సందడిగా దత్తాత్రేయ `అలయ్ బలయ్’

సందడిగా దత్తాత్రేయ `అలయ్ బలయ్’
 
దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గత 20 ఏళ్లుగా నిర్వహిస్తున్న “అలయ్ బలయ్” ఉత్సవం ఈ సంవత్సరం కూడా సందడిగాజరిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌ వేదికగా తెలంగాణ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ, జాతీయ సేవలో ప్రాణాలు అర్పించిన వీరులకు గౌరవం తెలుపుతూ ఈ ఉత్సవం సాగింది.

బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు, ఆహార అలవాట్లు చాటిచెప్పేలా అలయ్​ బలయ్​ కార్యక్రమం సాగుతోంది. ఈ సందర్భంగా దత్తాత్రేయ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం కళాకారులతో కలిసి వీహెచ్‌ డప్పు వాయించి సందడి చేశారు. ఈసారి ‘ఆపరేషన్ సింధూర్’ థీమ్‌తో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 

 
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కళారూపాలను ప్రదర్శించే ఈ వేడుక ఆత్మీయతకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు నాగార్జున, బ్రహ్మానందం లను సత్కరించారు. ఈ మేరకు సినీ, రాజకీయ ప్రముఖులు మాత్రమే కాకుండా కవులు, సామాజిక నేతలు సైతం పాల్గొన్నారు.మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ కట్టర్, కిషన్ రెడ్డి, అర్జున్ రామ్ మేఘ్వాల్, జయంతి చౌదరి, బండి సంజయ్, భూపతిరాజు శ్రీనివాస వర్మ, తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ, బీజేపీ ఎంపీ లక్ష్మణ్, బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, సీపీఐ నేత నారాయణ, ప్రొఫెసర్ కోదండరామ్, మాజీ ఎంపీ వి.హనుమంతావు, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, టాలీవుడు ప్రముఖ నటులు నాగార్జున, బ్రహ్మానందం తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

బండారు దత్తాత్రేయ వీరందరికి కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఇక అలయ్ బలయ్‌కు వచ్చే అతిథుల కోసం 87 రకాల ప్రత్యేక తెలంగాణ వంటకాలు సిద్ధం చేశారు. మటన్, తలకాయ కూర, పాయ, బోటి, చికెన్, చేపల కూర, పచ్చి పులుసు, సర్వ పిండి వంటి రుచికరమైన వంటకాలతో అతిథులకు విందు ఏర్పాటు చేశారు. మరోవైపు ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందేశమిచ్చారు. తెలంగాణ సంస్కృతి, ఆహారపు అలవాట్లను ప్రతిబింబించే విధంగా అలయ్ బలయ్ కార్యక్రమం కొనసాగుతోంది, ఇది సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెబుతోందని కొనియాడారు. సోదరభావాన్ని పెంపొందించే వేడుక ‘అలయ్‌ బలయ్‌’ అని ఆమె పేర్కొన్నారు. 
 
అన్ని వర్గాల ప్రజలను ఒక్కచోట చేర్చి తెలంగాణకు చెందిన గొప్ప సంస్కృతిని ప్రదర్శిస్తోందని చెబుతూప్రజల్లో ఐక్యత, సమాజ విలువలను వ్యాప్తి చేసేందుకు ఓ సామాజిక సమావేశంగా ఇది ఉపయోగపడుతోందని ఆమె స్పష్టం చేశారు. అలయ్‌ బలయ్‌ వేడుకలు ఘనంగా జరగాలని కోరుకుంటున్నానని రాష్ట్రపతి పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయ నాయకుల మధ్య ఐక్యత కోసం బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.