
పాకిస్థాన్ ప్రధాని డ్రామాలను ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ మరోసారి చూసిందని, పాక్ విదేశాంగ విధానంలో కేంద్ర బిందువుగా ఉన్న ఉగ్రవాదాన్ని షెహబాజ్ షరీఫ్ కొనియాడారని ఐరాసలో భారత్ శాశ్వత మిషన్ ప్రథమ కార్యదర్శి పెటల్ గెహ్లాట్ ధ్వజమెత్తారు. పాక్ ప్రధాని డ్రామాలతో వాస్తవాలను దాచిపెట్టలేరన్నారని ఆమె స్పష్టం చేశారు. జమ్ముకశ్మీరులోని పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ ‘ది రెసిస్టన్స్ ఫ్రంట్’కు వత్తాసు పలుకుతూ పాక్ ప్రధాని మాట్లాడారని ఆమె మండిపడ్డారు.
ఆ సంస్థ ఉగ్రవాదులే భారతీయ టూరిస్టులను దారుణంగా చంపారని ఆమె గుర్తు చేశారు. ఆపరేషన్ సిందూర్ వేళ సైనిక ఘర్షణను ఆపాలంటూ పాకిస్థాన్ ప్రాధేయపడిందని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 80వ సెషన్ వేదికగా ఆమె వెల్లడించారు. భారత్, పాక్‌లకు సంబంధించిన ఏ వ్యవహారంలోనైనా మూడో పక్షం జోక్యానికి అవకాశమే ఇచ్చేది లేదని స్పష్టం చేస్తూ పాక్ ఉగ్రమూకలు దాడి చేసినందుకే, భారత్ ఆపరేషన్ సిందూర్‌ను నిర్వహించిందని ఆమె తేల్చి చెప్పారు. ఎవరైనా దాడి చేస్తే, బదులిచ్చే హక్కు భారత్‌కు ఉందని, దాన్నే తమ సైన్యం వినియోగించుకుందని ఆమె పేర్కొన్నారు.
“సుదీర్ఘ కాలంగా ఉగ్రవాదులను తయారు చేయడం, వాళ్లను ఎగుమతి చేయడాన్నే పాక్ పనిగా పెట్టుకుంది. చివరకు ఆ దేశమే సిగ్గు లేకుండా తనకు నచ్చిన రీతిలో ఉగ్రవాదానికి, ఉగ్రవాద సంస్థలకు భాష్యం చెబుతుండటం విడ్డూరంగా ఉంది. ఉగ్రవాదంపై పోరులో భాగస్వామిగా ఉన్నామనే నాటకాలాడుతూ, ఒసామా బిన్ లాడెన్‌కు దశాబ్ద కాలం పాటు ఆశ్రయం ఇచ్చింది పాకిస్థానే అని మనం గుర్తుంచుకోవాలి” అంటూ ఆమె తెలిపారు.
“కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాద శిబిరాలను నిర్వహిస్తున్న విషయాన్ని పాక్ మంత్రులు ఇటీవలే ఒప్పుకున్నారు. పాక్ ద్వంద్వ విధానాలు కంటిన్యూ అవుతున్నాయి. ఈసారి పాక్ ప్రధాని స్థాయి వ్యక్తి నుంచి ఆ తరహా వ్యాఖ్యలు వచ్చాయి” అంటూ పెటల్ గెహ్లాట్ ఎండగట్టారు. అంతకు ముందు, సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా రద్దు చేసిందని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఐక్యరాజ్యసమితి వేదికగా ఆరోపించారు.
భారత్ తీసుకున్న చర్యలు అంతర్జాతీయ చట్టాల్ని ఉల్లంఘిస్తున్నాయని, ఇది యుద్ధ చర్యకు సమానమని ఆయన తెలిపారు. కశ్మీర్ సహా అన్ని వివాదాస్పద అంశాలపై భారత్‌తో సమగ్ర చర్చలకు సిద్ధమని అంటూ షరీఫ్ అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. కశ్మీరీల స్వీయ నిర్ణయాధికారం కోసం ఐరాస ఆధ్వర్యంలో నిష్పక్షపాత ఓటింగ్ నిర్వహించాలంటూ పాతపాటే మళ్లీ పాడారు.
ఉగ్రవాదాన్ని పాక్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్న షరీఫ్ టీటీపీ, బీఎల్ఏ వంటి విదేశీ నిధులతో నడిచే సంస్థల నుంచి నిరంతరం బాహ్య ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నామని చెప్పారు. మరోవైపు షరీఫ్ వ్యాఖ్యలను భారత్ తప్పుబట్టింది. “తూర్పు సరిహద్దు నుంచి భారత్ దురాక్రమణ” వాదన నిరాధారమైందని స్పష్టంచేసింది. పాకిస్థాన్ తనను బాధిత దేశంగా చిత్రీకరించుకుంటూ సీమాంతర ఉగ్రవాదానికి జవాబుదారీతనం నుంచి తప్పించుకునే యత్నం చేస్తోందని మండిపడింది.
యుద్ధంలో ఏడు భారత ఫైటర్లు ధ్వంసమయ్యాయన్న షరీఫ్ వ్యాఖ్యలు అసత్యమని తెలిపింది. పాక్‌లోని ఉగ్ర స్థావరాలను తక్షణం ధ్వంసం చేయాలని, ఐరాసలో బాధిత దేశంగా నటించే పాక్ ప్రయత్నాలను అడ్డుకోవాలని అంతర్జాతీయ సమాజాన్ని భారత్ కోరింది. ఇదిలా ఉండగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తమ దేశంలోని వ్యవసాయం, ఐటీ, గనులు, ఖనిజాలు, ఇంధనం వంటి కీలక రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని అమెరికా సంస్థలనూ కోరారు. యూఎస్ పర్యటనలో ఉన్న ఆయన తమ దేశానికి భద్రత, నిఘా రంగాల్లో సహకారం అందించాలని అమెరికాకు విజ్ఞప్తి చేశారు.
More Stories
‘ఐ లవ్ మహమ్మద్’ వివాదంతో బరేలీలో పెద్ద ఎత్తున అల్లర్లు
ఏపీలో యోగ ప్రచార పరిషత్
అమెరికా సుంకాలపై నాటో వాదనల పట్ల భారత్ మండిపాటు