తెలంగాణ డీజీపీగా శివ‌ధ‌ర్ రెడ్డి

తెలంగాణ డీజీపీగా శివ‌ధ‌ర్ రెడ్డి
 
తెలంగాణ డీజీపీగా శివ‌ధ‌ర్ రెడ్డి నియామ‌కం అయ్యారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారింగా ఉన్న శివ‌ధ‌ర్ రెడ్డి ప్ర‌స్తుతం తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ప‌ని చేస్తున్నారు. అక్టోబర్ 1వ తేదీన తెలంగాణ డీజీపీగా శివ‌ధ‌ర్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు.

హైదరాబాద్‌లో జన్మించిన శివధర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తూలేకలాన్ (పెద్దతుండ్ల) గ్రామానికి చెందినవారు. ప్రైమరీ స్కూల్ నుంచి ఉన్నత విద్య వరకు హైదరాబాద్‌లో చ‌దువుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి కొంతకాలం అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేసి తర్వాత సివిల్ సర్వీసెస్ క్లియర్‌ చేసి 1994లో ఇండియన్ పోలీస్ సర్వీస్‌లోకి ప్ర‌వేశించారు.

ఏఎస్పీగా విశాఖపట్నంలోని అనకాపల్లి, నర్సీపట్నం, చింతపల్లిలలో పని చేశారు. గ్రేహౌండ్స్‌ స్క్వాడ్రన్ కమాండర్‌గా‌, బెల్లంపల్లి, ఆదిలాబాద్, నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు జిల్లాల ఎస్పీగా సేవలందించారు. జిల్లాల ఎస్పీగా, డీఐజీ ఎస్ఐబీగా మావోయిస్టుల అణిచివేతలో కీలక పాత్ర పోషించారు. 2014-2016 మధ్యన తెలంగాణ రాష్ట్రానికి మొదటి ఇంటలిజెన్స్ చీఫ్‌గా ప‌ని చేశారు. 2016 నయీం ఎన్‌కౌంట‌ర్‌లో ఆపరేషన్‌ను ప్లాన్ చేశారు.

ఐక్యరాజ్య సమితి శాంతిపరిరక్షక దళంలో భాగంగా యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ కొసావోలో కూడా శివ‌ధ‌ర్ రెడ్డి పని చేశారు. నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు ఎస్పీగా పని చేస్తున్న సమయంలో అనేక సెన్సేషనల్ కేసులను పర్యవేక్షించారు. 2007లో మక్కా మసీదులో బాంబు పేలుళ్లు, పోలీసు కాల్పులలో 14 మంది చనిపోయిన సంఘటన తర్వాత హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా శివధర్ రెడ్డిని ప్ర‌భుత్వం నియ‌మించింది. 

అత్యంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన ఆ సమయంలో రాత్రి పగలు శ్రమించి, అన్ని వర్గాల ప్రజలలో ధైర్యం నింపి శాంతి భద్రతలను సమర్థవంతంగా కాపాడారు. విశాఖపట్నం పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో రోడ్ భద్రత కోసం ఆరైవ్ అలైవ్ క్యాంపెయిన్ నిర్వ‌హించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏసీబీ అడిషనల్ డైరెక్టర్‌గా, డైరెక్టర్‌గా పనిచేశారు.  పర్సనల్ వింగ్‌లో ఐజి, అడిషనల్ డీజీగా సేవ‌లందించారు.

2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇంటెలిజెన్స్ చీఫ్‌గా మళ్ళీ శివధర్ రెడ్డి నియామకం అయ్యారు. గ్యాలంట్రీ మెడల్, పోలీస్ మెడల్, ప్రెసిడెంట్ మెడల్, ఐక్యరాజ్యసమితి మెడల్ సహా అనేక అవార్డుల‌ను శివ‌ధ‌ర్ రెడ్డి అందుకున్నారు.