
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) నుంచి తప్పుకుంటూ ఎల్‌అండ్‌టీ (ఎల్‌అండ్‌టీ) సంచలన నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు గురువారం ఓ ప్రకటనలో తన నిర్ణయాన్ని వెల్లడించింది. దానితో హైదరాబాద్‌లో మెట్రో రైలు సేవలను విస్తరించడంలో భాగంగా మొదటి దశ మెట్రోను స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు సిఎం రేవంత్‌రెడ్డి ఎల్ అండ్ టీ కంపెనీ ప్రతినిధులతో కీలక చర్చలు జరిపారు. ప్రధానంగా హైదరాబాద్ మెట్రో మొదటి దశ నుంచి తప్పుకునేందుకు రూ.13 వేల కోట్ల అప్పుల్ని తీసుకోవడంతోపాటు తమకు రూ.5,900 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ముందు డిమాండ్ ఉంచిన ఎల్‌అండ్‌టీ, సంప్రదింపుల్లో భాగంగా కేవలం రూ.2 వేల కోట్లు మాత్రమే తీసుకొని తప్పుకునేందుకు అంగీకరించింది.
డిమాండ్ చేసిన దానిలో కేవలం మూడోవంతుతోనే సరిపెట్టుకుని మెట్రో నుంచి తప్పుకొని సుమారు రెండు దశాబ్దాల బంధాన్ని తెంపుకొనేందుకు ఆ కంపెనీ సిద్ధమైందంటే తెరవెనక బలమైన కారణాలే ఉన్నాయని పారిశ్రామిక వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకు రేవంత్ సర్కారు దుందుడుకు చర్యలే ప్రధాన కారణమని ఆరోపణలు చెలరేగుతున్నాయి. చివరకు కరోనా కష్టకాలంలోనూ నెట్టుకొచ్చిన ఎల్‌అండ్‌టీ ఇక తాము ఇక్కడ వేగలేమని తెగదెంపులు చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చోటుచేసుకున్న కీలక పరిణామాలే కారణమని చెప్తున్నారు.
ఆసియాలోనే అతిపెద్ద పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ మెట్రో ప్రాజెక్టుగా హైదరాబాద్ మెట్రోకు ఖ్యాతి ఉన్నది. కానీ ఇప్పుడా ఖ్యాతి ఒక్కసారిగా మసకబారింది. 2017లో మెట్రో రైలును అందుబాటులోకి తీసుకువచ్చిన ఎల్‌అండ్‌టీ ఆపై తాము ఆశించిన స్థాయిలో వాణిజ్య ప్రణాళికలు (భూముల్ని లీజుకివ్వడం, వ్యాపారపరంగా అభివృద్ధి చేయడం) కలిసిరాలేదని ఆది నుంచి చెప్తూవస్తున్నది.
కరోనా వంటి క్లిష్టమైన పరిస్థితుల్లోనూ మెట్రో ప్రాజెక్టును ముందుకు నెట్టుకొచ్చిన ఎల్‌అండ్‌టీ నానాటికీ ప్రయాణికుల సంఖ్య పెరిగి ఏకంగా రోజుకు ఐదు లక్షలకు చేరుకోవడంతోపాటు విస్తరణ ప్రాజెక్టులు వస్తున్న ఈ తరుణంలో ప్రాజెక్టు నుంచి పూర్తిగా తప్పుకోవాలనే నిర్ణయం తీసుకోవడం విస్మయం కలిగిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కంపెనీకి ఆశావహ పరిస్థితులు కనిపించకపోగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఒకవిధంగా కక్షతో వెంటాడే తీరుగా వ్యవహరించడాన్ని జీర్ణించుకోలేకపోయిందని పారిశ్రామికవర్గాల్లో చాలాకాలంగా చర్చ జరుగుతున్నది.
2014లో దేశంలో మెట్రో రైలు నెట్‌వర్క్‌లో రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్, ప్రస్తుతం తొమ్మిదవ స్థానానికి పడిపోయింది. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ సిటీలో ట్రాఫిక్ రద్దీ, ప్రజా రవాణా అవసరాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం మెట్రోను విస్తరించే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఫేజ్ 2ఏ, 2బి విస్తరణలో భాగంగా ఎనిమిది కొత్త మెట్రో లైన్ల ప్రతిపాదనలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. దాదాపు 163 కిలోమీటర్ల మేరకు మెట్రోను విస్తరించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
More Stories
రాజస్థాన్ ఎడారికి సింధూ జలాలు తరలించే మెగా ప్రాజెక్ట్
సోనమ్ వాంగ్ చుక్ సంస్థ ఎఫ్సిఆర్ఎ లైసెన్స్ రద్దు
రూ. 62,370 కోట్లతో 97 తేజస్ యుద్ధ విమానాల కొనుగోలు