
జమ్మూకశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భద్రతా బలగాలు ఆదివారంనాడు భగ్నం చేశాయి. పాకిస్థాన్ ఆక్రమిత భాగం నుంచి భారత భూభాగంలోకి అడుగుపెట్టేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించడంతో అప్రమత్తంగా ఉన్న భద్రతా బలగాలు కాల్పులు ప్రారంభించాయి. ఇరువైపులా హోరాహోరీ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు హతమార్చాయి.
అయితే, కెరాన్ సెక్టార్లో కాల్పులు కొనసాగుతుండటం, ఎల్ఓసీ వెంబడి వాతావరణ ప్రతికూలతల కారణంగా మృతదేహాలను ఇంకా స్వాధీనం చేసుకోలేదని తెలుస్తోంది. మిలిటెంట్లు ఎవ్వరూ తప్పించుకుపోకుండా బలగాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. బోర్డర్ బెల్ట్ వెంబడి తప్పించుకునేందుకు అవకాశమున్న అన్ని మార్గాలను సీల్ చేసేందుకు అదనపు బలగాలను మోహరించారు.
అతి సున్నితమైన చొరబాట్ల జోన్‌గా కెరాన్ సెక్టార్‌కు పేరుంది. శీతాకాలానికి ముందు రెండు నెలలూ ఉగ్రవాదులు ఈ జోన్ నుంచి చొరబాటు యత్నాలకు పాల్పడుతుంటారు. దీంతో సీమాంతర ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు భద్రతా బలగాలు నిఘా ముమ్మరం చేస్తుంటాయి.
మరోవంక, ఛత్తీస్‌గఢ్ – ఒడిశా సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. కాంకేర్ జిల్లా దుమార్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారని నిఘా వర్గాల నుంచి ఆదివారం భద్రతా దళాలకు సమాచారం అందింది. దీంతో భద్రతా దళాలు ఆ ప్రాంతానికి చేరుకుని కూంబింగ్ చేపట్టాయి. ఈ విషయాన్ని గమనించిన మావోయిస్టులు భద్రతా దళాలపైకి కాల్పులు ప్రారంభించారు. ఈ వెంటనే భద్రతా దళాలు సైతం ఎదురు కాల్పులకు దిగాయి.
దీంతో ఇరు వైపులా హోరాహోరీగా కాల్పులు జరిగాయి. కొన్ని గంటల తర్వాత మావోయిస్టుల వైపు నుంచి కాల్పులు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు ముందుకు వెళ్లాయి. ఈ కాల్పులు జరిగిన ప్రాంతంలో ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలను భద్రతా దళాలు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నాయి. అలాగే ఈ సంఘటన స్థలంలో కొన్ని ఆయుధాలను సైతం భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆ తర్వాత ఆ ప్రాంతంలో మావోయిస్టుల కోసం కుంబింగ్ ఆపరేషన్‌ను భద్రతా దళాలు చేపట్టాయి.
More Stories
బీహార్ లో తుది ఓటరు జాబితాను విడుదల చేసిన ఈసీ
క్యాన్సర్ పరిశోధనలో భారతీయ కుత్రిమ మేధ
సరిహద్దుల్లో రక్షణకై రూ 30 వేల కోట్లతో మిస్సైల్ వ్యవస్థ