పాలస్తీనాను గుర్తించిన బ్రిటన్‌, కెనడా, ఆస్ట్రేలియా

పాలస్తీనాను గుర్తించిన బ్రిటన్‌, కెనడా, ఆస్ట్రేలియా

పాలస్తీనాను స్వయం ప్రతిపత్తి దేశంగా గుర్తిస్తున్నట్లు బ్రిటన్‌, కెనడా, ఆస్ట్రేలియా దేశాలు ఆదివారం అధికారికంగా ప్రకటించాయి. అమెరికా, ఇజ్రాయిల్‌ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ పాలస్తీనాను బ్రిటన్‌ అధికారికంగా దేశంగా గుర్తించింది. ఈ మేరకు బ్రిటన్‌ ప్రధానమంత్రి కెయిర్‌ స్టార్మర్‌ ఒక వీడియో సందేశాన్ని ఆదివారం విడుదల చేశారు. పాలస్తీనీయులు, ఇజ్రాయిల్‌ పౌరుల్లో శాంతిస్థాపన ఆశలను పునరుద్ధరించేందుకు, ద్విదేశ పరిష్కారం కోసం ఈ మేరకు చర్యలు తీసుకున్నట్టు ఆయన తెలిపారు.

కెనడా, ఆస్ట్రేలియా సైతం ఈ మేరకు ప్రకటన చేశాయి. గాజాలో కాల్పుల విరమణకు, ఐక్యరాజ్యసమితి సాయం అనుమతికి, దీర్ఘకాలిక శాంతికి ఇజ్రాయిల్‌ అంగీకరించకపోతే పాలస్తీనాను దేశంగా గుర్తిస్తామని జులైలోనే స్టార్మర్‌ ప్రకటించారు.  ఇటీవల బ్రిటన్‌ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షులు డోనాల్డ్‌ ట్రంప్‌ స్టార్మర్‌ ప్రభుత్వ ప్రణాళికలను వ్యతిరేకించారు. ఈ విషయంలో ప్రధాని స్టార్మర్‌తో విభేదాలు ఉన్నాయని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

ఇప్పటివరకు 140కి పైగా దేశాలు పాలస్తీనాను దేశంగా గుర్తించాయి. త్వరలోనే ఫ్రాన్స్‌ తదితర దేశాలూ ఈ మేరకు ప్రకటనలు చేసే అవకాశముది. పాలస్తీనాలో యూదులకు జాతీయ నివాసం ఏర్పాటు చేస్తామని 108 ఏళ్ల క్రిందట చేసిన విదాదస్పద ‘బల్ఫోర్‌ ప్రకటన’, అలాగే 77 ఏళ్ల కిందట పాలస్తీనాలో బ్రిటీష్‌ స్వాధీన భూభాగంలో ఇజ్రాయిల్‌ ఏర్పాటు అనంతరం ఇప్పుడు బ్రిటన్‌ చేసిన ప్రకటన చరిత్రాత్మకమైనది. ఇన్నాళ్లూ పాలస్తీనా స్వయం ప్రతిపత్తిని గుర్తించకుండా బ్రిటన్‌ తొక్కిపెడుతూ వస్తోంది. 

ఇప్పుడు సుదీర్ఘకాల నిర్ణయాన్ని మార్చుకొని పాలస్తీనాకు గుర్తింపునిస్తూ ప్రకటన చేసింది. మధ్యప్రాచ్యంలో హింసాత్మక వాతావరణం పెరిగిపోతున్న నేపథ్యంలో శాంతియుత వాతావరణానికి దోహదం చేసే చర్యలకు కృషి చేస్తున్నామని బ్రిటన్‌ ప్రధాని స్టార్మర్‌ తెలిపారు. బ్రిటన్‌, కెనడా, ఆస్ట్రేలియా ప్రకటనల పట్ల పాలస్తీనా విదేశాంగ మంత్రిత్వ శాఖ హర్షం వ్యక్తం చేసింది. పశ్చిమ దేశాలు ‘సాహసోపేత’ నిర్ణయాలు తీసుకున్నాయని, ఇదే బాటలో అమెరికా లాంటి ఇతర దేశాలు కూడా పయణించాలని కోరింది. అయితే, ఈ ప్రకటన పట్ల ఇజ్రాయిల్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ఏకపక్ష ప్రకటన అని వాపోయింది. 

ఇది సమస్య పరిష్కారానికి తోడ్పాటును అందిస్తుందని పాలస్తీనా విదేశాంగ మంత్రి వర్సెన్‌ షాహిన్‌ హర్షం వ్యక్తం చేయగా, ఇజ్రాయెల్‌, అమెరికా విమర్శించాయి. “ఇది మనల్ని సార్వభౌమాధికారం, స్వాతంత్య్రానికి దగ్గర చేసే చర్య. ఇది రేపు యుద్ధాన్ని ముగించకపోవచ్చు కానీ మనల్ని ముందుకు తీసుకెళ్లే చర్య. దీన్ని మనం నిర్మించి విస్తరించాలి” అని షాహిన్‌ రమల్లాహ్‌లో విలేకరులతో పేర్కొన్నారు. 

ఆమె వ్యాఖ్యలను ఇజ్రాయెల్‌ తోసిపుచ్చుతూ క్షేత్ర స్థాయిలో వాస్తవాలను ఇది మార్చలేదని తెలిపింది. ఇటీవల ఇజ్రాయెల్‌ మిత్ర దేశాలు కూడా గాజాపై ఇజ్రాయెల్‌ దాడులను ఖండించాయి. ఐక్యరాజ్య సమితి విచారణ కమిషన్‌ కూడా గాజాలో ఇజ్రాయెల్‌ సామూహిక హత్యాకాండకు పాల్పడుతున్నదని తెలిపింది.