నేటి నుంచి అమల్లోకి జీఎస్టీ కొత్త శ్లాబులు

నేటి నుంచి అమల్లోకి జీఎస్టీ కొత్త శ్లాబులు

* 375 వస్తువులపై అమల్లోకి రానున్న తగ్గించిన జీఎస్టీ రేట్లు

వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు సోమవారం నుండి అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం చలామణిలో ఉన్న నాలుగు శ్లాబుల (5, 12, 18, 28) విధానంలో రెండింటిని (12, 28) కేంద్రం తొలగించిన విషయం తెలిసిందే. దీంతో 5, 18 శ్లాబులు మాత్రమే మిగిలాయి. అన్ని వస్తువులు, సేవలను ప్రభుత్వం ఈ రెండు శ్లాబుల్లోకే తీసుకొచ్చింది.  విలాస వస్తువులపై 40 శాతం పన్ను విధించనున్నారు. 

జీఎస్టీ 2.0 పేరుతో తీసుకొచ్చిన ఈ సంస్కరణలు అమలులో ఉన్న 5, 12, 18, 28 శాతం పన్ను స్లాబుల స్థానంలో, 5, 18శాతం స్లాబ్‌లను మాత్రమే కొనసాగించాలని, 12, 28 స్లాబ్‌లను తొలగించాలని కేంద్రం నిర్ణయించింది.  దీనితో దాదాపు 375 వస్తువులపై తగ్గించిన జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చాయి. దీంతో వంటగది అవసరాల ఉత్పత్తుల నుంచి ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, వాహనాల వరకు ధరలు తగ్గనున్నాయి. నెయ్యి, పన్నీరు, నమ్‌కీన్‌, కెచప్, జామ్, డ్రై ఫ్రూట్స్, కాఫీ, ఐస్‌క్రీమ్‌ వంటి వినియోగ వస్తువులతో పాటు టివి,  ఏసీ, వాషింగ్‌ మెషీన్‌ వంటి వస్తువుల ధరలు దిగి రానున్నాయి.
జీఎస్టీ సంస్కరణల దృష్ట్యా ఇప్పటికే ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జూమర్‌ గూడ్స్‌ (ఎఫ్ఎంసిజి)  సంస్థలు రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.  చాలా ఔషధాలు, గ్లూకోమీటర్లు, డయాగ్నస్టిక్ కిట్‌లపై జీఎస్టీ 5 శాతానికి తగ్గించడంతో సామాన్యులకు ధరలు అందుబాటులోకి రానున్నాయి. గతంలో 12శాతంగా ఉన్న చాలా ఔషధాలపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించారు. క్యాన్సర్, జన్యుపరమైన, అరుదైన, హృదయ సంబంధిత రోగాల నుంచి కాపాడే 36 కీలక ప్రాణధార ఔషధాలను జీఎస్టీ నుంచి మినహాయించారు.
 
 ఫార్మసీలు ఎం ఆర్ పి తగ్గించాలని లేదా జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలతో మందులను తక్కువ ధరకు విక్రయించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది.  ఈ ప్రతిపాదనకు ఆయా రాష్ట్రాల మంత్రులతో కూడిన బృందం తాజాగా ఆమోదం తెలిపింది.  ఆల్ట్రా లగ్జరీ, సిన్‌ గూడ్స్‌ (సిగరెట్లు వంటివి)పై 40 శాతం పన్ను విధించడం కూడా కేంద్ర ప్రతిపాదనలో ఉందని యూపీ ఆర్థికమంత్రి సురేష్‌ కుమార్‌ ఖన్నా తెలిపారు. 12 శాతం స్లాబులోని 99 శాతం వస్తూత్పత్తులు 5 శాతంలోకి, 28 శాతం స్లాబులోని 90 శాతం వస్తూత్పత్తులు 18 శాతంలోకి రానున్నట్లు తెలిసింది.

ప్రస్తుతం జీఎస్టీలో కనీస పన్ను 5 శాతం స్లాబులో రోజువారీ నిత్యావసర వస్తూత్పత్తులున్నాయి. ఇక స్టాండర్డ్‌ గూడ్స్‌పై 12 శాతం, ఎలక్ట్రానిక్స్‌, ఆయా రకాల సేవలపై 18 శాతం, పొగాకు, ఇతర విలాసవంతమైన ఐటమ్స్‌పై గరిష్ఠంగా 28 శాతం పన్నులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే అదనంగా పాన్‌ మసాలా, లగ్జరీ కార్లు తదితరాలపై జీఎస్టీ నష్టపరిహార సెస్సును కూడా విధిస్తున్నారు. 

జీఎస్టీ రేట్లను తగ్గించడం వల్ల ఆటోమెుబెల్స్‌ వినియోగదారులకు ఎక్కువ లబ్ధి చేకూరనుంది. చిన్న కార్లపై 18 శాతం, పెద్ద కార్లపై 28 శాతం జీఎస్టీతో ఇప్పటికే కార్ల ధరలు తగ్గిస్తున్నట్లు అనేక సంస్థలు ప్రకటించాయి. హెల్త్ క్లబ్‌లు, సెలూన్లు, ఫిట్‌నెస్ సెంటర్లు, యోగా సేవలపై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు.  అలాగే రోజువారీ వస్తువులు తలనూనె, సబ్బులు, షాంపులు, టూత్‌బ్రష్‌, టూత్‌పేస్ట్‌ వంటి వాటిపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించడంతో వాటి ధరలు మరింత చౌకగా మారనున్నాయి.

సిమెంట్‌పై జీఎస్టీని 28 నుంచి 18 శాతానికి తగ్గించడంతో గృహ నిర్మాణ ఖర్చులు తగ్గనున్నాయి. టీవీలపైనా సోమవారం నుంచి రూ. 2,500 నుంచి రూ. 85,000 వరకు ధరలు తగ్గనున్నాయి. స్కీన్‌ సైజులు, స్పెసిఫికేషన్ల ఆధారంగా ధరలు తగ్గిస్తున్నట్లు సోనీ, ఎల్‌జీ, పానసోనిక్‌ వంటి సంస్థలు ప్రకటించాయి. ఈ మేరకు సోమవారం నుంచి అమల్లోకి వచ్చే కొత్త ధరల జాబితాను విడుదల చేశాయి. 

ఏసీలమీద సగటున 4 వేల 500 వరకూ, డిష్‌వాషర్లపైన 8 వేల వరకు ధర తగ్గనుంది. ప్రముఖ సంస్థలు వోల్టాస్, డైకిన్, గోద్రేజ్‌, పానసోనిక్, హైయర్‌ తదితర సంస్థలు ఇప్పటికే కొత్త ధరలను ప్రకటించాయి.  జీఎస్టీ అమలుతో రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయానికి వాటిల్లుతున్న నష్టాలను భర్తీ చేయడానికే ఈ సెస్సు. అలాగే కొన్ని నిత్యావసరాలకు జీఎస్టీ మినహాయింపుండగా, ప్రత్యేకంగా వజ్రాలు, సానబెట్టిన రత్నాలు, బంగారంపై 0.25 శాతం నుంచి 3 శాతం వరకు జీఎస్టీ విధిస్తున్నారు.

ఇప్పుడున్న జీఎస్టీ స్లాబుల్లో 18 శాతం చాలా కీలకం. జీఎస్టీ వసూళ్లలో ఈ ఒక్క స్లాబు నుంచి వచ్చే ఆదాయం వాటానే 65 శాతంగా ఉన్నది. జీఎస్టీ 2.0లో ఈ స్లాబును యథాతథంగానే ఉంచుతుండటం గమనార్హం. అంటే ప్రస్తుతం ఈ స్లాబులో ఉన్న వస్తూత్పత్తుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు వస్తున్న ఆదాయానికి ఢోకా లేదన్నమాట. 

ఇప్పుడు ఎంతకు కొంటున్నారో కొత్త జీఎస్టీ విధానంలోనూ వాటి కోసం అంతే చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ప్రస్తుతం పేద, మధ్య తరగతి వర్గాలు కొంటున్న 5 శాతం స్లాబులోని వస్తూత్పత్తులపై పన్ను భారం అలాగే ఉంటుంది. ఇక పొగాకు, ఆన్‌లైన్‌ గేమింగ్స్‌, లగ్జరీ బైకులు, కార్లు ఇతర వస్తూత్పత్తులపై గరిష్ఠంగా 40 శాతం జీఎస్టీ ఉండనే ఉంటున్నది. అలాగే బంగారం, వజ్రాలు, ఇతర విలువైన రత్నాలపై జీఎస్టీ యథాతథంగానే ఉండనున్నది.