
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియకు ఎన్నికల సంఘం (ఇసి) వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఈ నెల 30 నాటికి ఎస్ఐఆర్ అమలుకు సిద్ధంగా ఉండాలని అన్ని రాష్ట్రాల ఎన్నికల అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల ప్రారంభంలో దేశ రాజధానిలో జరిగిన రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారుల (సిఇఓ) సమావేశంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
దీని ప్రకారం అక్టోబర్, నవంబర్‌ల్లో దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సమావేశంలో ముందుగా 10 నుంచి 15 రోజుల్లో ఎస్ఐఆర్కు సిద్ధంగా ఉండాలని కోరిన ఎన్నికల సంఘం మరింత స్పష్టత కోసం ఈ నెల 30 నాటికి సిద్ధంగా ఉండాలని పేర్కొంది. రాష్ట్రాల్లో చివరిసారిగా జరిగిన ఎన్ఐఆర్ తరువాత ప్రచురించిన ఓటర్ల జాబితాలను సిద్ధంగా ఉంచుకోవాలని కూడా సిఇఓలకు తెలిపింది.
దీంతో అనేక రాష్ట్రాల సిఇఓలు ఇప్పటికే తమ రాష్ట్రాల్లో చివరి ఎస్ఐఆర్ తరువాత ప్రచురించిన ఓటర్ల జాబితాలను తమ వెబ్సైట్లలో ఉంచారు. ఢిల్లీ ఇసిఒ వెబ్సైట్లో 2008 నాటి ఓటర్ల జాబితా ఉంది. ఉత్తరాఖండ్‌లో 2006 ఓటర్ల జాబితా ఉంచారు. చివరిసారిగా జరిగిన ఎస్ఐఆర్నే కటాఫ్ డేట్‌గా పరిగణనలోకి తీసుకుంటారు.
ఎక్కువ రాష్ట్రాల్లో 2002 నుంచి 2004 మధ్య చివరిసారిగా ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహించారు. ప్రస్తుతం బీహార్‌లో 2003 ఓటర్ల జాబితాను ఎస్ఐఆర్ కోసం ఉపయోగిస్తున్నారు. బీహార్ తరువాత దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ఇప్పటికే తెలిపింది. వచ్చే ఏడాది కాలంలో బీహార్‌తో పాటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాబట్టి దేశవ్యాప్త ఎస్ఐఆర్ ప్రాధాన్యతను సంతరించుకుంది.
More Stories
జమ్ముకశ్మీర్‌లో చైనా గ్రెనేడ్లు స్వాధీనం .. ఉగ్ర కుట్ర భగ్నం
అస్సాం రైఫిల్స్ వాహనంపై కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి
వాతావరణ మార్పుల ప్రభావం.. ఇక ఏటా కుండపోత వర్షాలే!