బలూచిస్థాన్‌ లో భారీ పేలుడు… 10 మంది మృతి

బలూచిస్థాన్‌ లో భారీ పేలుడు… 10 మంది మృతి

పాకిస్థాన్‌ లో భారీ పేలుడు సంభవించింది. బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లోని క్వెట్టాలో జరిగిన ఈ పేలుడులో పలువురు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. క్వెట్టాలోని జర్ఘున్ రోడ్‌లోని గల పాక్‌ ఫ్రంటియర్‌ కోర్‌ ప్రధాన కార్యాలయం సమీపంలో మంగళవారం ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి సమీపంలోని భవనాలు, ఇళ్లు దెబ్బతిన్నాయి. 

ఈ ఘటనలో ఇప్పటివరకు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 30 మంది వరకూ గాయపడ్డారు. పేలుడు తర్వాత ఆ ప్రాంతంలో కాల్పులు శబ్దం కూడా వినిపించినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ ఘటనలో ప్రాణనష్టం అధికంగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని ఆస్పత్రుల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. అయితే, ఈ పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పేలుడు దృష్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. ప్రస్తుతం అవి వైరల్‌ అవుతున్నాయి.
 
బలూచిస్తాన్ ఆరోగ్య మంత్రి బఖ్త్ ముహమ్మద్ కాకర్ అన్ని ఆసుపత్రులలో నగరవ్యాప్త అత్యవసర పరిస్థితిని ప్రకటించారు, కన్సల్టెంట్లు, వైద్యులు, ఫార్మసిస్ట్‌లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది వెంటనే విధులకు హాజరు కావాలని ఆదేశించారు. పేలుడుకు కారణాన్ని గుర్తించడానికి అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
 
సంఘటనా స్థలం నుండి వచ్చిన ఫుటేజ్‌లో గణనీయమైన దూరం నుండి భారీ పొగలు ఎగసిపడుతున్నట్లు కనిపిస్తోంది. క్వెట్టా పేలుడు ఆత్మాహుతి దాడి అని పాకిస్తాన్ మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. పేలుడు తర్వాత దూరం నుండి భారీ పొగలు ఎగసిపడుతున్నట్లు ప్రత్యక్ష సాక్షులు నివేదించారు. సెప్టెంబర్ 4న క్వెట్టాలో జరిగిన రాజకీయ ర్యాలీలో జరిగిన బాంబు పేలుడులో 15 మంది మరణించగా, 30 మందికి పైగా గాయపడ్డారని గమనించాలి.