
బ్రిటన్ రాజధాని లండన్‌లోని చారిత్రక టావీస్టాక్ స్క్వేర్ కూడలిలో ఉన్న భారత జాతిపిత మహాత్మాగాంధీ కాంస్య విగ్రహంపై గుర్తు తెలియని వ్యక్తులు పిచ్చిరాతలు రాశారు. టెర్రరిస్టు, గాంధీ-మోదీ హిందుస్థాని టెర్రరిస్టులని నల్ల రంగుతో విగ్రహంపై విద్వేషపూరిత రాతలు రాశారు. మహాత్ముడి విగ్రహంపై అసభ్య వ్యాఖ్యలతో కూడిన రాతలున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ దుశ్చర్యను లండన్‌లోని భారత హైకమిషన్ తీవ్రంగా ఖండించింది.
గాంధీజీ జయంతి(అక్టోబరు 2)ని అంతర్జాతీయ అహింసా దినంగా జరుపుకుంటారని, దీనికి సరిగ్గా మూడు రోజుల ముందు ఈ దారుణం జరగడం బాధాకరమని భారత హైకమిషన్ ఎక్స్ లో పేర్కొంది. దీన్ని అహింసా వాదంపై జరిగిన హింసాత్మక దాడిగా అభివర్ణించింది. ఈ ఘటన వార్త విని తాము విచారానికి గురయ్యామని తెలిపింది. దీని సమాచారాన్ని వెంటనే స్థానిక అధికార యంత్రాంగానికి చేరవేశామని వెల్లడించింది.
గాంధీజీ విగ్రహాన్ని త్వరితగతిన పునరుద్ధరించే అంశంపై సంబంధిత అధికార విభాగంతో సమన్వయం చేసుకుంటున్నామని చెప్పింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలను సేకరించడంపై ఫోకస్ పెట్టామని లండన్ మెట్రోపాలిటన్ పోలీస్, నగర పాలక సంస్థ (క్యామ్‌డెన్ కౌన్సిల్) అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది ఆరంభంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ లండన్‌లో పర్యటించిన సందర్భంగా ఆయన బస చేసిన హోటల్ వద్ద పలువురు ఖలిస్థానీలు నిరసనకు దిగారు.
దాన్ని ‘భద్రతా ఉల్లంఘన’గా భారత్ అభివర్ణించింది. ఎస్ జైశంకర్ బస చేసిన హోటల్ వద్దకు నిరసనకారులను అనుమతించడాన్ని తప్పుపట్టింది. మహాత్మా గాంధీ ఉన్నత విద్య కోసం 1888లో భారత్ నుంచి లండన్‌కు వెళ్లారు. ఆయన 1888 నవంబరు 6న యూనివర్సిటీ కాలేజ్ లండన్(యూసీఎల్)లో లా కోర్సులో చేరారు. భారత చట్టాలపై అక్కడ అధ్యయనం చేశారు. ఈ కాలేజీలో చదువుకున్న ఇతర ప్రముఖుల్లో నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ఉన్నారు.
More Stories
అమెరికాలో మొదలైన ‘షట్‌డౌన్’
పాకిస్తాన్ క్రికెటర్లకు విదేశీ లీగ్‌లో ఆడకుండా ఆంక్షలు
బలూచిస్థాన్ లో భారీ పేలుడు… 10 మంది మృతి