దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రబాబు దంపతులు

దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రబాబు దంపతులు

దసరా ఉత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రం రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు ఇంద్రకీలాద్రిని సందర్శించి ప్రభుత్వం తరపున దుర్గమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించారు.  రాష్ట్రం అభివృద్ధి చెందాలని ప్రతిపాదించిన పథకాలు, ప్రాజెక్టులు సత్ఫలితాలను ఇవ్వాలని దివ్యమైన, భవ్యమైన రాజధానిగా అమరావతి నిర్మాణం పూర్తయి వెలుగొందాలని పరిపాలనలో ఎలాంటి అవరోధాలు ఇబ్బందులు ప్రతికూలతలు లేకుండా అమ్మవారి కరుణాకటాక్షాలను పాలకులకు అందించాలని సంకల్పం చెప్పారు. 

అనంతరం పండితులు చతుర్వేద ఆశీర్వచనం చేసి ప్రసాదం అందించారు. దేవాదాయశాఖ తరఫున సీఎం దంపతులకు అమ్మవారి చిత్రపటాన్ని మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి అందించారు. రాష్ట్ర ప్రజలకు సుఖసంతోషాలు అందించాలని కోరుకున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.  దుర్గమ్మ దయతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోందని ప్రాజెక్టులన్నీ జలకళతో ఉన్నాయని ప్రజలంతా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండి రాష్ట్ర సంపద పెరగాలని ఆకాంక్షించారు.

నవరాత్రుల సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు దుర్గమ్మను దర్శించుకుంటున్నారని వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా వీఐపీ దర్శనాలను క్రమబద్ధీరించామని చెప్పారు. ఎక్కువ సమయం సామాన్య భక్తులకే కేటాయించామన్నారు. ప్రజలందరిపైనా దుర్గమ్మ ఆశీస్సులు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సూపర్‌ జీఎస్టీ, సూపర్‌సిక్స్‌ ప్రజల ఆదాయం పెరిగే పరిస్థితి వచ్చిందని- ప్రజలకు సేవ చేస్తున్న రెండు ప్రభుత్వాలను దుర్గమ్మ ఆశీర్వదించాలని చంద్రబాబు కోరారు. 

శక్తివంతమైన విజయవాడ కనకదుర్గమ్మ మహిళలు, ఆడబిడ్డలకు మరింత శక్తిని- సామర్ధ్యం ఇచ్చి ఆర్ధిక వ్యవస్థలో వెన్నెముకలా ముందుకెళ్లేలా నడిపించాలని కోరుతున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఆడపిల్లలకు రక్షణగా సాంకేతికత పనిచేస్తుందని దీన్ని మరింత పగడ్భందీగా అమలు చేసి ఎవరైనా మహిళల పట్ల తప్పు చేస్తే నేరుగా వారి చొక్కా పట్టుకుంటామే తప్ప వేరే వారికి ఇబ్బంది కలిగించని రీతిలో దుర్గమ్మ ఆశీర్వదించాలని ఆకాంక్షించారు.

సూపర్‌ సిక్స్‌ కార్యక్రమాల్లో స్త్రీశక్తి సూపర్‌హిట్‌ అయిందని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సూపర్‌ జీఎస్టీతో సూపర్‌ సేవింగ్స్‌ వచ్చే పరిస్థితి వచ్చిందని పన్నుల నుంచి వస్తున్న రాయితీతో ఆదాయం పెంచుకోవాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు పేద, మధ్యతరగతి వర్గాలను ఆదుకునేవేనని ఈ ప్రభుత్వాలను దుర్గమ్మ ఆశార్వదించి శక్తిని ఇచ్చి మరింత ప్రగతి సాధించేలా సహకరించి ఆశీస్సులు ఇవ్వాలని వేడుకున్నట్లు తెలిపారు.