కాళేశ్వరం కమిషన్‌ నివేదికను కొట్టేయండి

కాళేశ్వరం కమిషన్‌ నివేదికను కొట్టేయండి

కాళేశ్వరం కమిషన్‌ నివేదికపై సీనియర్ ఐఏఎస్‌ అధికారిణి స్మితా సబర్వాల్‌ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం హయంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడంపై జస్టిస్ పిసి ఘోష్  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిషన్ ఇటీవల పూర్తి రిపోర్టును కాంగ్రెస్ ప్రభుత్వానికి అందజేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ రిపోర్టును సవాల్ చేస్తూ మంగళవారం స్మితా సబర్వాల్‌ హైకోర్టులో పిటిషన్ వేశారు.

ఈ 665 పేజీల నివేదికలో తనపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసిన కమిషన్ తన వివరణ తీసుకోలేదని పిటిషన్‌ లో ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు పీసీ ఘోష్ కమిటీ రిపోర్టును క్వాష్ చేయాలని కోరారు. అలాగే ఈ నివేదికఆధారంగా తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరినట్లు సమాచారం.

ఇప్పటికే ఈ వ్యవహారంలో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు ఊరట లభించింది.
ఈ నేపథ్యంలో తాజాగా స్మితా సబర్వాల్‌ సైతం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాలకు ముందు కాళేశ్వరం కమిషన్‌ రిపోర్ట్‌ను కొట్టేయండని మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులు కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఘోష్ కమిషన్ రూపొందించిన రిపోర్టును సవాల్ చేస్తూ హైకోర్టులో ఇద్దరు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. 

కాంగ్రెస్‌ ప్రభుత్వం తమపై రాజకీయ కక్ష సాధిస్తోందని, ప్రభుత్వానికి ఏది కావాలో కమిషన్‌ రిపోర్ట్ ఆ విధంగా ఉందని ఆరోపించారు. ఘోష్ కమిషన్ తమ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోలేదని, ఆ రిపోర్ట్ పై స్టే ఇవ్వాలని పిటిషన్ లో కోరారు. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు డ్యామేజీపై జస్టిస్ పిసి ఘోష్ ఆధ్వర్యంలోని కమిషన్ 16 నెలలుగా విచారణ జరిపి రిపోర్టును కాంగ్రెస్ ప్రభుత్వానికి అందజేసింది.

కెసిఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్ లతోపాటు ఇంజనీరింగ్ అధికారులు, ప్రాజెక్టు నిర్మాణ సంస్థలు, ప్రజా సంఘాలను కమిషన్ విచారించి సమాచారాన్ని సేకరించింది. ఈ రిపోర్టును కేబినెట్ కూడా ఆమోదించింది. దీనిపై అసెంబ్లీలో చర్చించిన కాంగ్రెస్ సర్కార్ దర్యాప్తుకు సిబిఐకి అప్పగించింది.