
కశ్మీర్ అంశంపై భారత్-పాకిస్థాన్ మధ్య జోక్యం చేసుకునే ఉద్దేశం తమకు లేదని అమెరికా స్పష్టం చేసింది. అది భారత్-పాక్ మధ్య ఉన్న సమస్య అని, ఆ రెండు దేశాలే పరిష్కారించుకోవాలని అమెరికా సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. అలాగే త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలుస్తారని చెప్పారు. “కశ్మీర్ అనేది భారత్-పాక్ మధ్య ఉన్న ద్వైపాక్షిక సమస్య. రెండు దేశాలు నేరుగా పరిష్కరించుకోవాల్సిన అంశం. ఇదే దీర్ఘకాలంగా అమెరికా విధానం. ఏదైనా అంశంలో అమెరికా సహకారం కావాలనుకుంటే, మేం అందుకు సిద్ధంగా ఉంటాం” అని తెలిపారు.
“అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వద్ద ఇప్పటికే పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. అందుకే కశ్మీర్ సమస్యను భారత్, పాక్ పరిష్కరించుకోవాలని భావిస్తున్నా. ఈ విషయంలో మాకు జోక్యం చేసుకోవాలనే ఆసక్తి కూడా లేదు” అని ఆ సీనియర్ అధికారి తేల్చి చెప్పారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని ఉందని విదేశాంగ సీనియర్ అధికారి పేర్కొన్నారు. ఇద్దరు త్వరలోనే కలుస్తారని తెలిపారు. ఈ ఏడాది చివర్లో లేదా 2026 ప్రారంభంలో జరగనున్న తదపరి క్వాడ్ సమావేశం కోసం ప్రణాళికలు జరుగుతున్నాయని వెల్లడించారు.
“భారత్-అమెరికా మధ్య నడుస్తున్న వాణిజ్య చర్చలు అత్యంత ఫలప్రదంగా ఉన్నాయి. రానున్న నెలల్లో సానుకూల పరిణామాలు కనిపిస్తాయి. రెండు దేశాల మధ్య విభేదాలు ఉన్నాయి. గత కొన్ని వారాలుగా వాటిని పరిష్కరించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ముఖ్యంగా వాణిజ్యం, రష్యా చమురు కొనుగోలు వంటి అంశాల్లో పరిష్కరించేందుకు రెండు దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి” అని అమెరికా అధికారి తెలిపారు.
ఈసారి జరగనున్న సమ్మిట్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ నేతలు పాల్గొనున్నారు. కాగా, ప్రధాని మోదీ ఆ పుట్టిన రోజు సందర్భంగా ట్రంప్ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన విషయాన్ని సీనియర్ అధికారి గుర్తు చేశారు. అది అత్యంత సానుకూలమైన సంభాషణగా అభివర్ణించారు. ఐక్యరాజ్యసమితి 80వ జనరల్ అసెంబ్లీలో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో జరిగిన భేటీ గురించి తెలిపారు. గంటపాటు జరిగిన ఈ చర్చల్లో వాణిజ్య, రక్షణ,సాంకేతిక వంటి అంశాలపై చర్చించినట్లు చెప్పారు.
“మేం మా స్నేహితులతో నిజాయితీగా ఉన్నాం. భారత్ను మంచి స్నేహితుడిగా, భాగస్వామిగా చూస్తాం. సుంకాల విషయంలో ట్రంప్ చాలా స్పష్టంగా ఉన్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించాలని ఆయన కోరుకుంటున్నారు. రష్యాకు ఆదాయ వనరులు నిలిచిపోవాలని ట్రంప్ అధ్యక్షుడు స్పష్టంగా కోరుతున్నారు” అని ఆయన వివరించారు.
“యూరోపియన్ భాగస్వాములు, భారత్‌తో కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాం. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు అంశం ప్రతి ద్వైపాక్షిక సమావేశంలో లాగే ఈసారి కూడా ప్రస్తావించారు.ఈ మంత్రుల సమావేశాలు, భేటీ అన్ని చూస్తే భారత్- అమెరికా సంబంధాలు విభేదాలు దాటి, సానుకూల దిశలో సాగుతున్నాయి” అని సీనియర్ అధికారి తెలిపారు.
More Stories
హైదరాబాద్ మెట్రో నుండి ఎల్అండ్టీ నిష్క్రమణ!
సోనమ్ వాంగ్ చుక్ సంస్థ ఎఫ్సిఆర్ఎ లైసెన్స్ రద్దు
రూ. 62,370 కోట్లతో 97 తేజస్ యుద్ధ విమానాల కొనుగోలు