ హెడ్గేవార్ జీ 1925లో ప్రారంభించారు. సహజంగానే డాక్టర్ జీ ఆజన్మ దేశభక్తుడు,  స్వాతంత్రం కోసం అనేక పద్దతులలో పని చేశారు కాబట్టి వారి చేతిలో పురుడు పోసుకున్న సంస్థ దేశం హితం గురించి స్వాతంత్ర పోరాటం కోసం ఎనలేని పాత్రను తనదైన శైలిలో నిర్వర్తించింది. సంఘ స్వయంసేవకులు జాతి కోసం తమ జీవితాలను త్యాగం చేశారు.  
 
డాక్టర్ జీ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం మనం తప్పనిసరి చేస్తూ రోజు ఒక గంట సేపు శాఖలో ఉండి మిగతా సమయమంతా కూడా ఇవ్వవచ్చు అని చెప్పారు. స్వాతంత్ర పోరాట కోసం ముందస్తుగా కాంగ్రెస్ ఉద్యమ నిర్మాణం చేసింది కాబట్టి ఇంకో రాజకీయ కేంద్రం ఉండకూడదని, పూజ్య డాక్టర్ జీ ఆర్ఎస్ఎస్ పేరుతో కాకుండా కాంగ్రెస్ చేస్తున్నటువంటి స్వాతంత్రోద్యమ కార్యక్రమాలలో అందరూ కూడా పాల్గొనాలని సూచించారు. 
 
ఎందుకంటే ఒకటే వేదిక, ఒకటే జెండా, ఒకటే బ్యానర్, ఒకే కార్యక్రమం ఉండాలనే భావాన్ని వ్యక్తపరచి ఆయన కూడా స్వయంగా పాల్గొన్నారు.  1929 ఏప్రిల్ 27,28 తేదీలలో వార్ధలో జరిగిన శిబిరంలో అక్కడికి వచ్చిన స్వయంసేవకులకు స్వాతంత్ర్య సాధనకు తమ సరస్వాన్ని త్యాగం చేసేందుకు సిద్ధం కావాలని ఉద్బోధించారు . 1929 మార్చ్ లో సైమన్ కమిషన్ ను వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలో సంఘం పాలుపంచుకుంది. 
 
స్వతంత్ర ఉద్యమం సమయంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ప్రతిజ్ఞ చివరలో దేశానికి స్వాతంత్రం తీసుకురావడం కోసం మనం పని చేయాలని ప్రతిజ్ఞ చెయ్యడం జరిగేది. అనేకమంది సంఘ స్వయంసేవకులు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. ఈ విషయం కొద్దిమందికే తెలుసు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఎలాంటి ప్రచార ఆర్భాటం కోరుకోదు. స్వయంసేవకులు సహజంగానే స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. బ్రిటిష్ వాళ్ళ లాటి దెబ్బలకు తూటాలకు ఎదురోడ్డారు.

పూజ్య డాక్టర్ హెడ్గేవార్ జీ  పాఠశాల విద్య సమయంలో నీల్సిటీ హైస్కూల్ లోపల విక్టోరియా రాణి 60 వసంతాల  పట్టాభిషేక మహోత్సవాల సందర్భంగా వితరణ చేసినటువంటి మిఠాయిలను తినకుండా విసిరివేసి బ్రిటిష్ వాళ్ళ సామ్రాజ్యవాదుల అహంకార ధోరణి వ్యతిరేకించారు. పాఠశాలలోనే వందేమాతర నినాదాన్ని అందరితో చెప్పించి చిన్న వయస్సులోనే స్వాతంత్ర పోరాటానికి ఊపిరులు పోశారు.
 
విప్లవకారులతో డాక్టర్జీ 
కలకత్తా లో డాక్టర్ కోర్స్ చదువుతున్నప్పుడు అనుశీలన సమితి అనే విప్లవ సంస్థతో కలిసి పని చేస్తుండేవారు. ఆ రహస్య సంస్థలో తను కొకైన్ అనే సంకేత నామంతో పని చేశారు. పాండురావ్ కాంఖజి అనే స్వదేశ్ ఉద్యమకారుడు డాక్టర్ జి, ఆయన  మిత్రులు అందరూ స్వదేశీ ఆవశ్యకతను చాటి చెబుతూ చేసిన ఉపన్యాసాలు బాగున్నాయని కేసరి పత్రికలో రాయడం జరిగింది. 
 
డాక్టర్ జీ వైద్య విద్య పూర్తి అయ కలకత్తా నుండి నాగపూర్ వచ్చిన తర్వాత కూడా విప్లవకారుల తో సంబంధాలాను కొనసాగించారు. ఆ పరిచయాలతోనే  దేశంలో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేఖంగా సాయుధ తిరుగుబాటు తీసుకురావడం కోసం ప్రయత్నం చేశారు. దీనిగురుంచి  పీఎల్ జోషి ఎన్ ఆర్ ఇమ్మదర్ సంపాదకత్వంలో వచ్చిన  “విదర్భలో రాజకీయ సమీకరణ: తిలక్ రాజకీయ ఆలోచన, ఆలోచనలు” గ్రంధంలో వ్రాసిన వ్యాసంలో (పేజీ-370) ప్రస్తావించారు. 
 
కాంగ్రెస్ ఉద్యమాలలో డాక్టర్జీ
 
పూజ్య డాక్టర్ హెడ్గేవార్ జీ తన స్నేహితులతో కలిసి కాంగ్రెస్ లో చేరి సహాయ నిరాకరణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. దీనికి గాను బ్రిటిష్ ప్రభుత్వం పూజ్య డాక్టర్ హెడ్గేవార్ జీ మీద కేసు పెట్టి ఒక సంవత్సరం జైలు శిక్ష (ఆగష్టు 21, 1921 నుండి 1922 జులై 12 వరకు) వేయడం జరిగింది. పూజ్య డాక్టర్ హెడ్గేవార్ జీ   బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారని ప్రముఖ మార్క్సిస్ట్ చరిత్రకారుడు బిపిన్ చంద్ర తను రాసిన పుస్తకం “ఆధునిక భారత్ లో కమ్యూనిజం” (పేజీ 332)లో తెలిపారు.
 
గాంధీజీ ఉప్పు సత్యా గ్రహం ఏప్రిల్ 6, 1930న చెయ్యాలని పిలుపు ఇచ్చినప్పుడు పూజ్య డాక్టర్ హెడ్గేవార్ జీ తన సర్ సంఘ చాలక్ బాధ్యతను డా ఎల్ వి పరంజాపేకు అప్పగించి,  ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. అంతే కాదు అటవీ సత్యా గ్రాహంలో కూడా పాల్గొని 9 నెలల అంకోలా జైల్లో జైలు శిక్ష కూడా అనుభవించారు. తనతో పాటు అప్పుడు సంఘంలో ముఖ్యమైన కార్యకర్త అప్పాజీ జోషి కూడా పాల్గొన్నారు. 
 
అటవీ సత్యాగ్రహం సందర్భంలో పూజ్య డాక్టర్ హెడ్గేవార్ జీ “స్వాతంత్ర సాధన కోసం బ్రిటిష్ వాడి షూ పాలిష్ చేసే పని అయినా, అదే బూట్ తో బ్రిటిష్ వాడి తల మీద కొట్టడం” లాంటి ఏ పని అయినా  చెయ్యాలని పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని  ప్రఖ్యాత కమ్యూనిస్టు నాయకుడు ఇ ఎం ఎస్ నంబూధ్రిపాద్ రాసిన పుస్తకం “బిజెపి- ఆర్ఎస్ఎస్ ఇన్ ది సర్వీస్ అఫ్ ది రైట్ రియాక్షన్స్” అనే విమర్శనాత్మక పుస్తకంలో పేర్కొన్నారు.
డిసెంబర్ 31, 1929 లో కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్యం కోసం రావి నది ఒడ్డున తీర్మానం చేసింది. ఈ సందర్బంగా జనవరి 26, 1930న  స్వాతంత్ర దినోత్సవం దేశమంతటా జరపాలని నిర్ణయించారు. పూజ్య డాక్టర్ హెడ్గేవార్ జీ అన్ని శాఖలలో కూడా స్వాతంత్ర సందేశాన్ని వినిపించాలని చెప్పారు. ఆ మేరకు జనవరి 21, 1930న ఒక సూచనపత్రాన్ని అన్ని శాఖలకు పంపారు. ఈ విషయాన్ని సంఘంను నిరంతరం విమర్శించే సుమిత్ సర్కార్ `ఖాకి అండ్ సాఫరన్ ఫ్లాగ్’ అనే రచనలో తెలిపారు.
 
ఆర్ఎస్ఎస్ పై బ్రిటిష్ పాలకుల కన్ను
 
1932లో సెంట్రల్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి ఇ. గోర్డెన్ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు కూడా ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలలో పాల్గొనకూడదని నిషేధం విధిస్తూ ఒక ఉత్తర్వు జారీ చేశారు. సంఘంను  మతతత్వ సంస్థ అనే ముద్ర వేసే ప్రయత్నం చేశారు. మార్చ్, 1934 లో బడ్జెట్ సమావేశాల్లో వి డి కోల్ట్ అనే కౌన్సిల్ మెంబర్ ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేఖంగా వాదించారు. ముస్లిం కౌన్సిల్ మెంబర్ ఎం ఎస్ రెహమాన్ ఆర్ఎస్ఎస్ ను సమర్దిస్తూ మాట్లాడారు. 
 
1934 జనవరి 8 న పొలిటికల్ ఏజెంట్ భోపాల్  సంస్థానంలోని ప్రభుత్వ కార్యదర్శికి  ఆర్ఎస్ఎస్ రహస్యంగా తుపాకీ పేల్చడంలో శిక్షణ ఇచ్చే రైఫైల్ క్లబ్ నడుపుతుందని సంచాచారం ఇచ్చారు. భోపాల్ లో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలను నిలుపుదల చెయ్యాలని భోపాల్ సంస్థానానికి హెచ్చరిక చేశారు. మధ్య ప్రాంతాలలో ఆర్ఎస్ఎస్ లో ప్రముఖ్ కార్యకర్త ఘాటె పై క్రిమినల్ ప్రొసీసర్  క్రింద ఆరోపణలు దాఖలు చేశారు.
 
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్, భారత కమ్యూనిస్టు పార్టీ సుమారుగా రెండు ఒకే సంవత్సరంలో అంటే అనగా 1925 లో ప్రారంభించడం జరిగింది. కానీ కమ్యూనిస్టు పార్టీ బ్రిటిష్ వాళ్ళకి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేసింది. వాళ్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ ను తిట్టారు. నేతాజీ ఎప్పుడైతే దేశం బయటకు వెళ్లి అజాదు హిందు ఫౌజు ప్రారంభించాడో అప్పుడు అందరూ నేతాజీని హిట్లర్ ఏజెంట్ అని చెప్పే దూషించారు.
 
నేతాజీతో హెడ్గేవార్ పరిచయం
 
1927లోనే నేతాజీ, డాక్టర్ హెడ్గేవర్ లకు పరిచయం ఉన్నది. 1928లో కలకత్తాలో వారు కలిసి మాట్లాడుకున్నారు. సంఘాన్ని గూర్చి విని నేతాజీ ప్రభావితులు అయ్యారు.1938 అక్టోబర్ 21న మరో కాంగ్రెస్ నాయకుడు  శంకరరాందేవ్ కు రాసిన లేఖ లో యువకులపై సంఘ  సత్ప్రభావం గురుంచి చర్చించారు.1939లో డాక్టర్ హెడ్గేవర్ జీ ని కలవడానికి నాగపూర్  వచ్చారు. 
 
ఆ సమయంలో డాక్టర్ హెగ్డేవార్  అనారోగ్యంతో ఉన్నారు. ఆరోగ్యం బాగుపడిన తర్వాత సమీప భవిష్యత్తులో నేతాజీతో కలవాలనే ప్రతిపాదన అంగీకరించారు. నేతాజీ మళ్ళీ  డాక్టర్ హెడ్గేవార్ అంతిమ శ్వాసకు సమీపంలో ఉన్నప్పుడు  1940 జూన్ 20న  కలవడానికి వచ్చారు. కానీ డాక్టర్ హెడ్గేవార్  మాట్లాడే పరిస్థితులలో లేనందున వారి చెంత కొద్ది సేపు కూర్చుండి, ఆ తరువాత వారికి ప్రణామం చేసి వెళ్లిపోయారు

1940లో ఒక బ్రిటిష్ హోం డిపార్ట్మెంట్ నివేదిక ఇలా చెప్పింది: ‘ఆర్ఎస్ఎస్ సంస్థ తీవ్రంగా బ్రిటిష్ వ్యతిరేకి. స్వాతంత్రం గురుంచి  మాట్లాడుతుంది’. ఆర్‌ఎస్‌ఎస్ వాలంటీర్లను ‘సైన్యం, నేవీ, పోస్టల్, టెలిగ్రాఫ్, రైల్వే, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ వంటి వివిధ ప్రభుత్వ విభాగాలలో ప్రవేశపెట్టారు. సమయం వచ్చినప్పుడు పరిపాలనా విభాగాలపై పట్టు సంపాదించడం కోసం ప్రయత్నం చేస్తుంది’ అని సిఐడి నివేదిక వెల్లడించింది. 

 
ఆగస్టు 5, 1940 న డిఫెన్స్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం, బ్రిటిష్ ప్రభుత్వం కసరత్తులు, యూనిఫాం వాడకం, వ్యాయామాలను నిషేధించే ఆర్డినెన్స్ను ప్రకటించింది.  వందలాది మంది ఆర్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు ఈ ఉత్తర్వులను ఉల్లంగించినందుకు అరెస్టు చేశారు.
క్విట్ ఇండియా ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ 
 
1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో చాలా మంది స్వయంసేవకులు పాల్గొన్నారు. ప . పూ గురూజీ 1942 ఏప్రిల్ 27న పూణే లో జరిగిన శిబిరలో బ్రిటిష్ ప్రభుత్వానికి స్వార్థపూరితంగా సహాకరించే వారిని విమర్శించారు. దేశం కోసం త్యాగం చెయ్యడం కోసం సిద్ధంగా ఉండాలని పిలుపిచ్చారు. దీనిని బ్రిటిష్ గూడాచారి సంస్థ తన రిపోర్ట్ లో పేర్కొన్నది. ( No.D home pol (intelligence)) section F.No 28 pol ). అనేకమంది స్వయంసేవకులు సమాంతర ప్రభుత్వాన్ని విదర్భ ప్రాంతం లో ఏర్పాటు చేశారు. మీరట్ జిల్లా మీవాన్  అనే తహసిల్ కార్యాలయంపై 3 రంగుల జండా ఎగురవేశారు.
 
దాదా నాయక్ , రాందాస్ రాంపూర్ అనే స్వయంసేవకులు బ్రిటిష్ వాళ్ల చేతిలో చనిపోయారు . 4వ సర్ సంఘచాలక్ ప .పూ రజ్జు బయ్యగారు ఆనాటి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ట్రిబ్యూన్ పత్రికలో 2003లో ఈ విషయాన్ని పేర్కొన్నారు. (www.tribuneindia. com 2003). 
 
క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొంటున్న అజ్ఞాత ప్రముఖ నాయకులకు స్వయంసేవక్ ల ఇళ్ల లో సురక్షిత మైన వసతి కల్పించారు. ఈ విషయాన్ని ప్రముఖ కమ్యూనిస్టు నాయకురాలు అరుణ అసఫ్ అలీ తనకు ఢిల్లీ ప్రాంత సంఘచాలక్ లాల హంస రాజ్ గుప్తా ఇంట్లో 10-15 రోజులు అజ్ఞాతంలో ఉన్నట్టు 1967లో ఓ హిందీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పారు. 
 
ఢిల్లీ సురుచి ప్రకాశన్ వాళ్ళు ప్రచురించిన చిత్తరంజన్ రాసిన “ఆర్ఎస్ఎస్-స్వాతంత్ర్య ఉద్యమం” గ్రంధంలో ఇలాంటివి అనేకం చూడవచ్చు. అజ్ఞాతంలో ఉన్న వారికి వైద్య సహకారం, ఉచితంగా న్యాయ సహకారం చెయ్యడం లాంటి పనులు అన్ని ఆనాడు స్వయంసేవకులు చేశారు.
 
దేశ విభజన సమయంలో ఆర్ఎస్ఎస్
 
1947లో  భారత దేశం రెండు ముక్కలుగా విడిపోయినప్పుడు పాకిస్తాన్ నుండి భారత్ కు రావాలనుకున్న చిట్ట చివరి శరణార్థి వరకు వారి రక్షణ బాధ్యతను స్వయంసేవకులు తీసుకుని, వచ్చిన తర్వాత వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందించి, సాధారణ జీవితం గడపడానికి తగిన తోడ్పాటును అందించారు.
 
కశ్మీర్ విలీనం కోసం  రెండవ సర్ సంఘచాలక్   పూజనీయ గురూజీ చేసిన ప్రయత్నం మరువలేనిది. అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్  అభ్యర్థన మేరకు ప్రత్యేక విమానంలో కాశ్మీర్ కు వెళ్లి మహారాజా హరీసింగ్ ను కలిసి కాశ్మీర్ ను భారతదేశం లో విలీనం చెయ్యడానికి ఒప్పించారు. ఆ ఒప్పందం ప్రకారం జమ్మూ కాశ్మీర్ భారత్ లో విలీనం కావడం జరిగింది. 
 
స్వాతంత్రం వచ్చిన కొద్దిరోజులలోనే పాకిస్తాన్ యుద్ధానికి వస్తే శ్రీనగర్ లో మంచుతో కప్పబడి ఉన్న విమానాశ్రయంను వైమానిక దళానికి ఉపయోగించే విధంగా కొన్ని గంటల్లోనే స్వయంసేవకులు బాగు చేసి సైన్యానికి సహకరించి జమ్మూ కాశ్మీర్ ను సంరక్షించడంలో ఎనలేని కృషి చేశారు.

దేశానికి స్వతంత్రం ఆగస్టు 15న రాగా హైదరాబాద్ స్టేట్ కు నిజాం నవాబు పాలకుడుగా ఉంటూ స్వాతంత్ర్య ఇస్లాం దేశంగా మార్చడం కోసం చేస్తున్న ప్రయత్నాలను గమనించి అప్పటి మహారాష్ట్రలో సంఘంలో బాధ్యతలు కలిగిన స్వయంసేవకులు మరొకరికి ఆ బాధ్యతను అప్పగించి “హైదరాబాద్ స్టేట్ విముక్తి” కోసం సత్యాగ్రహం చేయడానికి వందలాది స్వయం సేవకులు వచ్చారు. 

 
అనేకచోట్ల వారిని అడ్డగించి అరెస్టు చేసి ఆనాటి ఆదిలాబాద్ జిల్లాకు జిల్లా కేంద్రంగా ఉన్న ఇప్పటి ఆసిఫాబాద్, అప్పటి జనగామ జైల్లో బంధించారు.  జైలు శిక్ష అనుభవించిన  స్వయంసేవకుల వివరాల జాబితా ఇప్పటికి జైలు డైరీలో ఉంది. వీరందరూ ఆర్య సమాజం, హిందూ మహాసభ వంటి వివిధ సంస్థల పేరుతో వచ్చినటువంటి బాధ్యత కలిగిన స్వయం సేవకులు.

ఇక పోర్చుగీసు వాళ్ళ చేత నుండి గోవా విముక్తి చేయడం కోసం, దాద్రానగర్ హవేలి విముక్తి కోసం జరిగిన పోరాటాలలో స్వయంసేవకుల కీలక పాత్ర, సంఘ ప్రచారకులు `కర్ణాటక కేసరి’ జగన్నాథరావు జోషి నేతృత్వం అనిర్వచనీయమైనది.

1954లో ఆజాది గోమంతక్ దల్ అనే దళం ఆద్వర్యం లో అనేక మంది యువకులు దాద్రా నగర్ హవేలీ ని చేజిక్కించుకోవడంలో ముఖ్య పాత్ర వహించారు. ఈ ప్రయత్నంలో అనేకమంది స్వయంసేవకులు ప్రాణాలను అర్పించారు. ఈ విషయాన్ని “దాద్రా, నాగర్ హవేలి: గతం, వర్తమానం” గ్రంధంలో పీఎస్ లీలే వ్రాసారు.

 
100 మందికి పైగా ఆ రోజు పోరాటంలో పాల్గొన్న స్వయంసేవక్  లను అప్పటి మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం స్వాతంత్ర సమర యోధులుగా  గుర్తించింది.  కృష్ణా జిల్లా ఉయ్యురుకు చెందిన సూరి సీతారాం అనే స్వయంసేవక్ తన దళంతో కలిసి ఈ పోరాటంలో పాల్గొని అమరుడు అయ్యాడు. గోవా స్వాతంత్ర వీరుల మ్యూజియంలో, ఎర్రకోటలో  సూరి సీతారాం చిత్రపటాన్ని మనం చూడవచ్చు.

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ స్వతంత్ర పోరాటంలో పాల్గొనలేదు అనేటువంటి గోబెల్స్ ప్రచారం అనేకమంది చేస్తున్నారు. సత్యాన్ని అసత్యంగా చూపించాలని వారి ప్రయత్నం. సంఘం ఏ పద్దతిలో స్వతంత్ర ఉద్యమం లో పాల్గొన్నది అనేకమందికి తెలుసు. కానీ పని గట్టుకుని దుష్ప్రచారం చెయ్యడం కోసం పని చేస్తున్నారు.  సంఘం ప్రారంబించినప్పటి నుండి దేశ స్వాతంత్ర్యం, సార్వభౌమత్వా పరిరక్షణ కోసం  గొప్పనైన పాత్ర తనదైన శైలిలో నిర్వహిస్తూ వస్తున్నది. దేశం పట్ల స్వయంసేవకుల త్యాగనిరతి, అంకిత భావం  అనిర్వచనీయమైనది.