
విజయ్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్న సమయంలో జనసమూహం పెద్దయెత్తున పెరిగిపోయి అదుపు తప్పింది. అప్పటికే వందలాది మంది గాయపడ్డారు. చాలా మంది స్పృహ తప్పి పడిపోయారు. పరిస్థితిని గమనించిన కార్యకర్తలు నిర్వాహకులను అప్రమత్తం చేయడంతో విజయ్ తన ప్రసంగాన్ని ఆపారు. అయితే అన్ని వేల మంది జనాన్ని దాటుకుని అంబులెన్స్‌లు రావడం కష్టమైంది. గాయపడిన వారిని అతి కష్టం మీద దవాఖానలకు తరలించారు.
విషాద ఘటన అనంతరం కూడా విజయ్ ప్రసంగాన్ని కొనసాగించారు. కేవలం 10,000 మందితో రోడ్ పక్కన ప్రచార వ్యాన్ పై నుండి ప్రసంగించేందుకు ఏర్పాట్లు చేయగా, విజయ్ ఆరు గంటల సేపు ఆలస్యంగా రావడం, మధ్యాహ్నం ఎండలో నిలబడుతూ వచ్చిన జనం విజయ్ ప్రసంగం ప్రారంభించగానే ఒకేసారి జనం వ్యాన్ వైపు తోసుకు రావడంతో గాలి కూడా చొరబడని పరిస్థితులలో ఈ తొక్కిసలాట జరిగింది.
‘ఒక దురదృష్టకరమైన, బాధాకరమైన ఘటన జరిగింది. ట్వీట్ సమాచారం తర్వాతే జనసందోహం పెరిగింది. విజయ్ మధ్యాహ్నం 12 గంటలకు వేదికకు వస్తారని టీవీకే పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాలో ప్రకటించారు. ఉదయం 11 గంటల నుంచే జనాలు తరలివచ్చారు. సభకు అనుమతి సాయంత్రం 3 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ఉంది. విజయ్ రాత్రి 7.40కు వచ్చారు. ఆ సమయానికి జనాలు తగిన ఆహారం, నీరు లేక ఎండలో ఇబ్బంది పడ్డారు’ అని వెంకటరామన్ తెలిపారు.
మరోవైపు ఈ ఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్ సంతాపం వ్యక్తం చేశారు. తమిళనాడు చరిత్రలో ఇలాంటి ఘటన చోటుచేసుకోలేదని సీఎం స్టాలిన్ అన్నారు. ఇప్పటివరకు 39 మంది మరణించారని చెప్పారు. ఓ రాజకీయ పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో ఇంత మంది చనిపోవడం ఇదే తొలిసారని వెల్లడించారు. ప్రస్తుతం 51 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.
టీవీకే పార్టీ బహిరంగ సభలో ప్రాణనష్టంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్, బీజేపీ నేత కే అన్నామలై, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ తదితర రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. గాయపడినవారు సత్వరం కోలుకోవాలని ప్రార్థించారు.
ఈ ఘటనపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ కోరింది. సీఎం స్టాలిన్‌తో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడారు. తొక్కిసలాటకు దారితీసన విషయమై ఆరాతీశారు. అవసరమైన సహాయం అందిస్తామని చెప్పారు. దవాఖానల్లో చికిత్స పొందుతున్న బాధితులను కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ శుక్రవారం ఉదయం పరామర్శించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.
కరూర్ తొక్కిసలాట విషాదంపై విజయ్ స్పందిస్తూ ‘నా హృదయం ముక్కలైంది. పదాలు వర్ణించలేని దుఃఖం, విచారంతో నేను విలవిల్లాడుతున్నాను’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సోదర, సోదరీమణుల కుటుంబాలకు సంతాపం, ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు.
More Stories
సంఘ్ ప్రార్థన సమిష్టి సంకల్పం, సాధన ద్వారా మంత్ర శక్తి
బీసీ బిల్లుపై గవర్నర్ తేల్చకముందే జీవోపై హైకోర్టు విస్మయం
సోనమ్ వాంగ్చుక్కు పాకిస్థాన్‌తో సంబంధాలు