
దేశంలో గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఇంధ కేంన ఎనర్జీ రంగంలో సరికొత్త ఆవిష్కరణలతో అద్భుతమైన అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఎకనామిక్ టైమ్స్ ఎనర్జీ లీడర్‌షిప్ సదస్సులోప్రసంగిస్తూ కేంద్ర బొగ్గు, గనులు, పునరుత్పాదక శక్తి, క్రిటికల్ మినరల్స్ రంగాల్లో కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యల ఫలితంగా ఇవాళ భారత్ అంతర్జాతీయ ఇంధన రంగంలో కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు.
త్వరలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం రూపుదిద్దుకోనున్న నేపథ్యంలో మన ఎనర్జీ అవసరాలు భారీగా పెరగనున్నాయని తెలిపారు. 2070 నాటికి నెట్ జీరో ఉద్గారాల దిశగా మన దేశాన్ని నడిపించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందిని పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పన వేగతవంతం చేయడం, ఆత్మనిర్భరత సాధించడం, అంతర్జాతీయంగా ఎదిగేందుకు వీలుగా పరిశ్రమల ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటోందని ఆయన వివరించారు.
అంతర్జాతీయంగా ప్రతికూల రాజకీయ, భౌగోళిక పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఇంధన భద్రతా రంగంలో అవకాశాలుగా మలుచుకుంటున్నామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. స్థాపిత పునరుత్పాదక శక్తి సామర్థ్యం విషయంలో భారత్ ప్రపంచంలో నాలుగో స్థానంలో, వాయు పవన విద్యుత్‌లో నాలుగో స్థానంలో, సౌర విద్యుత్ ఉత్పత్తిలో మూడో స్థానంలో ఉందని ఆయన తెలిపారు. 2014 నుంచి పునరుత్పాదక శక్తి ఉత్పత్తి మూడు రెట్లు పెరిగిందని, దేశంలోని విద్యుత్ అవసరాల్లో సగం మేర శిలాజేతర ఇంధనాల నుంచే ఉత్పత్తి అవుతోందని వెల్లడించారు.
అయితే, ఇప్పటికీ బొగ్గు వంటి సంప్రదాయ మూలాధారాల నుంచే ఎక్కువ శాతం విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని, భవిష్యత్తులో కూడా మన విద్యుత్ భద్రత విషయంలో బొగ్గు ప్రధాన పాత్ర పోషిస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. గతేడాది రికార్డు స్థాయిలో 1 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా జరిగిందని తెలిపారు. 2030 నాటికి బొగ్గు డిమాండ్ 1.6 బిలియన్ టన్నులకు చేరుతుందని అంచనా వేశారు.
అందుకే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఇంధన రంగంలో సుస్థిరతను సాధించేందుకు పునరుత్పాదక శక్తి, క్రిటికల్ మినరల్స్ ఉత్పత్తిపై దృష్టి సారించాయని ఆయన తెలిపారు. ఇప్పటికే 1,900 మెగావాట్ల సోలార్, పవన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను స్థాపించామని, 2030 నాటికి 15 గిగావాట్ల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. కోల్ గ్యాసిఫికేషన్ మిషన్ ద్వారా 2030 నాటికి 10 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నామని తెలిపారు. స్వదేశీ వస్తువులనే వాడాలంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల పిలుపునిచ్చారని పేర్కొంటూ ఇదే స్ట్రాటజీ ఖనిజ రంగం, ఇంధన రంగానికి కూడా వర్తిస్తుందని చెప్పారు.
క్రిటికల్ మినరల్స్‌ను రీసైక్లింగ్ చేసేందుకు రూ.1500 కోట్లతో ఇన్సెంటివ్ పథకాన్ని తీసుకొచ్చామని పేర్కొంటూ 2047 నాటికి వికసిత భారత్ సాధించేందుకు ఇంధన భద్రత, పర్యావరణ సుస్థిరత రెండు స్తంభాల్లాంటివి. వీటిని సాధించేందుకు బొగ్గు, గనుల రంగం అంకిత భావంతో పనిచేస్తోందని చెప్పారు. జీఎస్టీ 2.0 ద్వారా బొగ్గుపై గతంలో ఉన్న సెస్ పూర్తిగా ఎత్తేశామని, దీంతో బొగ్గు ఆధారిత ఉత్పత్తులు, రంగాలలో ధరలు తగ్గుతాయని కేంద్ర మంత్రి తెలిపారు.
More Stories
అభివృద్ధి మొదట అట్టడుగు వర్గాలకే అన్న దీనదయాళ్!
లేహ్‌లో ఆందోళనల వెనుక కుట్ర.. నలుగురు మృతి
అస్తిత్వ సంక్షోభంలో హిమాచల్ ప్రదేశ్