రైలుపై మొబైల్ లాంచర్ ద్వారా అగ్ని ప్రైమ్ క్షిపణి ప్రయోగం

రైలుపై మొబైల్ లాంచర్ ద్వారా అగ్ని ప్రైమ్ క్షిపణి ప్రయోగం

రైలు ఆధారిత మొబైల్‌ లాంఛర్‌ అగ్ని ప్రైమ్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. అనేక అత్యాధునిక సాంకేతికలను జోడించి రూపొందించిన ఈ క్షిపణి 2000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ధ్వంసం చేయగలదు. ఈ క్షిపణిని రైలుపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మొబైల్ లాంచర్‌ నుంచి భారత రక్షణ, పరిశోధనా అభివృద్ధి సంస్థ(డీఆర్​డీఓ) పరీక్షించింది. ఇలా రైలుపై మొబైల్ లాంచర్ ద్వారా క్షిపణి పరీక్ష చేయడం ఇదే తొలిసారి. ఇదే విషయాన్ని రక్షణమంత్రి రాజ్​నాథ్ తెలియజేస్తూ ఎక్స్​లో పోస్ట్​ చేేశారు.

‘అగ్ని-ప్రైమ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినందుకు డీఆర్​డీఓ, స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ (ఎస్ ఎఫ్ సి), సైన్యానికి అభినందనలు. ఈ విజయం భారత రక్షణ రంగంలో ఓ మైలురాయి. ఇది దేశవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద రైలు నెట్‌వర్క్ ద్వారా ఎక్కడికైనా సులభంగా తరలించే అవకాశం ఉంది. అంతేకాకుండా అతి తక్కువ వెలుతురులోనూ, అతి స్వల్ప సమయంలోనూ అగ్నిప్రైమ్‌ క్షిపణిని ప్రయోగించవచ్చు’ అని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.

ఈ సామర్థ్యం ప్రస్తుతం కొద్ది దేశాలకు మాత్రమే ఉంది. ఇప్పుడు ఆ దేశాల సరసన భారత్​ కూడా చేరింది. దేశవ్యాప్తంగా రైల్వే నెట్‌వర్క్‌లో ఎలాంటి మందస్తు షరతులు లేకుండా స్వేచ్ఛగా కదలే సామర్థ్యం ఈ వ్యవస్థకు ఉంది. అంతేకాకుండా తక్కువ సమయానికే వేగంగా క్షిపణులను ప్రయోగించే సౌలభ్యాన్ని అందిస్తుంది.  ఇది మన రక్షణ వ్యవస్థకు అదనపు బలాన్ని చేకూరుస్తుంది. దీనిలో రింగ్‌ లేజర్‌ గైరో ఆధారిత ఇనర్షల్‌ నేవిగేషన్‌, మైక్రో ఇనర్షల్‌ నేవిగేషన్‌ సిస్టమ్‌లను అమర్చారు.

అంతేకాకుండా జీపీఎస్‌, నావిక్‌ శాటిలైట్‌ నేవిగేషన్లకు కూడా ఉన్నాయి. ఇక ఈ మిసైల్‌కు ఉన్న కెనిస్టర్‌ డిజైన్‌ కారణంగా తేలికగా భద్రంగా రవాణా చేయగలదు. ఇది లాంఛింగ్‌కు అవసరమైన సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. రైలు మొబైల్‌ లాంఛర్‌ ద్వారా క్షిపణులను రైల్వేలైన్లలో దేశంలోని వివిధ ప్రాంతాలకు తక్కువ సమయంలో సులువుగా తరలించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అగ్ని-పి క్షిపణి పలు టెస్టుల్లో సామర్థ్యాన్ని నిరూపించుకుంది.