* మరోసారి బలూచీలో అకృత్యాలపై యూఎన్ హెచ్‌ఆర్‌సీలో బట్టబయలు
మానవ హక్కుల ఉల్లంఘనలో పాకిస్థాన్‌కు ఉన్న ట్రాక్ రికార్డు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (యూఎన్ హెచ్‌ఆర్‌సీ) 60వ సెషన్ 34వ సమావేశం వేదికగా మరోసారి బట్టబయలైంది. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరిగిన ఈ సమావేశంలో అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ వ్యవహారాల పరిశోధకుడు జోష్ బోవెస్ కీలక వివరాలను వెల్లడించారు.
బెలూచిస్తాన్ ప్రాంత ప్రజల మానవ హక్కులను హరించేలా దారుణంగా పాకిస్థాన్ ప్రభుత్వం, సైన్యం వ్యవహరిస్తున్నాయని ఆయన ఆరోపించారు. పాక్‌లో మానవ హక్కుల స్థితిగతులపై మరింత మెరుగ్గా పర్యవేక్షణ చేయాలని యూఎన్ హెచ్‌ఆర్‌సీని జోష్ బోవెస్ కోరారు. పాకిస్థాన్‌కు ఇచ్చిన ‘జీఎస్‌పీ+’ స్టేటస్‌ను సమీక్షించే క్రమంలో యూరోపియన్ యూనియన్ గుర్తించిన ముఖ్యమైన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
మానవ హక్కుల అమలుకు పాక్ కట్టుబడి ఉండాల్సిందే అని ఆయన డిమాండ్ చేశారు. “ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలోనూ పాకిస్థాన్ అత్యంత తక్కువగా 158వ స్థానంలో ఉంది. 2025 సంవత్సరంలో ఇప్పటి వరకు దైవదూషణ అభియోగాలతో 700 మందికిపైగా వ్యక్తులను పాక్ సర్కారు జైళ్లలో పెట్టిందని ‘యూఎస్‌సీఐఆర్ఎఫ్ మతస్వేచ్ఛ నివేదిక – 2025’లో ప్రస్తావించారు” అని గుర్తు చేశారు.
“2024తో పోలిస్తే ఈ ఏడాది పాక్‌లో ఈ విధమైన కేసులు 300 శాతం పెరిగాయి. 2025 సంవత్సరం తొలి ఆరు నెలల వ్యవధిలో బెలూచిస్థాన్‌లో పాక్ సైన్యం అదుపులోకి తీసుకున్న 785 మంది ఆచూకీ గల్లంతైందని బెలూచ్ నేషనల్ మూవ్‌మెంట్‌కు చెందిన మానవ హక్కుల విభాగం ‘పాంక్’ తెలిపింది. 121 మంది బెలూచ్‌వాసులను పాక్ ఆర్మీ చంపిందని ‘పాంక్’ నివేదికలో పొందుపరిచారు” అని తెలిపారు.
పాక్ సైన్యం కారణంగా 2025లో దాదాపు 4 వేల మంది పష్టూన్ తెగ ప్రజల ఆచూకీ గల్లంతైందని పష్టూన్ నేషనల్ జిర్గా వెల్లడించిందని జోష్ బోవెస్ వివరించారు. మానవ హక్కులతో ముడిపడిన చట్టాలను పక్కాగా అమలుచేసే దేశాలతో వాణిజ్యానికి యూరోపియన్ యూనియన్ (ఈయూ) ప్రాధాన్యత వేస్తోంది. ఇందుకోసం ‘జనరలైజ్డ్ స్కీమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్’ను ఫాలో అవుతోంది.
ఈ ప్రమాణాలను పాటించే దేశాలకు ‘జీఎస్‌పీ+’ హోదా ఇస్తోంది. ఈ హోదా కలిగిన దేశాల నుంచి వచ్చే 66 శాతం సరుకులపై ఎలాంటి సుంకాన్ని ఈయూ విధించడం లేదు. “ఐటమ్ 8 ప్రకారం ఈయూకు చెందిన ‘జీఎస్‌పీ+’ యంత్రాంగం సహకారాన్ని పొందేందుకు ఉన్న అవకాశాలను ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (యూఎన్ హెచ్‌ఆర్‌సీ) పరిశీలించాలి. ఇది నా విన్నపం. తద్వారా మానవ హక్కులను ఉల్లంఘించే పాకిస్థాన్ లాంటి దేశాలకు వాణిజ్యంలో ప్రాధాన్యత దక్కకుండా చేయొచ్చు” అని జోష్ బోవెస్ అభిప్రాయపడ్డారు.
యూఎన్ హెచ్‌ఆర్‌సీ వేదికగా పాకిస్థాన్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త ఆరిఫ్ ఆజాకియా కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. బెలూచిస్థాన్, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లలో పాక్ సైన్యం చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ప్రజలను చంపుతోందని ఆయన ఆరోపించారు. పాక్ సైన్యం వల్ల ఎంతో మంది ఆచూకీ గల్లంతు అవుతోందని, మరెంతో మంది వేధింపులకు గురవుతున్నారని తెలిపారు.
చాలా సార్లు బాధితుల కుటుంబాలు రోడ్లపైకి వచ్చి నిరసనలు కూడా తెలుపుతున్నారని ఆరిఫ్ ఆజాకియా చెప్పారు. స్థానిక పోలీసుల క్రూరత్వం వల్ల వేలాది మంది బెలూచ్, పష్టూన్ పౌరులు గల్లంతయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నిసార్లు ఇలాంటి వారి సామూహిక సమాధులు కూడా బయటపడ్డాయని పేర్కొన్నారు. ఇంకొన్ని సార్లు గల్లంతైన వారి డెడ్‌బాడీలు లభించాయని తెలిపారు. గల్లంతైన తమ వాళ్లను కోర్టు ఎదుట ప్రవేశపెట్టాలని, బాధిత కుటుంబాల మహిళలు, పిల్లలు వివిధ నగరాల్లో నిరసనలు తెలుపుతున్నారని ఆరిఫ్ ఆజాకియా పేర్కొన్నారు. చివరకు మహిళలు, పిల్లలపైనా పాక్ పోలీసులు అక్రమ కేసులను పెట్టి, అరెస్టు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
పాక్ సైన్యం అదుపులో ఉన్న బెలూచ్ ప్రముఖుల జాబితాలో డాక్టర్ మహరంగ్ బెలూచ్ ఒకరని ఆయన తెలిపారు. కనీసం కుటుంబంతో మాట్లాడేే అవకాశాన్నీ ఆయనకు ఇవ్వడంలేదన్నారు. ప్రజలను కోర్టులో ప్రవేశపెట్టకుండా 90 రోజుల దాకా అదుపులో ఉంచుకునే అధికారాన్ని భద్రతా బలగాలకు కల్పిస్తూ ఇటీవలే పాకిస్థాన్ సర్కారు ఆదేశాలు జారీ చేసిందని ఆరిఫ్ ఆజాకియా తెలిపారు.
ఇలాంటి నిరంకుశ చట్టాలు పాకిస్థాన్ సంతకాలు చేసిన అంతర్జాతీయ ఒప్పందాలకు విరుద్ధమైనవి అని చెప్పారు. పాక్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా చూడాలని యూఎన్ హెచ్‌ఆర్‌సీని ఆయన కోరారు. వాస్తవాలను తెలుసుకునేందుకు ప్రత్యేక టీమ్‌ను బెలూచిస్థాన్, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలకు పంపాలని విన్నవించారు

More Stories
ఉగ్రకుట్రకు అడ్డాగా అల్ ఫలాహ్‌లో 17వ నంబర్ భవనం
ప్రజల కేంద్రీకృత మార్పులకై వాతావరణ సదస్సులో భారత్ పిలుపు
రెడ్ కారిడార్: అశాంతి ముగింపుకు భారతదేశ సుదీర్ఘ యుద్ధం