భారతీయ సినిమాలంటే ఎంతో ఇష్టం.. పుతిన్

భారతీయ సినిమాలంటే ఎంతో ఇష్టం.. పుతిన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ భారతీయ సినిమాలంటే తనకెంతో ఇష్టమని చెప్పారు. భారతీయ సినిమాలకు రష్యాలో చాలా ప్రజాదరణ ఉందని తాజాగా సోచిలో జరిగిన ఓ కార్యక్రమంలో పుతిన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “భారతీయ సినిమాలంటే నాకు చాలా ప్రేమ. అందుకే భారతీయ సినిమాలను రాత్రింబవళ్లు ప్రసారం చేసేందుకు ప్రత్యేకంగా ఓ టెలివిజన్‌ ఛానెల్‌ను నిర్వహిస్తున్నామని” ఆయన పేర్కొన్నారు.
 
 బహుశా భారత్‌ వెలుపల ఆ దేశానికి చెందిన సినిమాలను నిరంతరం ప్రసారాలు చేస్తున్న ఏకైక దేశం రష్యానేనని ఆయన చెప్పారు. భారత్‌- రష్యా ఈ రెండు దేశాల మధ్య రాజకీయ, దౌత్య సంబంధాలు మాత్రమే గాక, సాంస్కతిక, మానవీయ బంధం కూడా బలంగా ఉందని ఆయన పేర్కొన్నారు. చాలామంది భారతీయ విద్యార్థులు రష్యాలో చదువుతున్న విషయాన్ని పుతిన్‌ గుర్తుచేశారు. 
 
భారతీయ సంస్కతి, ముఖ్యంగా సినిమాలపై రష్యన్‌లు విపరీతమైన ఆసక్తి కనబరుస్తారని ఆయన తెలిపారు.  కాగా, భారతీయ సినిమాలపై పుతిన్‌ తన ప్రేమను వ్యక్తపర్చడం ఇదే తొలిసారి కాదు. గతేడాది బ్రిక్స్‌ సదస్సు సమయంలోనూ ఆయన తన ఇష్టాన్ని వ్యక్తపరిచారు. భారతీయ సినిమాలను ప్రచారం చేసేందుకు ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.
 
సోవియట్‌ కాలం నుంచే రష్యాలో భారతీయ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. రాజ్‌కపూర్‌, మిథున్‌ చక్రవర్తి లాంటి బాలీవుడ్‌ స్టార్ల పేర్లు ఇప్పటికీ ప్రతి రష్యన్‌ ఇంట్లో వినిపిస్తాయి. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో పాశ్చాత్య సినిమాలు రాకుండా మాస్కో నిషేధం విధించింది. దాంతో బాలీవుడ్‌ చిత్రాలకు ఆదరణ పెరిగింది. 
 
1982లో మిథున్‌ చక్రవర్తి నటించిన ‘డిస్కో డ్యాన్సర్‌’ మూవీ సోవియట్‌ యూనియన్‌లో ప్రభంజనం సష్టించింది. ఆ సినిమా చూసేందుకు జనాలు బారులు తీరారు. అది అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ సినిమాగా నిలిచింది. ఆ సినిమాలోని ‘జిమ్మీ జిమ్మీ ఆజా ఆజా’ అనే పాట రష్యాలో మార్మోగిపోయింది.