హైందవ ధర్మంపై వైఎస్ కుటుంభం నిరంతర దాడి

హైందవ ధర్మంపై వైఎస్ కుటుంభం నిరంతర దాడి

* టిటిడి నిధులపై షర్మిల అభ్యంతరం పట్ల మాధవ్ ఆగ్రహం!

హైందవ ధర్మంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుటుంబం నిరంతరం దాడి చేస్తూనే ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ ఆరోపించారు. వైఎస్‌ కుటుంబం మొత్తం హిందూ మతానికి, భారతీయుల ఆకాంక్షలకు వ్యతిరేకమని ఆయన విమర్శించారు.  టీటీడీ నిధులతో 5 వేల దేవాలయాలు నిర్మాణం చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటిస్తే ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తప్పుపట్టడమే ఇందుకు నిదర్శనమని అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఢిల్లీలోని ఏపీభవన్‌లో మాధవ్‌ మీడియాతో మాట్లాడుతూ టీటీడీ నిధులతో దేవాలయాలు నిర్మాణం చేస్తే మీకేంటి ఇబ్బంది? అని షర్మిలను నిలదీశారు. షర్మిల వ్యాఖ్యలపై సోనియా, రాహుల్‌గాంధీ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. షర్మిల వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఉన్నాయని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25, 26 ప్రకారం ప్రతి మతపరమైన సంస్థ తన నిధులను ఆ మత ప్రయోజనాలకే వినియోగించుకోవడానికి పూర్తి హక్కు ఉందని మాధవ్ స్పష్టం చేశారు. అందువల్ల, టీటీడీ నిధులతో ఆలయ నిర్మాణాలు చేపట్టడం రాజ్యాంగబద్ధం, చట్టబద్ధమని ఆయన తేల్చి చెప్పారు. నిధులను ఆలయాల నిర్మాణాలు, ధార్మిక సంస్థల నిర్మాణం, ధూపదీప నైవేద్యం కోసం ఉపయోగించుకుంటున్నారని మాధవ్ వెల్లడించారు.

హిందూ సమాజ విశ్వాసానికి కేంద్రబిందువైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వైఎస్‌ కుటుంబం పదే పదే అవమానపరచడం పరిపాటిగా మారిందని అంటూ మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి పాలనలో పరకామణి హుండీ నిధులను దోచుకుని రూ.100 కోట్ల వరకు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాల్లో పెట్టారని, దీనికి సాక్ష్యాలు కూడా ఉన్నాయని మాధవ్ ఆరోపించారు. 

జగన్‌ అవినీతి పాలనపై విచారణ జరుగుతుందని మాధవ్‌ చెప్పారు. జగన్‌ మళ్లీ అధికారంలోకి వస్తామంటూ పోలీసులను, కాంట్రాక్టర్లను బెదిరించడం సరికాదని హితవు చెప్పారు.  జగన్‌ వైఖరిని అన్ని వర్గాల ప్రజలూ ఖండించాలని మాధవ్‌ పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం టీటీడీలో 434 గదులు కూల్చి రూ.600 కోట్లు ఖర్చు చేశారని మండిపడ్డారు.

జగన్‌ పాలనలో పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు వాడడం, క్రైస్తవుడిని చైర్మన్‌గా నియమించడం, బియ్యం, పంచదార, నెయ్యి, జీడిపప్పు వంటి వస్తువుల కొనుగోళ్లలో అవినీతి, శ్రీవాణి నిధులను దుర్వినియోగం, ఇంజనీరింగ్‌ పనులపేరిట నిధులను దుర్వినియోగం, విదేశీ కరెన్సీని దారిమళ్లింపు, అక్రమ నియామకాలు, అక్రమంగా లక్ష బ్రేక్‌ దర్శనాల కేటాయింపు వంటి వాటితో టీటీడీ ప్రతిష్ఠను దిగజార్చారని మాధవ్‌ ఆరోపించారు.

దేవాలయాల నిర్మాణాలు ఆర్ఎస్ఎస్ ఎజెండా అని షర్మిల వ్యాఖ్యలు చేస్తున్నారని మాధవ్ మండిపడ్డారు. దేవాలయాలపై పరిజ్ఞానం లేకుండా, అవివేకంగా షర్మిల మాట్లాడారని విమర్శించారు. ఆమెకు దేవాలయాల వ్యవస్థపై ఎటువంటి అవగాహన, ఆలోచన లేదని ఎద్దేవా చేశారు. వైఎస్ షర్మిల జీవితంలో ఎప్పుడైనా దేవాలయాలను సందర్శించారా? అని మాధవ్ ప్రశ్నించారు.
 
మత ప్రచారాలు స్వయంగా భర్తతో కలిసి ఆమె చేశారని, మత మార్పిడి చేయాలని పెద్ద ప్రయత్నం చేశారని అంటూ ఆరోపణలు గుప్పించారు. దివంగత మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి గతంలో ఏడుకొండలు మూడు కొండలుగా మార్చాలని జీవో ఇచ్చారని గుర్తు చేశారు. టీటీడీ నిధులు ఎలాంటి దుర్వినియోగం అవ్వడం లేదని స్పష్టం చేశారు.