ఇద్దరు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు మృతి

ఇద్దరు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌ ఇద్దరు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మరణించారు. వీరిని మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి అలియాస్‌ రాజు, కడారి సత్యానారాయణ రెడ్డి అలియాస్‌ కోసాగా గుర్తించారు. 

మహారాష్ట్ర- ఛత్తీస్​గఢ్​ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో నక్సలైట్లు నక్కి ఉన్నారనే సమాచారంతో బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలోనే అబూజ్​మడ్​ అడవుల్లో సెర్చ్​ ఆపరేషన్​ నిర్వహిస్తుండగా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మరణించినట్లు బస్తర్‌ ఐజీ సుందర్‌ రాజ్‌ ధ్రువీకరించారు.  ఘటనా స్థలిలో ఏకే 47, ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

“మహారాష్ట్ర- ఛత్తీస్​గఢ్​ సరిహద్దులోని అటవీ ప్రాంతంలోని అబూజ్​మడ్ అడవుల్లో నిషేధిత మావోయిస్ట్ పార్టీ సభ్యులు ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో భద్రతా బలగాలు వెంటనే వారి కోసం సెర్చ్ ఆపరేషన్​ చేపట్టాయి. ఈ క్రమంలోనే ఉదయం మావోయిస్టులు- భద్రతా బలగాల మధ్య అనేక సార్లు ఎదురు కాల్పులు జరిగాయి. ఆపరేషన్​లో భాగంగా నక్సలైట్ల కోసం వెతుకుతుండగా ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకా ఘటనా స్థలంలో ఒక ఏకే 47, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నాం” అని ఐజి సుందరాజ్ తెలిపారు. 

ఎన్‌కౌంటర్‌ మృతుల్లో ఒకరు తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కోహెడ మండలం తీగలకుంటపల్లికి చెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, మోస్ట్‌ వాంటెడ్‌ కట్టా రామచంద్రారెడ్డి అలియాస్‌ రాజు దాదా అలియాస్‌ వికల్ప్‌(63) కాగా, మరొకరు అదే జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లెకు చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్‌ కోసా దాదా(67)గా పోలీసులు గుర్తించారు. 

 రామచంద్రారెడ్డి చాలా కాలంగా కేంద్ర కమిటీలో కొనసాగుతుండగా.. సత్యనారాయణరెడ్డి సైతం దండకారణ్యం ప్రత్యేక ప్రాంతీయ కమిటీలో మూడు దశాబ్దాలుగా పనిచేశారు. వీరిద్దరూ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, అనేక దాడులు, ప్రతి దాడుల్లో కీలకంగా వ్యవహరించారు. ఇటీవల మావోయిస్టు పార్టీ లేఖలు సైతం వికల్ప్‌ పేరిట విడుదలైన విషయం విదితమే.


మరోవైపు మావోయిస్టులతో సాగుతున్న పోరులో భద్రతా బలగాలు భారీ విజయాన్ని నమోదు చేశాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు. మహారాష్ట్ర- ఛత్తీస్​గఢ్​ సరిహద్దులో ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలను హతమార్చారని, రెడ్ టెర్రరిజం వెన్నుముకను బలగాలు విరిచేస్తున్నాయని తెలిపారు.  అలాగే నక్సల్స్‌పై ఇది నిర్ణయాత్మక గెలుపుగా ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సాయి ప్రశంసించారు.

గత ఆరు నెలలుగా మావోయిస్టు పార్టీ నాయకత్వానికి, క్యాడర్‌కి పెద్ద ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యాన్ని కేంద్రంగా చేసుకుని కేంద్రం తలపెట్టిన ఆపరేషన్‌ కగార్‌, ఆపరేషన్‌ బ్లాక్‌ ఫారెస్ట్‌ వంటి దాడుల్లో మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నాయకులు మృతిచెందారు. ఆ పార్టీ సుప్రీం లీడర్‌ నంబాల కేశవరావు మొదలుకుని, వివేక్‌ మాంఝీ(జార్ఖండ్‌), సుధాకర్‌, గాజర్ల రవి, మోడెం బాలకృష్ణ, చలపతి, రఘునాథ్‌ హేమ్‌బ్రహ్మ్‌(జార్ఖండ్‌), రామ్‌ఖెల్వాన్‌(జార్ఖండ్‌) వంటి నేతలు నేలకొరిగారు

ఈ ఏడాది ఛత్తీస్​గఢ్​లో ఇప్పటివరకు జరిగిన ఎన్​కౌంటర్​లో 249 మంది నక్సలైట్లను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఇటీవలె సెప్టెంబర్​ 11న జరిగిన ఎన్​కౌంటర్​లో 10 మంది నక్సలైట్లు మరణించారు. ఇందులో కేంద్ర కమిటీ సభ్యుడు మోదెం బాలకృష్ణ కూడా ఉన్నారు. ఇంకా బీజాపూర్‌, నారాయణపుర్‌, సుక్మా, కాంకేర్‌, దంతేవాడ జిల్లాల్లో 67 మంది మావోయిస్టులు ఆయుధాలు వీడి పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారిలో 49 మందిపై రూ. 2.27 కోట్ల రివార్డు ఉన్నట్లు అధికారులు వివరించారు.