
మానవులు సృష్టించిన జీవ ఆయుధాల వల్ల భవిష్యత్తులో సహజంగా లేదా ప్రమాదవశాత్తు ముప్పు పెరగొచ్చని భారతదేశ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ హెచ్చరించారు. అణ్వాయుధాల నుంచి వెలువడే రేడియో కాలుష్యంతోనూ గండం పొంచి ఉండొచ్చని తెలిపారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో యావత్ ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొందని ఆయన గుర్తు చేశారు.
భవిష్యత్తులో జీవ ఆయుధాల ముప్పును, అణ్వాయుధాల రేడియో కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు భారత సైనిక దళాలు రక్షణపరమైన సన్నద్ధతతో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. మిలిటరీ నర్సింగ్ సర్వీస్ శత వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం డిల్లీలోని మానిక్‌షా సెంటర్‌లో నిర్వహించిన శాస్త్రీయ చర్చా కార్యక్రమంలో అనిల్ చౌహాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
“జీవ ఆయుధాలతో దాడి జరిగినప్పుడు, అణ్వాయుధాల నుంచి రేడియో కాలుష్యం వ్యాపించినప్పుడు ఎలా స్పందించాలి? ఆ రెండు రకాల ముప్పులను ఎదుర్కోవాలి? వాటి వల్ల ఇన్ఫెక్షన్ బారినపడే వారికి ఎలాంటి ప్రాథమిక చికిత్స, అత్యవసర చికిత్స అందించాలి? అనే సమాచారంతో నిర్దిష్టమైన చికిత్సా విధానాలను మనం ఇప్పుడే సిద్ధం చేసుకోవాలి” అని చౌహన్ సూచించారు.
“ఆ చికిత్సా పద్ధతులు కొంత భిన్నంగా ఉంటాయి. భవిష్యత్తు అవసరాల కోసం భారత సేనలు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలి. గతంలో ప్రధాని మోదీ చెప్పినట్టుగా అణ్వస్త్రాలకూ వెరువని భారత్‌ను సిద్ధం చేయాలి. అణ్వాయుధాల నుంచి వెలువడే రేడియోలాజికల్ కాలుష్య బాధితులకు చికిత్స ఇచ్చే పద్ధతులపైనా వైద్యులు, నర్సులకు తగిన శిక్షణ ఇవ్వాలి” అని సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ తెలిపారు.
“ఆపరేషన్ సిందూర్ ముగిసిన తర్వాత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక విషయాన్నిస్పష్టంగా చెప్పారు. అణు బెదిరింపులకు భారత్ భయపడదని ఆయన తేల్చి చెప్పారు. అణ్వస్త్రాల వినియోగం అనేది దాదాపు అసాధ్యం. కానీ వాటితో ఒకవేళ దాడి జరిగితే ఎదుర్కొనేందుకు సైన్యం సన్నద్ధంగా ఉండటం మంచిది” అని స్పష్టం చేశారు.
“ఇది భద్రతాపరంగా ముందుచూపుతో తీసుకునే జాగ్రత్త చర్య. అణ్వాయుధాల వల్ల రేడియోలాజికల్ కాలుష్యం అలుముకుంటే, బాధితులకు ఎలాంటి చికిత్స అందించాలనే దానిపై వైద్యులు, నర్సులకు తగిన శిక్షణ అందించాలి. ఈవిధమైన ముందస్తు సన్నద్ధత ద్వారానే అణ్వస్త్ర బెదిరింపులకు వెరవకుండా ముందుకు సాగే అవకాశం కలుగుతుంది” అని చెప్పారు.
ఎన్నో క్లిష్ట సమయాల్లో మిలిటరీ నర్సింగ్ సర్వీస్‌లోని నర్స్‌లు అంకితభావంతో విధులను నిర్వర్తించారని చౌహన్ కొనియాడారు. 1926లో ఏర్పాటైన భారతదేశ మిలిటరీ నర్సింగ్ సర్వీస్, 100 ఏళ్ల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం చాలా గొప్ప విషయం అని చెప్పారు. భారత సాయుధ దళాల నుంచి విడదీయలేని భాగంగా అది మారిపోయిందని తెలిపారు.
“యుద్ధ క్షేత్రాలు, సైనిక ఆస్పత్రులు, మానవతా మిషన్లు ఇలా ఎక్కడైనా సరే ఈ సర్వీస్‌లోని నర్స్‌లు అందించిన సేవలు అనన్య సామాన్యం. వారి మానసిక, ఉద్వేగ సంబంధ ఆరోగ్యం దేశ సైన్యానికి చాలా ముఖ్యమైంది. భారత సైన్యంలోని విభిన్న విభాగాలను, దళాలను ఏకం చేస్తున్న ఏకైక విభాగం మిలిటరీ నర్సింగ్ సర్వీస్” అని ప్రశంసించారు. ఈ సర్వీస్‌లోని సిబ్బంది తరుచుగా ఆర్మీ, నేవీ, వాయుసేనలకు బదిలీ అవుతుంటారని చెబుతూ భారత త్రివిధ దళాల్లో ఏకత్వాన్ని మరింత బలోపేతం దిశగా మనం అడుగులు వేయాలని సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు.
More Stories
అమెరికాలో మొదలైన ‘షట్‌డౌన్’
దసరా, దీపావళి కానుక- ఉద్యోగులకు డీఏ 3 శాతం పెంపు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ఎంపిక ప్రారంభం