
విదేశీ విద్యార్థులపై ట్రంప్ కొత్త మెలిక పెట్టారు. వాటికి సంబంధించిన షరతుల లేఖలు అమెరికాలోని ప్రముఖ విశ్వ విద్యాలయాలన్నిటికీ శ్వేత సౌధం నుండి వెళ్లాయి. అమెరికా ప్రభుత్వ నిధులు కావాలంటే విదేశీ విద్యార్థుల అడ్మిషన్లను పరిమితం చేయాలని స్పష్టం చేస్తూ ప్రతిపాదించిన నిబంధనలు మెమో రూపంలో అమెరికాలోని టాప్ యూనివర్శిటీలకు చేరాయి.
ప్రభుత్వం నుండి లబ్ధి రావాలంటే అమెరికా విశ్వవిద్యాలయాలన్నీ విదేశీ విద్యార్థుల సంఖ్యపై పరిమితి, జాతి, లింగ ఆధారిత నియామకాలు నిలిపివేయాలి. విద్యార్థుల అడ్మిషన్ సమయంలో కచ్చితంగా ప్రామాణిక పరీక్ష నిర్వహించాలి. వీటిని చేపడితేనే ప్రభుత్వ నిధుల కేటాయింపులో ప్రాధాన్యత లభిస్తుంది. ఈ నిబంధనలను అంగీకరించిన విశ్వవిద్యాలయాలు ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధిని పొందవచ్చని ఆ లేఖలో వెల్లడించారు. వీటిల్లో విద్యార్థులకు ప్రభుత్వ రుణాలు, గ్రాంట్లు, కాంట్రాక్టులు, రీసెర్చి నిధులు, విదేశీ స్కాలర్స్‌కు వీసా అనుమతులు, ట్యాక్స్ కోడ్‌లో ప్రాధాన్యం వంటివి కూడా పొందవచ్చని శ్వేత సౌధం పేర్కొంది.
అమెరికాలో ఉన్నత విద్యను పున: వ్యవస్థీకరించి తమ భావజాలానికి అనుకూలంగా మార్చుకోవడానికి ట్రంప్ కార్యవర్గం చేస్తున్న మరో యత్నంగా దీనిని పలువురు భావిస్తున్నారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రభుత్వంతో 500 మిలియన్ డాలర్ల డీల్ చాలా దగ్గరగా ఉందని పేర్కొన్నారు. వైట్‌హౌస్ నుంచి లేఖలు అందుకున్నవాటిలో అమెరికాలోని ఎంఐటీ సహా ప్రముఖ విశ్వవిద్యాలయాలు మొత్తం ఉన్నాయి.
షరతులు
- విదేశీ వీసాలపై వచ్చే విద్యార్థుల సంఖ్య 15 శాతానికి మించి ఉండకూడదు. ఒకే దేశం నుంచి వచ్చిన విద్యార్థుల సంఖ్య 5 శాతానికి మించకూడదు.
- విదేశాల నుంచి అందే నిధుల వివరాలను బహిర్గతం చేయాలి.
- విద్యార్థుల అడ్మిషన్, ఫైనాన్షియల్ ఎయిడ్ సమయంలో లింగ, జాతి, జాతీయత, రాజకీయ భావజాలం, జెండర్ ఐడెంటిటీ, లైంగిక ఆకర్షణ, మతపరమైన అంశాలు పరిగణనలోకి తీసుకోకూడదు.
- అండర్ గ్రాడ్యుయేట్ దరఖాస్తుదారులు కచ్చితంగా ఎస్ఎటి లేదా ఎసిటి వంటి ప్రామాణిక పరీక్షను పూర్తిచేయాల్సిందే.
- విద్యా స్వేచ్ఛను కాపాడే విధానాలు అమలుచేయాలి. సంప్రదాయవాద ఆలోచన సరళిని ఇబ్బందిపెట్టే, దాడులకు పాల్పడే యూనిట్స్‌ను తొలగించడం.
- విద్యాలయాలను ఇబ్బందిపెట్టేలా రాజకీయ ప్రదర్శనలు, విద్యార్థులను లేదా గ్రూపులను వేధించకుండా చర్యలు చేపట్టాలి.
- ఉద్యోగులు అధికారిక విధుల సమయంలో రాజకీయ ప్రసంగాలు, చర్యలకు దూరంగా ఉండాలి.
- బాత్రూమ్లు, లాకర్ రూమ్‌లు లింగ ఆధారంగా వేర్వేరుగా ఉండాలి.
- హార్డ్సైన్స్ విద్యను అభ్యసించే విద్యార్థులకు ఉచిత ట్యూషన్ ఫీజ్, ప్రోత్సాహకం కింద 2 మిలియన్ డాలర్లు మించి ఇవ్వాలని ప్రతిపాదించారు.
- ఈ నిబంధనలు ఏమేరకు అమలుచేస్తున్నారనే అంశాన్ని జస్టిస్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్స్‌ను సమీక్షించి తెలుసుకొంటుంది. వీటిని ఉల్లంఘిస్తే ప్రభుత్వ లబ్ధిని రెండేళ్లపాటు ఆపేస్తారు.
మరోవంక, నాన్ ఇమిగ్రెంట్ వీసాల జారీ కోసం కొత్తగా ఇంటెగ్రిటీ వీసా ఫీజును అమెరికా ప్రవేశపెట్టింది. ఈ ఫీజు ఎఫ్-1, ఎఫ్-2 వీసాలు, జే-1, జే-2 వీసాలు, హెచ్-1బీ, హెచ్-4 వీసాలతోపాటు టూరిస్టు-బీ-1/బీ-2 తదితర వీసాలకు వర్తిస్తుంది. వీసా ఇంటెగ్రిటీ ఫీజు తప్పనిసరి. దీన్ని రద్దు చేయడం లేదా తగ్గించడం కుదరదు. అయితే వీసా నిబంధనలను పూర్తిగా పాటించిన దరఖాస్తుదారులకు ఈ ఫీజును ప్రభుత్వం వాపసు చేస్తుంది. 2025 ఆర్థిక సంవత్సరం కోసం ఇంటెగ్రిటీ ఫీజు సుమారు 250 డాలర్లు(రూ. 22 వేలు) లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్ఎస్) నిర్ణయించిన మేరకు ఉండనుంది.
More Stories
ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి వచ్చే వారం భారత్ లో పర్యటన
ఉగ్రవాదంపై విజయానికి ప్రతీక ఆపరేషన్ సిందూర్
శతాబ్ది సందర్భంగా `పంచ పరివర్తన్’పై ఆర్ఎస్ఎస్ దృష్టి