 
                రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 5- 6 తేదీల్లో భారత్కు రానున్నారు. ప్రతి ఏటా జరిగే భారత్-రష్యా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు పుతిన్ భారత్కు రానున్నారు. అయితే అగ్రరాజ్యం అమెరికా ప్రతీకార సుంకాలతో విరుచుకుపడుతున్న తరుణంలో భారత్- రష్యా సంబంధాలు మరింత బలోపేతమవుతున్న నేపథ్యంలో ఈ పర్యటన కీలక ప్రాధాన్యం సంతరించుకుంది.
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ ఈ ఏడాది ఆగస్టులో మాస్కో పర్యటన సందర్భంగా పుతిన్ భారత్ పర్యటనను అధికారికంగా ప్రకటించారు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ కూడా గత వారం ఈ పర్యటనను ధ్రువీకరించారు. అయితే ఆయన తేదీలను వెల్లడించలేదు. కానీ సంబంధిత వర్గాలు మాత్రం డిసెంబర్ 5, 6 తేదీలను ఖరారు చేశాయి.
భారత ప్రధాని నరేంద్ర మోదీ, పుతిన్ గత ఏడాది రెండు సార్లు సమావేశమయ్యారు. జులైలో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో భాగంగా మోదీ రష్యాకు వెళ్లగా, అక్టోబర్లో కజాన్లో జరిగిన బ్రిక్స్ సదస్సులో వీరిద్దరూ మరోసారి భేటీ అయ్యారు. ఇటీవల చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సులో కూడా ఇరువురు నాయకులు సమావేశమై, ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, రక్షణ సహకారంతో సహా పలు కీలక అంశాలపై చర్చించారు.
ఈ పర్యటన ద్వారా రక్షణ ఒప్పందాలు, ఇంధన రంగంలో సహకారం, వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. రష్యా నుంచి ఎస్- 400 క్షిపణి వ్యవస్థల సరఫరా, ఇంధన ఒప్పందాలు, ఉక్రెయిన్ సంక్షోభం వంటి అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. భారత్- రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఈ సమావేశం మరో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.





More Stories
సుప్రీంకోర్టు 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్
ముంబైలో పిల్లలను బందీలుగా తీసుకున్న ఆర్య కాల్చివేత
రాహుల్ గాంధీపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు