
జమ్మూ కాశ్మీర్లో చాలాకాలం నుంచి ఖాళీగా ఉన్న నాలుగు రాజ్యసభ స్థానాలకు, పంజాబ్‌లో ఖాళీగా ఉన్న ఒక స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. బుధవారం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దాదాపు నాలుగేళ్లుగా నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటితోపాటు పంజాబ్‌లో ఒక రాజ్యసభ స్థానానికి కూడా ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఇసి తెలిపింది.
జమ్మూ కాశ్మీర్లో ఖాళీగా ఉన్న నాలుగు రాజ్యసభ స్థానాలకు మూడు వేర్వేరు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఆ నాలుగు రాజ్యసభ స్థానాలు మూడు వేర్వేరు ద్వైవార్షిక సైకిళ్లలో ఉన్నాయని, కాబట్టి చట్ట ప్రకారం ఆ నాలుగు స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు ‘ఎకె వాలియా వర్సెస్ కేంద్ర ప్రభుత్వం (1994)’ కేసులో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించింది.
ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలు వేర్వేరు కేటగిరీలకు సంబంధించినవై ఉన్నప్పుడు ఆయా స్థానాలకు ఎన్నికలు వేర్వేరుగా నిర్వహించాలని నాడు ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. జమ్మూ కాశ్మీర్లో రెండు రాజ్యసభ స్థానాలు 2021 ఫిబ్రవరి 15న ఖాళీ కాగా, మరో రెండు స్థానాలు 2021 ఫిబ్రవరి 10 కంటే ముందు ఖాళీ అయ్యాయి. ఫిబ్రవరి 2021లో అప్పటి ఎంపిలు మీర్ మొహ్మద్ ఫయాజ్, షంషేర్ సింగ్, గులాం నబీ ఆజాద్, నజీర్ అహ్మద్ లావే పదవీకాలం ముగియడంతో జమ్మూ కాశ్మీర్‌లోని నాలుగు స్థానాలు ఖాళీ అయ్యాయి.
ఆ సమయంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రపతి పాలనలో ఉండటం, అసెంబ్లీ లేకపోవడంతో, ఆ నాలుగు స్థానాలకు ఎన్నికలు నిర్వహించలేదు. అలాగే ఆప్ ఎంపి సంజీవ్ అరోరా తన పదవికి రాజీనామా చేసి రాష్ట్ర కేబినెట్లో చేరడంతో పంజాబ్‌లో ఒక స్థానం ఖాళీ అయింది. ఈ 5 స్థానాలకు ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి. అక్టోబరు 24న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదేరోజు సాయంత్రం 5 గంటలకు ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు.
More Stories
అస్తిత్వ సంక్షోభంలో హిమాచల్ ప్రదేశ్
లేహ్‌లో రెచ్చిపోయిన ఆందోళనకారులు
అయోధ్యలో మసీదు నిర్మాణానికి బ్రేక్