
ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాద రావణుడిపై జరిపిన విజయమని ముర్ము పేర్కొన్నారు. ఆ క్రమంలో మన దేశ సైనికులకు వందనం చేస్తున్నామని స్పష్టం చేశారు. చెడుపై మంచి, అహంకారంపై వినయం, ద్వేషంపై ప్రేమకు ప్రతీకగా ఈ దసరా పండగ నిలుస్తుందని ఆమె చెప్పారు. ఎర్రకోటలోని మాధవదాస్ పార్క్‌లో రామ్‌లీలా కమిటీ నిర్వహిస్తున్న దసరా వేడుకలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విల్లు ఎక్కపెట్టగానే రావణ దహన కార్యక్రమం ప్రారంభమైంది.
“ఉగ్రవాదం మానవాళిపై దాడి చేసినప్పుడు, దానిని ఎదుర్కోవడం అవసరం అవుతుంది. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాద రావణుడిపై విజయానికి గుర్తు, దీని కోసం మనం మన సైనికులకు వందనం చేస్తున్నాము” అని ముర్ము తెలిపారు. వర్షం కురుస్తున్నప్పటికీ, రావణ దహనాన్ని చూడటానికి పెద్ద సంఖ్యలో ప్రజలు ఎర్రకోట వద్ద గుమిగూడారని ఆమె చెప్పారు.
రావణుడిపై రాముడి విజయంతో మూలాలను గుర్తించే సంప్రదాయాన్ని గుర్తుచేసుకుంటూ, ముర్ము దిష్టిబొమ్మ దహనం కూడా లోతైన సందేశాన్ని కలిగి ఉందని చెప్పారు. “ఈ కార్యక్రమం రావణుడి బయట నాశనం చేయడమే కాదు, మనలోని రావణుడిని అంతం చేయడం గురించి కూడా. అప్పుడే సమాజం శాంతి, సామరస్యంతో ముందుకు సాగగలదు” అని ఆమె తెలిపారు,
అంతర్గత చెడులను అధిగమించాలని రాష్ట్రపతి పౌరులను కోరారు. మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వర్షం కారణంగా ప్రజలు గొడుగుల కింద కార్యక్రమాలను వీక్షించారు. కాగా, అంతకు ముందు విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని గుజరాత్‌లోని భుజ్ ఎయిర్ బేస్‌లో నిర్వహించిన శస్త్ర పూజ కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొంటూ పాకిస్థాన్ సర్ క్రీక్ ప్రాంతంలో ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా, చరిత్రతో పాటు భౌగోళికంగా రూపురేఖలు మారిపోయేలా గట్టి సమాధానం ఇస్తామని తీవ్ర హెచ్చరికలు చేశారు.
ఈ సందర్భంగా సైనికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ 1965 యుద్ధంలో భారత సైన్యం లాహోర్ వరకు వెళ్లగలిగే సత్తా చూపించిందని రాజ్‌నాథ్ గుర్తుచేశారు. కరాచీకి వెళ్లే ఒక మార్గం సర్ క్రీక్ గుండానే వెళుతుందనే విషయాన్ని పాకిస్థాన్ ఇప్పుడు గుర్తుంచుకోవాలని చెప్పారు. ఇటీవలే జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’ గురించి ప్రస్తావిస్తూ లేహ్ నుంచి సర్ క్రీక్ వరకు భారత రక్షణ వ్యవస్థలను దెబ్బతీసేందుకు పాకిస్థాన్ విఫలయత్నం చేసిందని గుర్తు చేశారు.
“మన బలగాలు జరిపిన ప్రతిదాడిలో పాకిస్థాన్ వైమానిక రక్షణ వ్యవస్థ పూర్తిగా బట్టబయలైంది. భారత్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా కావాలంటే అప్పుడు పాకిస్థాన్‌కు భారీ నష్టాన్ని కలిగించగలదని ‘ఆపరేషన్ సిందూర్’ ప్రపంచానికి స్పష్టం చేసింది’ అని తెలిపారు.
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 78 ఏళ్లుగా సర్ క్రీక్ వివాదం కొనసాగుతోందని, చర్చల ద్వారా పరిష్కారానికి భారత్ ఎప్పుడూ ప్రయత్నిస్తోందని, కానీ పాకిస్థాన్ ఉద్దేశాలు మాత్రం అనుమానాస్పదంగా ఉన్నాయని రాజ్‌నాథ్ విమర్శించారు. సర్ క్రీక్ సమీపంలో పాకిస్థాన్ ఇటీవల సైనిక మౌలిక సదుపాయాలను పెంచుతుండటమే వారి దుష్ట పన్నాగాలకు నిదర్శనమని విమర్శించారు. ఈ ప్రాంతంలో ఎలాంటి దురాక్రమణకు పాల్పడినా ఊహించని రీతిలో బదులిస్తామని స్పష్టం చేశారు.
More Stories
శతాబ్ది సందర్భంగా `పంచ పరివర్తన్’పై ఆర్ఎస్ఎస్ దృష్టి
అక్టోబర్ 26 నుంచి భారత్- చైనాల మధ్య విమాన సర్వీసులు
ఖర్గేను పరామర్శించిన ప్రధాని మోదీ