కెనడాలో ఖలీస్థానీ ఉగ్రవాది ఇంద్రజీత్ సింగ్ గోసల్‌ అరెస్ట్

కెనడాలో ఖలీస్థానీ ఉగ్రవాది ఇంద్రజీత్ సింగ్ గోసల్‌ అరెస్ట్

ఖలిస్థానీ ఉగ్రవాది ఇంద్రజీత్ సింగ్ గోసల్‌ కెనడాలో అరెస్ట్ అయ్యాడు. ఆయుధాలు కలిగి ఉండటం సహా పలు అభియోగాలపై గోసల్‌ను అట్టావాలో తాజాగా అదుపులోకి తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. గత నవంబర్‌లోనూ కెనడా పోలీసులు గోసల్ను అరెస్టు చేశారు. గ్రేటర్ టొరంటో ఏరియాలోని ఒక హిందూ ఆలయం వద్ద జరిగిన హింసాత్మక ఘటనలో ప్రమేయం ఉందని ఆ సమయంలో ఆరోపణలు వచ్చాయి. 

తర్వాత షరతులతో కూడిన బెయిల్ మంజూరుతో బయటకు వచ్చాడు. సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్ఎఫ్జే) అనే వేర్పాటువాద సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకడైన గుర్‌పత్వంత్‌ సింగ్‌ పన్నూకు ఇతడు సన్నిహితుడు. 2023 నుంచి గోసల్‌ కెనడాలో ఎస్‌ఎఫ్‌జే కార్యకలాపాలను చూసుకుంటున్నాడు. అంతకుముందు వారం రోజల క్రితం సెప్టెంబర్ 18న వాంకోవర్‌లోని భారత దౌత్య కార్యాలయాన్ని ముట్టడిస్తామని నిషేధిత ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ సిఖ్‌ ఫర్‌ జస్టిస్‌ హెచ్చరికలు పంపింది. 

భారత దౌత్య కార్యాలయ సందర్శనకు మరో తేదీని ఎంపిక చేసుకోవాలని ఇండో- కెనెడియన్లకు విజ్ఞప్తి చేస్తున్నట్లు ప్రకటించింది. కెనడాలోని భారత హై కమిషనర్‌ దినిష్‌ పట్నాయక్‌ ఫొటోకు టార్గెట్‌ గుర్తు పెడుతూ ఒక కరపత్రం రిలీజ్ చేసింది. హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యలో భారత్‌ హస్తం ఉందని రెండేళ్ల క్రితం అప్పటి ప్రధాని జస్టిన్‌ ట్రూడో చెప్పారని, ఇప్పటికీ ఖలిస్థానీలే లక్ష్యంగా భారత దౌత్య కార్యాలయం ఒక గూఢచార నెట్‌వర్క్‌ నడుపుతోందని ‘ఎస్ఎఫ్జే’ ఆరోపించింది. 

ఖలిస్థాన్‌పై ప్రజాభిప్రాయసేకరణ ప్రచారానికి నాయకత్వం వహిస్తున్న ఇందర్‌జీత్‌సింగ్ గోసల్‌ను భారత ఏజెంట్లు హత్య చేసే ప్రమాదం ఉందని ‘ఎస్ఎఫ్జే’ పేర్కొంది. కెనడా గడ్డపై భారత్‌ చేస్తున్న నిఘా, బెదిరింపుల నేపథ్యంలో కాన్సులేట్‌ను ముట్టడి చేస్తున్నట్లు వివరించింది. ఇటీవలె రెండు ఖలిస్థానీ ఉగ్ర సంస్థలకు తమ దేశం నుంచే నిధులు అందాయని కెనడా నివేదిక వెల్లడించింది. వాటిని ‘బబ్బర్‌ ఖాల్సా ఇంటర్నేషనల్‌’, ‘ఇంటర్నేషనల్‌ సిఖ్‌ యూత్‌ ఫెడరేషన్‌’గా తెలిపింది.

మరోవైపు ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయానికి తెరతీసేందుకు భారత కెనడాల మధ్య అంగీకారం కుదిరిందని ఇటీవల భారత విదేశాంగ ప్రకటించింది. ఈ అంగీకారంలో భాగంగా ఉగ్రవాదం, అంతర్జాతీయ నేరాలను ఎదుర్కొనేందుకు కలిసి పనిచేయాలని నిర్ణయించినట్టు వెల్లడించింది. ఇందులో భాగంగా భారత్, కెనడాలు ఉపసంహరించుకున్న రాయబారులను ఇటీవల తిరిగి నియమించుకున్నాయి. 

అనంతరం సంబంధాల పునరుద్ధరణే లక్ష్యంగా దేశ రక్షణ సలహాదారు అజిత్‌ డోభాల్, కెనడా భద్రతా సలహాదారు నథాలీ డ్రౌయిన్‌ల మధ్య చర్చలు జరిగాయి. జూన్‌లో కెనడాలో జరిగిన జీ7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ ఇరు దేశాల సంబంధాలపై అక్కడి ప్రధాని మార్క్‌ కార్నీతో చర్చలు జరిపారు.