స్వదేశీ ఉత్పత్తులే కొనండి, అమ్మండి, వినియోగించండి

స్వదేశీ ఉత్పత్తులే కొనండి, అమ్మండి, వినియోగించండి

జీఎస్టీ సంస్కరణలు పొదుపు పెంచుతాయని, దీని వల్ల సమాజంలోని ప్రతి వర్గానికి ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుతుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 2047 నాటికి వికసిత్ భారత్ అనే సమిష్టి లక్ష్యాన్ని సాధించడానికి, స్వావలంబన మార్గంలో నడవడం తప్పనిసరి అని ఆయన నొక్కి చెప్పారు.  ఎక్స్ వేదికగా భారతీయులు అందరికీ వ్రాసిన ఒక బహిరంగ లేఖలో  దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ బచత్ ఉత్సవ్ (జీఎస్టీ పొదుపు పండుగ) ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు.

ఈ సంస్కరణలు ప్రజల పొదుపును పెంచుతాయని, సమాజంలోని ప్రతి విభాగానికి ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తాయని తెలిపారు. “ఈ ఏడాది చేపట్టిన జీఎస్టీ సంస్కరణలు కారణంగా పండుగ సీజన్ మరింత ఆనందదాయకం అవుతుంది. ఈ సంస్కరణలు పొదుపును పెంచుతాయి. రైతులు, మహిళలు, యువత, పేదలు, మధ్యతరగతి, వ్యాపారులు, ఎంఎస్ఎంఈలకు ఇలా సమాజంలోని ప్రతి వర్గానికి ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తాయి” అని ప్రధాని తెలిపారు.

అంతే దేశ ఆర్థిక వృద్ధికి, పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుంది. ప్రతి రాష్ట్రం, ప్రాంతం పురోగతి వేగవంతం అవుతుందని ప్రధాని చెప్పారు.  “జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రధానంగా 5 శాతం, 18 శాతం శ్లాబులే ఉంటాయి. దీని వల్ల ప్రధానంగా ఆహారం, మందులు, సబ్బు, టూత్పేస్టు, బీమా, సహా అనేక ఇతర వస్తువులు పన్ను రహితం అవుతాయి లేదా 5 శాతం పన్ను శ్లాబులోకి వస్తాయి” అని వివరించారు. 

గతంలో 12 శాతం పన్ను పరిధిలో ఉన్న వస్తువులు ఇప్పుడు 5శాతం ట్యాక్స్ పరిధిలోకి వచ్చాయిని ప్రధాని చెప్పారు.  దుకాణదారులు, వ్యాపారులు ఇంతకు ముందు, ఇప్పుడు జీఎస్టీ రేట్లలో వచ్చిన మార్పులను సూచించే బోర్డులను ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉందని మోదీ పేర్కొన్నారు.

“గత కొన్నేళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. ఇప్పుడు అనేక ఆకాంక్షలు కలిగిన నవ-మధ్యతరగతి ప్రజలు ఉద్భవించారు. మా ప్రభుత్వం మరింతగా పన్నులు తగ్గించి, మన మధ్యతరగతి ప్రజలను బలోపేతం చేస్తాం. అంటే వ్యక్తుల వార్షిక ఆదాయం రూ.12 లక్షల వరకు ఉంటే, వారు కట్టాల్సిన పన్ను సున్నా ఉండేలా చూస్తాం” అని ప్రధాని స్పష్టం చేశారు. 

ఆదాయ పన్ను కోతలు, జీఎస్టీ సంస్కరణలు రెండింటినీ కలిపితే, ప్రజలకు దాదాపు రూ.2.5 లక్షల కోట్ల పొదుపు అవుతుందని మోదీ తెలిపారు. “2017లో ప్రారంభమైన జీఎస్టీ ప్రయాణం పౌరులను, వ్యాపారులను బహుళ పన్నుల వల నుంచి విముక్తి చేసింది. ఒకే దేశం- ఒకే పన్ను ఏకరూపత తెచ్చిపెట్టింది. కచ్చితంగా చెప్పాలంటే, జీఎస్టీ దేశాన్ని ఆర్థికంగా ఏకం చేసింది” అని మోదీ చెప్పారు. 

జీఎస్టీ సంస్కరణల వల్ల చిన్న పరిశ్రమలు, దుకాణదారులు, వ్యాపారులు, వ్యవస్థాపకులు, ఎంఎస్ఎంఈలు లాభపడ్డాయని, అయితే 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలనే లక్ష్యం నెరవేరాలంటే, స్వావలంబన మార్గంలో నడవడం తప్పనిసరి అని మోదీ నొక్కి చెప్పారు.