కూటమి ప్రభుత్వం కూడా అమరావతి రైతులను పట్టించుకోదే!

కూటమి ప్రభుత్వం కూడా అమరావతి రైతులను పట్టించుకోదే!
 
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, గత ప్రభుత్వ పద్ధతులే కొనసాగుతున్నాయని, ముఖ్యంగా అమరావతి రైతుల సమస్యలు పరిష్కారం కాని పరిస్థితి కొనసాగుతోందని మాజీ కేంద్ర మంత్రి, బిజెపి ఎల్యేల్యే సుజనా చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రాజధాని నిర్మాణం పేరుతో భూములు ఇచ్చిన రైతులు ఇప్పటికీ న్యాయం కోసం ఎదురుచూస్తున్నారని గుర్తుచేశారు. 
 
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారి 15 నెలలు కావొస్తున్నా కూడా అమరావతి రైతుల సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదని సుజనా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రైతుల సమస్యలపై చర్చించడానికి రెండు గంటల సమయం కేటాయిద్దామని గత సమావేశాల సందర్భంగా స్పీకర్ చెప్పారన్న సుజనా చౌదరి అయితే ఆ సమయం మాత్రం ఇప్పటి వరకూ రాలేదని విస్మయం వ్యక్తం చేశారు. 
 
అందుకే అసెంబ్లీలో చర్చించడం లేదని తాను స్పీకర్‌కు మూడు పేజీల లేఖను కూడా రాసినట్లు సుజనా చౌదరి వెల్లడించారు. అసెంబ్లీలో అధికార పక్షం ఈ అంశాన్ని అడ్రస్ చేయకపోవడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు.  రాష్ట్రాభివృద్ధిలో కీలకమైన రాజధాని సమస్యపై అసెంబ్లీలో సమగ్ర చర్చ జరగకపోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు.
 

అదే సమయంలో గత ప్రభుత్వం పర్యావరణ పరంగా అనేక తప్పులు చేసిందని సుజనా చౌదరి పేర్కొంటూ ఆ తప్పులను సరిదిద్దకుండా, కూటమి ప్రభుత్వం కూడా అదే మార్గంలో నడుస్తోందని ఆరోపించారు. అమరావతి రైతుల సమస్యల పరిష్కారానికి దృఢమైన విధానాలు, పారదర్శకమైన చర్చలు అవసరమని, ఆ దిశగా ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 

 
నాల్గవ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో చంద్రబాబు నాయుడు స్వయంగా ఏ ఫర్ అమరావతి, పీ ఫర్ పోలవరం అంటూ  రాజధాని నిర్మాణానికి అత్యధిక  ప్రాధాన్యం ఇస్తున్నల్టు ప్రకటించారు. అలాగే అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ప్రణాళికలు రచిస్తున్నారు. 
 
అమరావతి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, అమరావతి క్వాంటం వ్యాలీ, అమరావతి స్పోర్ట్స్ సిటీ అంటూ అనేక ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే వైసీపీ హయాంలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఉద్యమించిన అమరావతి రైతుల పరిస్థితి మాత్రం.. అలాగే ఉందంటూ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.