‘శుక్రాచార్య’గా అక్షయ్‌ ఖన్నా

‘శుక్రాచార్య’గా అక్షయ్‌ ఖన్నా

హనుమాన్‌’ విజయంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ నుంచి ఇప్పుడు మరో మూవీ రానుంది. అదే ‘మహాకాళి’. ఆర్‌కేడీ స్టూడియోస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్‌ వర్మ కథ అందిస్తుండగా, పూజా అపర్ణ కొల్లూరు దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని ఆర్‌కే దుగ్గల్‌ సమర్పిస్తున్నారు. 

ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ ఖన్నా ‘శుక్రాచార్య’  పాత్రలో కనిపించనున్నారు. ఆయన తెలుగు తెరకు పరిచయం అవ్వడం విశేషం. ఇటీవల విడుదలైన అక్షయ్‌ ఖన్నా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తించింది. భారీ కోటల ముందు, అగ్నిగుండాల కాంతిలో తుపానుల వాతావరణంలో నిలబడి ఉన్న ఆయన రూపం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. 

ఆధ్యాత్మిక వేషధారణలో, పొడవాటి తెల్ల గడ్డంతో, కళ్లలో తీక్షణత ఉట్టిపడేలా కనిపించారు. ఈ లుక్‌ ద్వారా ‘శుక్రాచార్య’ పాత్ర శక్తిమంతమైనదని స్పష్టమవుతోంది. హిందూ పురాణాల్లో శుక్రాచార్య ఒక క్లిష్టమైన, లోతైన భావాలు కలిగిన పాత్ర. దేవతలకు వ్యతిరేకంగా అసురులకు గురువుగా నిలిచిన ఆయనలో ఉన్న జ్ఞానం, శక్తి, ఆధ్యాత్మికత ఈ పాత్రను మరింత ప్రాముఖ్యవంతంగా మారుస్తాయి. 

ఇలాంటి సవాళ్లతో కూడిన పాత్రను అక్షయ్‌ ఖన్నా ఎంచుకోవడం ప్రత్యేకం. సాంకేతికంగా కూడా సినిమా విశేషంగా రూపుదిద్దుకుంటోంది. సంగీతాన్ని స్మరణ్‌ సాయి అందించగా, సినిమాటోగ్రఫీని సురేష్‌ రఘుటు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. డిసెంబర్‌ నాటికి మిగిలిన పనులు పూర్తిచేసి, సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది.

ప్రశాంత్‌ వర్మ ఇప్పటికే తన సృజనాత్మకతతో, విభిన్నమైన కథా నిర్మాణాలతో ప్రేక్షకుల్లో విశ్వాసం నింపారు. ‘హనుమాన్‌’ తర్వాత వచ్చే ఈ ‘మహాకాళి’ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.