భారత్ లో మహిళల ప్రాముఖ్యతకు నిదర్శనం నవరాత్రి

భారత్ లో మహిళల ప్రాముఖ్యతకు నిదర్శనం నవరాత్రి
దేశవ్యాప్తంగా దుర్గా నవరాత్రులు ఎంతో ప్రత్యేకమని చెబుతూ తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని భక్తితో పూజించే సంప్రదాయం ద్వారా మన భారతీయ సంస్కృతిలో మహిళల ప్రాముఖ్యతను ఈ ఉత్సవాలు తెలియజేస్తున్నాయని ఉపరాష్ట్రపతి  సి.పి. రాధాకృష్ణన్  తెలిపారు. విజయవాడ పున్నమి ఘాట్‌లో నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్ – 2025 లో  ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. 

మహిళా శక్తిని గౌరవించడం భారతీయ సంప్రదాయమని, అమ్మవారిని అన్నపూర్ణ దేవిగా కొలవడం ద్వారా శక్తి, భక్తి రెండూ లభిస్తాయని ఆయన చెప్పారు. ఉత్సవం ద్వారా ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  తెలుగు భాష సౌందర్యం, సాహిత్యం, సంగీత వైభవాన్ని ప్రశంసిస్తూ తెలుగు భాష ఎంతో మధురమైనదని ప్రముఖ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి అన్న మాటలను ఈ సందర్బంగా ప్రస్తావించారు..

విజయవాడ ఉత్సవ్ మరో వందేళ్లపాటు కొనసాగాలని ఆకాంక్షించారు. విజయవాడ ప్రాంతం వేడిగా ఉన్నా ఇక్కడ ప్రజలు మాత్రం కూల్  గా ఉంటారని,  రాబోయే రోజుల్లో విజయవాడ దేశంలోనే అభివృద్ధి చెందిన నగరంగా నిలవబోతోందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పై మాట్లాడుతూ విద్య, వైద్య రంగాల్లో రాష్ట్రం ముందుకు సాగుతోందని చెప్పారు.

వికసిత భారత్ అనేది ఒక కల కాదు, అది నిజం అని స్పష్టం చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు వెళ్తోందని విశ్వాసం వ్యక్తం చేశారు. శాస్త్ర, సాంకేతిక, వైద్య, విద్య రంగాల్లో కూడా రాష్ట్రం విశేష పురోగతిని సాధిస్తోందని తెలిపారు. ఉపరాష్ట్రపతి గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన మొదటి అధికారిక పర్యటన లో భాగంగా విజయవాడకు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. 
ఇక్కడి సంప్రదాయాలు, సంస్కృతి దేశానికి గర్వకారణమని చెబుతూ కనకదుర్గ అమ్మ పేరులోనే అనుగ్రహం, ప్రేమ, అమృతం నిక్షిప్తమై ఉంది అని భావోద్వేగంగా తెలిపారు. మంత్రులు, అధికారులు అందరూ కలసి రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరుతూ, రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
 
కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ల మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ విజయవాడ ఆధ్యాత్మిక, సాంస్కృతిక శోభతో మెరిసిపోతుందని తెలిపారు. ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి కి ముందడుగు వేస్తున్నారని, సాంప్రదాయంతో సాంకేతికతను, సంస్కృతితో సృజనాత్మకతను, వారసత్వ సంపదతతో అభివృద్దిని సమ్మళితం చేసి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నారని ప్రశంసించారు. మన పండుగలు మన జీవన విధానమని, గ్రంధాలయాలు మన సంస్కృతికి నిదర్శనమని చెప్పారు.

విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ ఆధ్యాత్మిక, పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. మూడు వేల మంది కళాకారులు ఈ ఉత్సవాల్లో ప్రదర్శనలు ఇస్తున్నారని చెప్పారు.
 
అంతకు ముందు, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ దంపతులు విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి గర్భగుడిలోకి ప్రవేశించిన ఉపరాష్ట్రపతి గోడలపై అమ్మవారి అలంకరణ విశేషాలతో కూడిన ఫొటోలను, ధ్వజస్తంభాన్ని దర్శించుకుని నమస్కరించారు. అంతరాలయంలో మాతాన్నపూర్ణశ్వేరి ఎంతో సౌందర్యంగా భిక్షాందాహి అంటూ పరమేశ్వరుడు పాత్ర పట్టుకుని నిలుచున్న అలంకరణను ఉపరాష్ట్రపతి దంపతులు ఎంతో తన్మయత్వంతో తిలకించి పులకించారు.