లారెన్స్ బిష్ణోయ్ ముఠాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన కెనడా

లారెన్స్ బిష్ణోయ్ ముఠాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన కెనడా
కెనడా ప్రభుత్వం బిష్ణోయ్ గ్యాంగ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఒక నిర్దిష్ట సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని బెదిరింపు వాతావరణాన్ని సృష్టించే హింస, ఉగ్రవాద చర్యలకు కెనడాలో చోటు లేదని ఆ ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు పబ్లిక్‌ సేఫ్టీ మినిస్టర్‌ గ్యారీ ఆనంద్‌ సంగారి కెనడా ప్రభుత్వం బిష్ణోయ్ గ్యాంగ్‌ను క్రిమినల్ కోడ్ కింద ఉగ్రవాద సంస్థ జాబితాలో చేర్చిందని ప్రకటించారు.
 
జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నేతృత్వంలోని బృందానికి కెనడియన్లు నిధులు సమకూర్చడం లేదా సహాయం చేయకుండా నిషేధం విధించింది.  కెనడాలోని ప్రతి వ్యక్తికి తమ ఇంట్లో, సమాజంలో సురక్షితంగా ఉండే హక్కు ఉందని పేర్కొంటూ బిష్ణోయ్ గ్యాంగ్ భయం, హింస ద్వారా కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుంటుందని ఆరోపించారు.
 
ఈ ముఠాను ఉగ్రవాద జాబితాలో ఉంచడం వల్ల వారి నేరాలను అరికట్టడానికి, సమాజంలో భద్రతను నిర్ధారించడానికి సమర్థవంతమైన అవకాశం ఉంటుంది. క్రిమినల్‌ కోడ్‌ కింద కెనడాలో ప్రస్తుతం మొత్తం 88 ఉగ్రవాద సంస్థలు జాబితా అయ్యాయి.  క్రిమినల్ కోడ్ ప్రకారం కెనడాలోని బిష్నోయ్ ముఠాల ఆస్తులు, వాహనాలు, డబ్బును స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. లేదంటే స్తంభింపజేసే అవకాశం ఉంది. 
ఈ ముఠాలపై చర్యలు తీసుకోవడానికి చట్టబద్ధ సంస్థలకు అధికారం లభిస్తుంది. కెనడా. విదేశాల్లో ఎవరైనా ఉగ్రవాద సంస్థ ఆస్తులతో సంబంధం కలిగి ఉండడం చట్టవిరుద్ధం. కెనడాలోకి ప్రవేశం కల్పించేందుకు, లేదంటే తిరస్కరించేందుకు ఇమ్మిగ్రేషన్, సరిహద్దు అధికారులు కూడా ఈ జాబితాను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.
“ఉగ్రవాద జాబితా అంటే కెనడాలో ఆ గ్రూపు యాజమాన్యంలోని ఏదైనా, ఆస్తి, వాహనాలు, డబ్బును స్తంభింపజేయవచ్చు లేదా స్వాధీనం చేసుకోవచ్చు.  ఆర్థిక సహాయం, ప్రయాణం, నియామకాలకు సంబంధించిన ఉగ్రవాద నేరాలను విచారించడానికి కెనడియన్ చట్ట అమలుకు మరిన్ని సాధనాలను అందిస్తుంది” అని కెనడియన్ ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

కెనడియన్ ప్రభుత్వం ప్రకారం బిష్ణోయ్‌ గ్యాంగ్‌ చాలా ప్రాంతాల్లో చురుగ్గా ఉంది. హత్య, కాల్పులకు గ్యాంగ్‌ పాల్పడుతున్నది. దోపిడీ, బెదిరింపులతో భయానక పరిస్థితులు సృష్టిస్తున్నట్లుగా ప్రభుత్వం పేర్కొంది. ప్రముఖులు, వ్యాపారులతో పాటు పలువురిని లక్ష్యంగా చేసుకొని ఆయా సమాజాల్లో అభద్రతా వాతావరణాన్ని సృష్టిస్తున్నట్లు ఆరోపించింది. బిష్నోయ్ ముఠాను ఉగ్రవాద జాబితాలో చేర్చడం వల్ల కెనడియన్ భద్రత, నిఘా, ఆయా విభాగాలు నేరాలను ఎదుర్కొనేందుకు అవకాశంతో పాటు భద్రతంగా ఉంటారని తెలిపింది.

గ్యాంగ్​స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ 2021 నాటికి దిల్లీలోని తిహాడ్​ జైలు ఉండేవాడు. తరువాత 2023లో అతనిని గుజరాత్​లోని సబర్మతి సెంట్రల్​ జైల్​కి తరలించారు. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నాడు. అతను బ్యారక్​ల్లోకి అక్రమంగా వచ్చే సెల్​ఫోన్ల ద్వారా అనుచరులతో నిరంతరం టచ్​లో ఉంటూ హత్యలకు ప్రణాళికలు రచిస్తున్నాడనే ఆరోపణలున్నాయి. గాయకుడు సిద్ధూ మూసేవాలా, ఎన్​సీపీ నాయకుడు బాబా సిద్ధిఖీపై దాడులు ఈ విధంగానే చేసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. 
అలాగే బాలీవుడ్ నటుడు సల్మాన్‌ ఖాన్​పై పలుమార్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు పాల్పడింది. గతేడాది రెండుసార్లు సోషల్ మీడియా, ఈ-మెయిల్స్ ద్వారా సల్మాన్​​కు బెదిరింపు హెచ్చరికలు పంపింది. ఎన్​సీపీ నేత బాబా సిద్ధిఖీని దారుణంగా హత్య చేసిన బిష్ణోయ్‌ ముఠా, ఇటీవల కపిల్‌ శర్మ కేఫ్‌పై రెండుసార్లు కాల్పులు జరిపింది. కెనడాతో పాటు విదేశాల్లో బిష్ణోయ్‌ ముఠా హింసాత్మక ఘటనలకు పాల్పడింది.