అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది తీరంలో అసాధారణ పరిస్థితి నెలకొంది. ఎప్పుడూ అలలతో ఉప్పొంగే సముద్రం అకస్మాత్తుగా 500 మీటర్ల దూరం వెనక్కి వెళ్ళిపోయింది. తీరానికి దగ్గరగా నీళ్లు లేకపోవడంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా నిర్మానుష్యంగా మారింది. సముద్రం వెనక్కి వెళ్లడంతో తీరప్రాంతం అంతా మోకాళ్ల లోతు ఒండ్రుమట్టితో కప్పుకుపోయింది.
ఈ దృశ్యం స్థానికులను ఆశ్చర్యపరచడమే కాకుండా భయాందోళనకు గురిచేసింది. పర్యాటకులు, భక్తులు కూడా సముద్ర స్నానానికి వెళ్లేందుకు వెనుకంజ వేస్తున్నారు. “మునుపెన్నడూ ఇలాంటిది చూడలేదు” అని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులలో కొందరు, ఇలాంటి పరిస్థితులు సాధారణంగా సునామి రాకముందే కనిపిస్తాయని అంటున్నారు.
సముద్రం ఒక్కసారిగా వెనక్కి వెళ్లిపోవడం ఎలాంటి ప్రమాదానికి సంకేతమా? అని వారు భయపడుతున్నారు. అకస్మాత్తుగా సముద్రం ఎడారిలా మారిపోవడం వారి ఆందోళనను మరింత పెంచింది. స్థానికుల జ్ఞాపకాల ప్రకారం, ఇంతకు ముందు కూడా సముద్రం కొన్ని మీటర్ల మేర వెనక్కి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. కానీ, అవి ఎక్కువగా ఇసుకమేటల కారణంగా జరిగేవి.
ఈసారి మాత్రం పరిస్థితి విస్తృతంగా ఉండటంతో భయం ఎక్కువైంది. ఒండ్రుమట్టి బయటపడటంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇంకా ఆందోళనలో ఉన్నారు. అంతర్వేది సముద్రతీరానికి పర్యాటకులు, భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. సముద్రం వెనక్కి వెళ్లడం, తీరప్రాంతం ఎడారిలా మారిపోవడం కారణంగా పర్యాటకులు సముద్ర స్నానం చేయడానికి వెనకడుగు వేస్తున్నారు.
భయం వల్ల స్థానికంగా వాణిజ్య కార్యకలాపాలు కూడా ప్రభావితమవుతున్నాయి. ప్రజలు భయాందోళనలో ఉన్న నేపథ్యంలో అధికారుల నుండి స్పష్టమైన వివరణ అవసరమైంది. సముద్రం వెనక్కి వెళ్లిపోవడానికి నిజమైన కారణం ఏమిటో అధికారులు తెలియజేయాలని స్థానికులు కోరుతున్నారు. భూకంపం లేదా సునామి హెచ్చరికలు ఉన్నాయా? అన్న అనుమానం కూడా వారిలో వ్యక్తమవుతోంది.
సముద్రం ఒక్కసారిగా వెనక్కి వెళ్లిపోవడం సహజ పరిణామమా? లేదా భూగర్భ మార్పుల ఫలితమా? అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. సముద్ర శాస్త్రవేత్తలు, పర్యావరణ నిపుణులు దీనిపై పరిశీలన జరపాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

More Stories
ఏపీకి ముంచుకొస్తున్న ‘మొంథా’ తుపాను ముప్పు
ఈ దశాబ్దం మోదీదే… బీహార్ లో ఎన్డీయే విజయం
వందల మొబైల్ ఫోన్లు పేలడంతో బస్సు ప్రమాదం?