రూ. 996 కోట్లతో 1.41 లక్షల మందికి గుండె చికిత్సలు

రూ. 996 కోట్లతో 1.41 లక్షల మందికి గుండె చికిత్సలు
 
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు 1.41 లక్షల మందికి గుండె చికిత్సలు చేసినట్లు, ఇందుకోసం రూ.996 కోట్లు ఖర్చు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు. గొల్డెన్‌ అవర్‌లో 3,402 మందికి రూ.7 కోట్ల విలువైన వైద్యం అందించినట్లు వెల్లడించారు.  ఈ నెల 29న ప్రపంచ హృద్రోగ దినోత్సవం సందర్భంగా గుండె చికిత్సలకు సంబంధించిన వివరాలతో మంత్రి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఎన్టీఆర్‌ వైద్య సేవా ట్రస్ట్‌లో గత ఏడాది జూన్‌ నుంచి ఇప్పటి వరకూ 19,61,257 మందికి చికిత్సలు పొందగా వీరికి రూ.5,562 కోట్లు ఖర్చు చేశారు. వీరిలో గుండె సమస్యలతో చికిత్స పొందిన వారు 1,41,315 మంది ఉన్నారని, వీరికి రూ.996.20 కోట్లు విలువైన వైద్యాన్ని అందించినట్లు పేర్కొన్నారు.  వీరిలో స్టంట్లు వేయించుకున్న వారు 45,986, బైపాస్‌ సర్జరీలు 9,880 మంది, వాల్వ్‌ మార్పిడి చేయించుకున్న వారు 3,074 మంది, మిగిలిన వారు ఇతర సమస్యలు కలిగిన ఉన్నారని తెలిపారు.
క్యాన్సర్‌ బాధితులు 69,926 మంది ఉండగా వారికి కూటమి ప్రభుత్వం రూ.965.48 కోట్ల విలువైన వైద్యాన్ని అందించినట్లు తెలిపారు.  ఆర్ధోకు సంబంధించిన చికిత్సలు 2,04,108 మంది చేయించుకున్నారని వీరికి రూ.641.89 కోట్ల వ్యయం అయినట్లు తెలిపారు. గుండె సంబంధిత వ్యాధుల చికిత్స అందించే ఆసుపత్రుల సంఖ్య గతం కంటే కూటమి ప్రభుత్వం అధికారం చేపటిటన అనంతరం పెంచామని, ప్రైవేటు, కార్పొరేట్‌ రంగంలో కలిపి 161 ఆసుపత్రులు, 26 ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయని తెలిపారు. 
 
రాష్ట్రంలో 238 ఆసుపత్రుల్లో గోల్డెన్‌ అవర్‌ చికిత్స అందుబాటులో ఉందని పేర్కొన్నారు. టెలీ మెడిసిన్‌ విధానంలో గొల్డెన్‌ అవర్లో గుండెపోటుకు గురైన వారికి త్వరితగతిన చికిత్స అందించేందుకు అమల్లోకి తెచ్చిన ‘స్టెమీ’ విధానంలో 3,402 మందికి టెనెక్ట్‌ ప్లేస్‌ (రక్తం గడ్డ కరగడానికి) ఇంజక్షన్లు ఇచ్చామని వివరించారు.