
భారత్- చైనాల మధ్య సరిహద్దుల్లో ఐదేళ్ల నుంచి నెలకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో నిలిచిపోయిన విమాన సర్వీసులు తిరిగి అక్టోబర్ 26 నుండి పునఃప్రారంభం కానున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి, గల్వాన్ లోయ ఘర్షణలతో ఐదేళ్లుగా విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఇరు దేశాల మధ్య ఈ అంశంపై పలు దఫాలుగా చర్చలు జరిపారు. తాజాగా డైరెక్ట్ విమానాల పునఃప్రారంభానికి ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరినట్టు భారత విదేశాంగశాఖ గురువారం ప్రకటించింది.
వింటర్ షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ నెల చివర నాటికి వివిధ నగరాల మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభించేందుకు భారత్, చైనాలకు చెందిన ఎయిర్‌లైన్స్ ఏర్పాట్లు చేసుకుంటాయని పేర్కొంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇరు దేశాల పౌరవిమానయాన అధికారుల మధ్య సాంకేతికస్థాయి చర్చలు జరిగినట్టు తెలిపింది. దీంతో అక్టోబరు 26 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ- చైనా అద్యక్షుడు షీ జిన్ పింగ్‌లు, ఇరు దేశాల విదేశాంగ శాఖ అధికారుల మధ్య జరిగిన భేటీలల్లో దీనిపై ప్రధానంగా చర్చించారు. గత కొద్ది నెలలుగా భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టి పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవడంతో ద్వైపాక్షిక సంబంధాలు క్రమంగా మెరుగుపడుతున్నాయి. ఆగస్టులో షాంఘై సహకార సంస్థ సదస్సుకు ప్రధాని చైనా వెళ్లినప్పుడు విమాన సేవల పునఃప్రారంభానికి సూత్రప్రాయంగా అంగీకరించాయి.
తాజాగా, అవగాహనకు రావడంతో ఐదేళ్ల తర్వాత భారత్, చైనాల మధ్య నేరుగా విమాన సర్వీసులు మొదలుకానున్నాయి. ఇక, విదేశాంగ శాఖ ప్రకటన వెలువడిన కాసేపటికే చైనాకు విమాన సర్వీసుల పునఃప్రారంభంపై ప్రముఖ ఎయిర్‌లైన్స్ ఇండిగో ప్రకటన చేసింది. కోల్‌కతా నుంచి గ్వాంగ్జూ మధ్య అక్టోబరు 26 నుంచి రోజూ నాన్-స్టాప్ సర్వీసులు నడుస్తాయని తెలిపింది. డీజీసీఏ నిబంధనలకు లోబడి ఢిల్లీ-గ్వాంగ్జూ విమానాలను త్వరలోనే నడుపుతామని పేర్కొంది.
ఇరు దేశాల మధ్య పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి, సరిహద్దు వాణిజ్యం, వ్యూహాత్మక వ్యాపార భాగస్వామ్య మార్గాల పునఃస్థాపనలో భాగంగా ఇండిగో తన ఎయిర్‌బస్ ఏ320 నియో విమానాలను ఉపయోగిస్తుందని తెలిపింది. ఇరుదేశాల మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులు నిలిచిపోవడంతో వ్యాపార, పర్యటక, విద్యా రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది. దౌత్యపరమైన సంబంధాలు కొనసాగుతున్నప్పటికీ, ఇరు దేశాల మధ్య సంబంధాలు బెడిసికొట్టిన నేపథ్యంలో ఈ ప్రకటన ఉద్రిక్తతల తగ్గుముఖం పట్టడానికి సంకేతంగా భావిస్తున్నారు.
మరోవంక, అమెరికా- భారత్ వాణిజ్య చర్చలలో ప్రతిష్టంభన ఏర్పడటం, డొనాల్డ్ ట్రంప్ భారత్ పై 50 శాతం సుంకాలను విధించిన నేపథ్యంలో చైనా అమెరికా వైఖరిని తప్పు పట్టడం గమనార్హం. ఎస్సీఓ భేటీ అనంతరం మోదీ, జిన్‌పింగ్ సమావేశమవడం, ఆ తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, మోదీ, జిన్‌పింగ్‌లు కలిసి ఫోటోలు దిగడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్కసువెళ్లగక్కడం గమనార్హం.
More Stories
ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి వచ్చే వారం భారత్ లో పర్యటన
ఉగ్రవాదంపై విజయానికి ప్రతీక ఆపరేషన్ సిందూర్
శతాబ్ది సందర్భంగా `పంచ పరివర్తన్’పై ఆర్ఎస్ఎస్ దృష్టి