టీ20ల్లో చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ

టీ20ల్లో చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
 
ఆసియా కప్‌-2025 టోర్న మెంట్‌లో టీమిండియా యువ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ అదరగొడుతున్నాడు. ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన సూపర్‌-4 మ్యాచ్‌లో ఐదు సిక్సర్లతో చెలరేగి ఆడి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించిన అభిషేక్‌ శర్మ  రెండు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టి20ల్లో కేవలం 20 ఇన్నింగ్స్‌, కేవలం 331బంతుల్లోనే 50సిక్సర్లు కొట్టిన తొలి బ్యాటర్‌గా రికార్డు పుటల్లోకెక్కాడు. 
 
దీంతో అంతర్జాతీయ టి20 ఫార్మాట్లో అతి తక్కువ బంతుల్లోనే 50 సిక్సర్లు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. అంతేకాదు తక్కువ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా ఎవిన్‌ లూయీస్‌(వెస్టిండీస్‌) సరసన అభిషేక్‌ నిలిచాడు. దుబారు వేదికగా ఆదివారం నాటి మ్యాచ్‌లో అభిషేక్‌ పాక్‌ బౌలర్లపై తన ప్రతాపాన్ని చూపించాడు. 
కేవలం 39 బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 74 పరుగులు సాధించాడు.
మరో ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ (28 బంతుల్లో 47)తో కలిసి తొలి వికెట్‌కు వందకు పైగా పరుగులు జతచేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. లీగ్‌ దశలో తొలుత యూఏఈపై ప్రతాపం చూపించిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌ 16 బంతుల్లోనే 30 పరుగులు సాధించాడు.  ఆ తర్వాత పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అభిషేక్‌ శర్మ విజృంభిం చాడు. కేవలం 13 బంతుల్లోనే 31 పరుగులు సాధించి.. తన సత్తా ఏమిటో చూపించాడు. అనంతరం ఒమన్‌పై 15 బంతుల్లోనే 38 పరుగులు చేసిన అభిషేక్‌ శర్మ తాజాగా సూపర్‌-4లో భాగంగా పాకిస్తాన్‌కు మరోసారి విశ్వరూపం చూపించాడు.