లేహ్‌లో రెచ్చిపోయిన ఆందోళ‌న‌కారులు

లేహ్‌లో రెచ్చిపోయిన ఆందోళ‌న‌కారులు
* నిరాహారదీక్ష విరమించిన సోనమ్ వాంగ్‌చుక్
ల‌డాఖ్‌లోని లేహ్ జిల్లాలో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చోటుచేసుకున్నాయి. ల‌డాఖ్‌కు ప్ర‌త్యేక రాష్ట్ర హోదాను ఇవ్వాల‌ని, రాజ్యాంగంలోని ఆర‌వ షెడ్యూల్‌లో చేర్చాల‌ని గ‌త 15 రోజుల‌గా విద్యావేత్త సోన‌మ్ వాంగ్‌చుక్ లేహ్‌లో ఆమ‌ర‌ణ దీక్ష చేస్తున్నారు. అయితే బుధవారం ఆందోళ‌న‌కారులు హింస‌కు పాల్ప‌డ్డారు.  వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణిస్తున్న నేప‌థ్యంలో స్థానికులు విధ్వంసం సృష్టించారు. అయితే, తన నిరాహారదీక్ష హింసకు దారితీయడంతో కలత చెందిన  సోన‌మ్ వాంగ్‌చుక్ దీక్షను విరమిస్తున్నట్లు ప్రకటించారు. 
రాష్ట్ర హోదా, ఆరవ షెడ్యూల్ కోసం నిరసనలకు నాయకత్వం వహిస్తున్న ఉద్యమకారుడుసోనమ్ వాంగ్‌చుక్ హింస చెలరేగడం దురదృష్టకరమని అభివర్ణించారు. “లేహ్‌లో చాలా విచారకరమైన సంఘటనలు. శాంతియుత మార్గం గురించి నా సందేశం ఈరోజు విఫలమైంది. దయచేసి ఈ అర్ధంలేని పనిని ఆపమని నేను యువతకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది మన లక్ష్యాన్ని దెబ్బతీస్తుంది” అని వాంగ్‌చుక్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
లద్దాఖ్​కు రాష్ట్ర హోదా కల్పించాలని కోరుతూ లేహ్ ఏపెక్స్ బాడీ (ఎల్​ఏబీ) యువ విభాగానికి చెందిన 15 మంది యువత సెప్టెంబర్‌ 10 నుంచి 35 రోజుల నిరహార దీక్షకు దిగారు. వారిలో ఇద్దరి పరిస్థితి క్షీణించడంతో మంగళవారం సాయంత్రం ఆస్పత్రికి తరలించారు. దీంతో ఎల్​ఏబీ యువజన విభాగం బుధవారం బంద్, నిరసనకు పిలుపునిచ్చింది. వందలాది యువత వీధుల్లోకి వచ్చి నిరసనలు చేశారు. వారిని చెదరగొట్టేందుకు వచ్చిన పోలీసులతో ఘర్షణకు దిగారు.
లేహ్‌కు చెందిన యువ‌త కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. ల‌డాఖ్ హ‌క్కుల‌ను కేంద్రం కాల‌రాస్తున్న‌ట్లు ఆందోళ‌న‌కారులు ఆరోపించారు. నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న ఒక్క‌సారిగా విధ్వంస‌క‌రంగా మారింది.   లేహ్‌లో ఉన్న ల‌డాఖ్ అటోన‌మ‌స్ హిల్ డెవ‌ల‌ప్మెంట్ కౌన్సిల్ ఆఫీసును ఆందోళ‌న‌కారులు చుట్టుముట్టేశారు. భవనంప్ర‌వేశించ‌కుండా ఉండేందుకు నిర‌స‌న‌కారుల్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆ స‌మ‌యంలో వాళ్లు భ‌ద్ర‌తా సిబ్బందిపై రాళ్లు రువ్వారు. అనేక వాహ‌నాల‌కు నిప్పుపెట్టారు. టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగించాల్సి వ‌చ్చింది.

పోలీసులు ఆందోళనకారులపై లాఠీలు ఝలిపించగా ఆందోళనకారులు వారిపై తిరగబడ్డారు. రాళ్లు రువ్వుతూ వెంటపడ్డారు. ఈ క్రమంలోనే లేహ్‌లోని బీజేపీ కార్యాలయానికి కూడా ఆందోళనకారులు నిప్పుపెట్టారు. దాంతో అక్కడి పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.  ల‌డాఖ్‌లోని ముఖ్య ప్ర‌తినిధుల బృందాల‌తో కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్చ‌ల్లో నిమగ్న‌మైంది. లేహ్ అపెక్స్ బాడీ(ఎల్ఏబీ), కార్గిల్ డెమోక్ర‌టిక్ అలియ‌న్స్ సంఘాల ప్ర‌తినిధులు చ‌ర్చ‌లు నిర్వ‌హిస్తున్నారు.

లేడాఖ్‌కు రాష్ట్ర హోదా ఇవ్వాల‌ని మూడేళ్లుగా ఈ సంఘాలు పోరాడుతున్నాయి. లేహ్‌, కార్గిల్‌లో ప్ర‌స్తుతం భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. లద్దాఖ్​లో ఇలాంటి పరిస్థితులు తలెత్తడం ఇదే తొలిసారి. ప్రజల డిమాండ్లపై చర్చించేందుకు లద్దాఖ్‌ ప్రతినిధులు అక్టోబర్ 6న సమావేశానికి రావాలంటూ కేంద్రం ఆహ్వానించిన సమయంలో ఈ ఆందోళనలు చేపట్టారు. ఈ నిరాహార దీక్షకు ప్రముఖ వాతావరణ కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ నేతృత్వం వహిస్తున్నారు.

రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ ను ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, మిజోరం, అస్సాంలలోని గిరిజన వర్గాలను రక్షించడానికి రూపొందించారు. ఇది రాష్ట్రపతి, గవర్నర్ పాత్రలు, అధికారాలతో సహా పాలన కోసం ప్రత్యేక నియమాలను అందిస్తుంది. ఇది స్థానిక పాలక సంస్థల రకాలను కూడా నిర్వచిస్తుంది. ప్రత్యామ్నాయ న్యాయ వ్యవస్థలను ఏర్పాటు చేస్తుంది. స్వయంప్రతిపత్తి మండళ్ల ద్వారా ఆర్థిక అధికారాన్ని మంజూరు చేస్తుంది.