2026 నాటికి భారత్ కు ఎస్-400 డెలివరీ పూర్తి

2026 నాటికి భారత్ కు ఎస్-400 డెలివరీ పూర్తి

భారత్‌కు అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థ ఎస్-400ల డెలివరీలను వచ్చే ఏడాది పూర్తి చేయనున్నట్లు రష్యా వెల్లడించింది. 2018లో రూ.40 వేల కోట్లతో కుదిరిన ఒప్పందాన్ని 2026 నాటికి పూర్తి చేయనున్నట్లు కథనాలు తెలిపాయి.  “2026 నాటికి భారత్తో కుదుర్చుకున్న 5 ఎస్-400 రక్షణ వ్యవస్థల కాంట్రాక్టును పూర్తి చేస్తాం. ఇప్పటికే నాలుగు రక్షణ వ్యవస్థలను అప్పగించగా, చివరిది వచ్చే ఏడాదికి పూర్తి చేస్తాం” అని రక్షణ వర్గాలు తెలిపాయి.

కాగా, ఐదు ఎస్‌-400 ట్రయంఫ్‌ రెజిమెంట్ల విషయంలో భారత్‌ 2018 అక్టోబర్ 5న రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. వాస్తవానికి 2024 తొలి అర్ధభాగంలోనే మొత్తం ఐదు ఆర్డర్లను అందజేయాల్సింది. కానీ, ఇప్పటి వరకు నాలుగు చేరుకోగా, చివరి ఆర్డర్ను వచ్చే ఏడాది నాటికి ఇవ్వనున్నారు. ఇక పాకిస్థాన్పై చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ వేళ ఎస్‌-400 ప్రపంచ రికార్డు సృష్టించింది. ఓ విమానాన్ని ఏకంగా 300 కిలోమీటర్ల అవతల నుంచే ధ్వంసం చేసినట్లు అధికారులు వెల్లడించారు. 

వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా గతంలో ఎన్నడూ ఊపరితలంపై నుంచి గగనతల లక్ష్యాన్ని ఛేదించింది లేదు. అంతకు ముందు కూల్చిన లక్ష్యాల్లో 200 కిలోమీటర్ల దూరమే ఇప్పటి వరకు అత్యధికం. ఎస్‌-400 గగనతల వ్యవస్థలో వాడే నాలుగు రకాల క్షిపణుల్లో 40ఎన్‌6 రేంజి 400 కిలోమీటర్లు దూరం వెళ్లనుంది.  దీనిని ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో భారత వాయుసేన పూర్తిస్థాయిలో వాడుకొంది. 

ఈ వ్యవస్థకు భయపడి పాక్‌ తమ ఎఫ్‌-16 ఫైటర్‌ జెట్లు, చైనా నుంచి కొనుగోలు చేసిన విమానాలను సుదూర ప్రదేశాలకు తరలించిందంటేనే దీని ప్రభావం ఏ మేరకు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం వాయుసేన ఆధ్వర్యంలో పాక్, చైనా సరిహద్దుల్లో 1.5 రెజిమెంట్ల చొప్పున మోహరించారు.  మరోవైపు ఎస్‌-400 గగనతల రక్షణ వ్యవస్థలను మరికొన్ని సమకూర్చుకోవటంపై భారత్‌ దృష్టి సారించింది. ఇప్పటికే రష్యాతో చర్చలు మొదలైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రష్యా రక్షణశాఖ వర్గాలు ధ్రువీకరించాయి.

ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో ఎస్‌-400 అద్భుతంగా పనిచేసినట్లు వాయుసేన పేర్కొనటంతో మరికొన్ని యూనిట్లు కొనుగోలు చేసేందుకు భారత్‌ సిద్ధమైనట్లు సమాచారం. ఇటీవల రష్యా విక్టరీ వేడుకలకు హాజరైన హోంశాఖ సహాయ మంత్రి సంజయ్ సేఠ్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఆపరేషన్ సిందూర్లో ఎస్-400 అద్భుతంగా పనిచేశాయని వెల్లడించారు. వీటిని మరిన్ని కొనుగోలు చేసేందుకు చూస్తున్నామని, ఇంకా అత్యాధునిక ఎస్-500 రక్షణ వ్యవస్థలపైనా ఆసక్తిచూపిస్తున్నట్లు చెప్పారు.