విజయ్‌ పార్టీకి హైకోర్టులో చుక్కెదురు.. సిట్ విచారణకు ఆదేశం

విజయ్‌ పార్టీకి హైకోర్టులో చుక్కెదురు.. సిట్ విచారణకు ఆదేశం

ప్రముఖ తమిళ నటుడు విజయ్ కి చెందిన టీవీకే పార్టీకి మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరుతూ టీవీకే పార్టీ దాఖలు చేసిన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. మరోవంక ఈ ఘటనపై సిట్‌ విచారణకు ఆదేశించింది. ఐపీఎస్ అధికారి అస్రాగార్గ్ నేతృత్వంలో సిట్‌ దర్యాప్తునకు ఆదేశాలు ఇచ్చింది. 

టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌ కరూర్‌లో నిర్వహించిన ప్రచార ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరుతూ విజయ్‌ పార్టీ మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ పై శుక్రవారం మధురై బెంచ్‌ విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం టీవీకే పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. కరూర్‌ ఘటనపై పోలీసుల దర్యాప్తు ఇంకా ప్రారంభదశలోనే ఉందని, ఇలాంటి సమయంలో సీబీఐ దర్యాప్తు కోరడం సరికాదని పేర్కొంది. 

అంతేకాదు కోర్టులను రాజకీయ వేదికలుగా మార్చవద్దని ఘాటుగా  హెచ్చరించింది. మరోవైపు కరూర్ తొక్కిసలాటపై సీబీఐ దర్యాప్తు కోరుతూ బీజేపీ నాయకురాలు ఉమా ఆనందన్, బీజేపీ న్యాయవాది జీఎస్‌ మణి దాఖలు చేసిన పిటిషన్‌లను మద్రాస్ హైకోర్టు తిరస్కరించింది. ఈ పిటిషన్ల విచారణ సందర్భంగా రాజకీయ పార్టీలకు న్యాయస్థానం కీలక సూచనలు చేసింది. 

భవిష్యత్తులో నిర్వహించే బహిరంగ సభలు, సమావేశాల్లో తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాలు, ఆంబులెన్స్‌ సేవలు, నిష్క్రమణ మార్గాలు వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని సూచించింది. ప్రజల ప్రాణాల రక్షణకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసింది.  మరోవైపు రాజకీయ పార్టీ నేతల ర్యాలీలపై ప్రామాణిక నిర్వహణ విధాన నిబంధనలు (ఎస్ఓపీ) రూపొందించే వరకు హైవేలపై ఏ పొలిటికల్ పార్టీ సభలకు పోలీసులు అనుమతివ్వరని తమిళనాడు ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది.

టీవీకే నామక్కల్‌ జిల్లా కార్యదర్శి సతీష్‌కుమార్‌ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కూడా కోర్టు కొట్టివేసింది. ర్యాలీ సమయంలో జన సమూహాన్ని నియంత్రించడంలో టీవీకే పార్టీ ఎందుకు విఫలమైందని ఆయనను న్యాయమూర్తి ప్రశ్నించారు. ఘటన తర్వాత టీవీకే నేతలు ఎక్కడికి వెళ్లారని, బాధితులను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించింది.  అంతేకాదు టీవీకే చీఫ్‌ వాహనాన్ని ఎందుకు సీజ్‌ చేయలదేని కూడా ప్రశ్నించింది.  కరూర్ తొక్కిసలాట బాధితులకు అదనపు పరిహారం అందించాలని కోరుతూ ఓ పిటిషన్‌ దాఖలైంది. దీనిపై స్పందన కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.