దసరా, దీపావళి కానుక- ఉద్యోగులకు డీఏ 3 శాతం పెంపు

దసరా, దీపావళి కానుక- ఉద్యోగులకు డీఏ 3 శాతం పెంపు
* వందేమాతరం గేయం 150వ వార్షికోత్సవాలు 

దసరా, దీపావళి పండుగలకు ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మోదీ సర్కారు గుడ్ న్యూస్ వినిపించింది. వారికి ప్రతినెలా చెల్లించే కరువు భత్యాన్ని (డీఏ) 3 శాతం పెంచే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలో సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈమేరకు నిర్ణయం తీసుకుంది. 

దీంతో శాలరీ బేసిక్ పే, పెన్షన్‌లపై చెల్లిస్తున్న డీఏ 55 శాతం నుంచి 58 శాతానికి పెరిగింది. ఈ నిర్ణయం 2025 జులై 1 నుంచే అమల్లోకి వస్తుందని సర్కారు వెల్లడించింది. జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలలకు సంబంధించిన డీఏ బకాయీలను అక్టోబరు నెల శాలరీతో, దీపావళి కంటే ముందే అందిస్తామని తెలిపింది.  ఈ నిర్ణయంతో దేశంలోని 49.2 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.7 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.

7వ వేతన కమిషన్ నిబంధనల ప్రకారం డీఏ పెంపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు అందరికీ వర్తిస్తుందని తెలిపారు.  తాజా డీఏ పెంపు వల్ల కేంద్ర ప్రభుత్వ ఖజానాపై ఏటా అదనంగా రూ.10,083.96 కోట్ల భారం పడుతుందన్నారు. కాగా, 8వ వేతన కమిషన్ రూల్స్ 2026 సంవత్సరం జనవరి నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

దేశవ్యాప్తంగా కొత్తగా 57 కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేసే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. వీటి ఏర్పాటుకు దాదాపు రూ.5,862.55 కోట్లు అవసరం అవుతాయని సర్కారు అంచనా వేసింది. 2026-2027 నుంచి తొమ్మిదేళ్లలోగా వీటి నిర్మాణ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  ఈ 57 కేంద్రీయ విద్యాలయాల్లో ఏడింటిని కేంద్ర హోంశాఖ స్పాన్సర్ చేస్తుంది. మిగతా వాటిని రాష్ట్ర ప్రభుత్వాలే స్పాన్సర్ చేయాలి. ప్రస్తుతం మనదేశంలో 1,288 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి.

2026- 2027 ఆర్థిక సంవత్సరపు మార్కెట్ సీజన్‌ కోసం అన్ని నిర్దేశిత రబీ పంటల కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)లను పెంచే ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. రైతులకు గిట్టుబాటు ధరను కల్పిస్తామని సర్కారు తెలిపింది. గోధుమల ఎంఎస్‌పీ క్వింటాలుకు రూ.160 మేర పెరిగింది. దీంతో క్వింటాలు గోధుమల ధర రూ.2,585కు చేరింది.

వందేమాతరం గేయం 150వ వార్షికోత్సవాలను నిర్వహించే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. భారత రాజ్యాంగ సభ వందేమాతరంను భారత జాతీయ గేయంగా గుర్తించింది. స్వాతంత్య్ర ఉద్యమకాలంలో భారతీయుల్లో దేశభక్తిని పెంచడంలో ఈ గేయం పోషించిన పాత్ర గురించి ఈసందర్భంగా వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని కేంద్రం భావిస్తోంది.