
కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు పెంచాలనుకోవడం దక్షిణ తెలంగాణ రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు స్టే ఉన్నప్పటికీ కర్ణాటక ప్రభుత్వం భూసేకరణ చేపట్టడం, భవిష్యత్తులో డ్యామ్ ఎత్తును పెంచే ప్రయత్నాలు చేయడం అన్యాయమని ఆయన విమర్శించారు.
కర్ణాటకలో ఉన్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అయినప్పటికీ కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి హక్కులను రక్షించడానికి, రైతులకు అన్యాయం జరకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు చొరవ చూపడం లేదంటూ ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా రాష్ట్రాన్ని రక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపును ఆపకపోతే, దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉందని రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీని వల్లన ఉమ్మ్మడి పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల రైతులతో పాటు జూరాల, నాగార్జునసాగర్, పాలమూరు-రంగారెడ్డి, నెట్టెంపాడు, కల్వకుర్తి వంటి ప్రాజెక్టులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన హెచ్చరించారు. జల విద్యుత్ కోసం, రైతులకు సాగునీరు కోసం కృష్ణానదిపై ఆధారపడ్డామని చెబుతూ కృష్ణా నదిపై ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపుతో రైతులకు నష్టం జరుగుతుందనే కారణంతోనే గతంలో సుప్రీంకోర్టు దీనిపై స్టే ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. సుప్రీంకోర్టు స్టే ఉన్నప్పటికీ, ఆల్మట్టి ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమవ్వడం అన్యాయమని ఆయన మండిపడ్డారు.
గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం నీటివాటా విషయంలో తెలంగాణకు నష్టం చేయగా, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే విధంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఇప్పుడు ఆల్మట్టి ఎత్తు పెంపు నిర్ణయం తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న ద్రోహాన్ని సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో మాట్లాడి తెలంగాణ నీటి హక్కులను కాపాడేందుకు, రైతులకు అన్యాయం జరగకుండా ఎందుకు చొరవ చూపడం లేదు? ఎందుకు మాట్లాడటం లేదు? అంటూ విస్మయం వ్యక్తం చేశారు.
పాలమూరు బిడ్డ అని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి, పాలమూరుకు నీరు ఆగిపోతే ఎందుకు నోరు మూసుకుంటున్నారు? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం “కాంట్రాక్టర్ల కోసం, కాంట్రాక్టర్లతో, కమిషన్ల ప్రభుత్వం”గా మారిందని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యాస కాంట్రాక్టులు, కమీషన్లపైనే ఉంది కానీ తెలంగాణలో కృష్ణా జలాల వాటాను రక్షించడంపై లేదని ధ్వజమెత్తారు.
More Stories
మాజీ డీఎస్పీ నళినిని పరామర్శించిన బిజెపి బృందం
తెలుగు రాష్ట్రాల స్వదేశీ జాగరణ్ మంచ్ సారధిగా రాచ శ్రీనివాస్
హైదరాబాద్ నుండి మరో రెండు వందే భారత్ రైళ్లు