విజయవాడ నగరం విశేష చరిత్రకు సాక్ష్యమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. విద్యా, కళా, ఉపాధి అవకాశాల గనిగా విరాజిల్లుతున్న గుంటూరు, విజయవాడతో కలిసిన అమరావతి నూతనశోభ సంతరించుకుంటోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకే నగరం- ఒకటే సంబరం అనే నినాదంతో నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్ తెలుగు వైభవాన్ని కళ్లకు కట్టే వేడుకగా నిర్వహించాలని సోమవారం విజయవాడలో ఆ ఉత్సవాన్ని మంత్రి నారా లోకేష్ తో కలిసి ప్రారంభిస్తూ సూచించారు.
కృష్ణా నదీ తీరం పున్నమి ఘాట్‌లో విజయవాడ ఉత్సవ్ కార్యక్రమంలో అట్టహాసంగా ప్రారంభమైంది. డ్రోన్ షో, లైవ్ బ్యాండ్ సౌండ్‌లు అదరగొట్టగా తుమ్మలపల్లి కళాక్షేత్రం, సంగీత కళాశాలలో బుర్రకథలు, నాటకాలు ఆకట్టుకున్నాయి. విజయవాడ ప్రాశస్త్యాన్ని ఇక్కడి చారిత్రక, కళల వైభవాన్ని ప్రజలకు తెలియచేస్తూ భవిష్యత్తు తరాలకు అందించేందుకు ఇలాంటి ఉత్సవాలు గొప్ప వేదికని వెంకయ్యనాయుడు కొనియాడారు. పద్యం, గద్యం, జగద్విదితం అని చాటి చెప్పే అవకాశంగా అభివర్ణించారు.
తొలి స్పీకర్ అయ్యదేవర కాళేశ్వరరావు, టీవీ చలపతిరావు, విశ్వనాథ సత్యనారాయణ వంటి ప్రముఖులు ఇక్కడి వారన్న వెంకయ్య నాయుడు ఎన్టీఆర్ కూడా ఇక్కడే చదువుకున్నారని గుర్తు చేశారు. తెలుగుభాషలో ప్రభుత్వ ఉత్తర్వులు రావటంపై సంతోషం వ్యక్తం చేశారు.
ఇన్నాళ్లూ మైసూరు ఉత్సవాలు గురించి మాట్లాడుకునే వారికి ఇకపై విజయవాడ దసరా ఉత్సవాలే గుర్తు రావాలని మంత్రి నారా లోకేశ్ చెప్పారు.
కొండ మీద దుర్గమ్మ, కొండ కింద కృష్ణమ్మ ఉన్న పుణ్యభూమిపై వేడుక వన్ టైమ్ వండర్‌గా మిగిలిపోకూడదని పేర్కొన్నారు. లండన్‌లో నిర్వహించే వింటర్ వండర్ ల్యాండ్‌గా దినదిన ప్రవర్థమానం కావాలని లోకేష్ ఆకాంక్షించారు. వ్యవసాయ, వాణిజ్య, విద్యా, ఆటోమొబైల్, చేనేత రంగాలకు సంబంధించిన 600 స్టాళ్లను ప్రదర్శిస్తున్నామని, అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఉత్సవ్ ఓ సాంస్కృతిక వేడుకని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు.
250కి పైగా కార్యక్రమాలు: మొత్తం 11 రోజుల పాటు 250కి పైగా కార్యక్రమాలు నిర్వహించనున్న నేపథ్యంలో విజయవాడ ఉత్సవ్‌కు ప్రారంభం రోజే అపూర్వ స్పందన లభించింది. ఐదు వేదికలపై చేసిన సాంస్కృతిక, పౌరాణిక, నృత్య, కళారూపాలకు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పున్నమి ఘాట్‌లో కళ్లు మిరుమిట్లు గొలిపే ఫైర్ వర్క్ షో మంత్ర ముగ్థుల్ని చేసింది. దుర్గమ్మ, పింగళి వెంకయ్య, ఎన్టీఆర్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆకృతులతో ఆకాశంలో ప్రదర్శించిన డ్రోన్‌షో విశేషంగా ఆకట్టుకుంది.
More Stories
తిరుమల పరకామణి ఘటనపై సిట్ విచారణ
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభం
జీఎస్టీ సంస్కరణలకు ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు అభినందనలు