రాజస్థాన్ ఎడారికి సింధూ జలాలు తరలించే మెగా ప్రాజెక్ట్

రాజస్థాన్ ఎడారికి సింధూ జలాలు తరలించే మెగా ప్రాజెక్ట్

పాకిస్థాన్‌తో సింధూ జలాల ఒప్పందం నిలిపివేసిన తర్వాత వ్యూహాత్మకంగా ఆ జలాలను ఉత్తరాది రాష్ట్రాలకు తరలించడం ద్వారా ఆయా రాష్ట్రాలలో నీటి అవసరాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ భారీ ప్రాజెక్టు చేపట్టేందుకు సి‌ద్ధమైంది. గత శుక్రవారం సీనియర్ మంత్రులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  సింధూ నదిని బియాస్ నదితో కలిపే 14 కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణానికి సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్టు రిపోర్ట్ ఇప్పటికే తయారవుతున్నట్లు సమాచారం.

ఈ ప్రాజెక్టు రిపోర్టును రూపొందించే బాధ్యతను బహుళజాతి నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టికి అప్పగించినట్టు తెలుస్తోంది. ఈ రిపోర్టు వచ్చే ఏడాది నాటికి సిద్ధమవుతుందని భావిస్తున్నారు. సింధూ జలాలను ఉత్తరాది రాష్ట్రాలకు మళ్లించేందుకు ప్రతిపాదిత 113 కిలోమీటర్ల కాలువ నిర్మాణ పనులను కూడా మంత్రుల సమావేశంలో సమీక్షించారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి ఈ ప్రాజెక్టును సిద్ధం చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.

కొద్దీ రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లోని పచ్‌మఢిలో జరిగిన బిజెపి శిక్షణా శిబిరంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ స్పష్టమైన రాజకీయ ప్రకటన చేశారు. “కొద్దీ సంవత్సరాల్లోపు సింధు జలాలను కాలువల ద్వారా రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌కు తీసుకెళ్తాము. ప్రతి నీటి చుక్క కోసం పాకిస్తాన్ తహతహలాడుతుంది” అని ప్రకటించడం ద్వారా వ్యవసాయం, త్రాగునీటి కోసం మాత్రమే కాకుండా, వ్యూహాత్మక, పర్యావరణ కారణాల వల్ల కూడా భారతదేశం తన నీటి వనరులపై నియంత్రణను తిరిగి సాధించడంపై తీవ్రంగా ఉందనే సంకేతం ఇచ్చారు. 

సింధూ నదీ జలాల్లో భారత్ తన వాటా సద్వినియోగం చేసుకునేందుకు ఇంటర్-బేసిన్ ఇండస్ వాటర్ ట్రాన్స్‌ఫర్ స్కీమ్ కింద ఒక భారీ ప్రాజెక్టును రూపొందించారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ ప్రాజెక్టును ప్రభుత్వ అధికారులు ఉన్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నాయి. 14 కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణం ఈ ప్రాజెక్టులో అత్యంత సవాలుతో కూడిన అంశంగా తెలుస్తోంది. 

ఈ టన్నెల్ నిర్మాణానికి పర్వత శిలలపై వివరణాత్మక అధ్యయనం అవసరమని సమాచారం. బలహీనమైన శిలలు ఉన్నట్లయితే, పైపుల ద్వారా టన్నెల్‌ను నిర్మిస్తారు. టన్నెల్ బోరింగ్ మెషిన్లు, రాక్ షీల్డ్ టెక్నాలజీని ఉపయోగించి వేగవంతంగా, సురక్షితంగా నిర్మాణం పూర్తి చేయాలని ప్రతిపాదించారు. ఈ టన్నెల్ జమ్మూకశ్మీర్‌లోని కఠువా జిల్లాలోని ఉజ్ మల్టీపర్పస్ ప్రాజెక్టుతో కలుపుతూ రావి నది ఉపనది అయిన ఉజ్ నీటిని బియాస్ బేసిన్‌కు బదిలీ చేస్తుంది. 

ఈ టన్నెల్ రావి-బియాస్-సట్లెజ్ వ్యవస్థను ఇండస్ బేసిన్‌తో కలుపుతుంది. దీనివల్ల భారత్ తన నీటి వాటాను గరిష్టంగా వినియోగించుకోగలుగుతుంది. ఈ నిర్మాణం 2028 నాటికి పూర్తవుతుందని అంచనాలున్నాయి. దీని వ్యయం దాదాపు 4 నుంచి 5 వేల కోట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు రాజస్థాన్‌లోని ఎడారి ప్రాంతాల్లో ఇందిరా గాంధీ కాలువకు నీటిని మళ్లించడం ద్వారా సాగునీటి సామర్థ్యాన్ని పెంచుతుంది. 

జమ్మూకశ్మీర్, హరియాణా, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలు కూడా ఈ ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందుతాయి. చీనాబ్ నదిని రావి-బియాస్-సట్లెజ్ వ్యవస్థతో కలిపే కాలువ నిర్మాణం జరుగుతుంది. ఇది రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌కు నీటిని చేరవేస్తుంది. ఈ ప్రాజెక్టు దిల్లీ, పంజాబ్, హరియాణా, రాజస్థాన్‌లో తాగునీటి లభ్యతను కూడా మెరుగుపరుస్తుంది. భారత్‌ తన వాటా నీరు పాకిస్థాన్‌కు ప్రవహించకుండా నిలిపివేసి, దేశ నీటి భద్రతను బలోపేతం చేస్తుంది. 

ఇది వాతావరణ మార్పులు, మారుతున్న వర్షపాత నమూనాల ప్రభావాన్ని తగ్గించడంతోపాటు, ఇప్పటికే ఉన్న 13 కాలువ వ్యవస్థలను బలోపేతం చేస్తుంది. అదనంగా, జమ్మూలోని రణబీర్ కాలువ పొడవును 60 కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్లకు విస్తరించే ప్రణాళికలు కూడా ఉన్నాయి. 1960ల్లో భారత్‌, పాక్‌ మధ్య సింధూ నదీ జలాల ఒప్పందం కుదిరింది. 

దాంతో సింధూ నదితో పాటు దాని పశ్చిమ ఉపనదులైన జీలం, చీనాబ్‌లపై పాకిస్థాన్‌కు హక్కులు దక్కాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత దీని అమలును భారత్‌ నిలిపివేసింది. అప్పటి నుంచి ఈ అంశం దాయాదికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. పాకిస్థాన్‌లో నీటి సరఫరా అత్యధికంగా సింధూ జలాలపై ఆధారపడింది. అక్కడ వ్యవసాయానికి వాడే నీటిలో 80 శాతం ఈ ఒప్పందం కింద లభిస్తుంది.