
ఇప్పటి వరకు రైళ్లలో విక్రయిస్తున్న తాగునీటి సీసాల ధరలను తగ్గిస్తూ రైల్వే బోర్డు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే బోర్డు అనుబంధ సంస్థ అయిన ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో ‘రైల్ నీర్’ పేరుతో అందిస్తున్న ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిళ్ల ధరలను సవరించింది. ఈ కొత్త ధరలు సెప్టెంబర్ 22 అర్ధరాత్రి 12 గంటల నుంచే అమల్లోకి వస్తాయి. ప్రస్తుతం రైళ్లలో, రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉండే ఒక లీటరు రైల్ నీర్ బాటిల్ ధర రూ.15గా ఉండగా, దానిని రూ.14కు తగ్గించారు.
ఇదే విధంగా అర లీటరు సీసా ధర రూ.10 ఉండగా, దాన్ని రూ.9కు తగ్గించారు. అంటే ఒక సీసా కొంటే ఒక రూపాయి చొప్పున ప్రయాణికులకు ఆదా అవుతుంది. ఈ తగ్గింపు రైల్వే బోర్డు గుర్తింపు ఇచ్చిన కంపెనీలు తయారుచేసే బాటిళ్లకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టతనిచ్చారు. “మినరల్ రిచ్ వాటర్ రైల్ నీర్ మరింత తక్కువ ధరకే లభిస్తుంది’’ అని ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేసింది.
జీఎస్టీ శ్లాబులను తగ్గింపుతోనే ‘రైల్ నీర్’ ధరలను రైల్వే సవరించింది. కొత్త జీఎస్టీ రేట్లతో చౌక ధరలకే ఎయిర్ కండిషనర్లు, సబ్ కాంట్రాక్ట్ పనులు, వస్తువుల రవాణా సేవలు వంటి ఇతర ఖర్చులను కూడా రైల్వేలు సమీక్షించాయి. వినియోగదారుల చెల్లింపుల్లో ఎలాంటి అక్రమాలు జరగకుండా ఉండేందుకు సరఫరాదారు బిల్లులను ప్రాసెస్ చేసే సమయంలో అవసరమైన తనిఖీలు చేయాలని రైల్వే బోర్డు ఆదేశించింది.
More Stories
జీఎస్టీ సంస్కరణలతో తగ్గనున్న ఆహార వస్తువుల ధరలు
భారీ సైబర్ దాడితో నిలిచిపోయిన పలు దేశాల విమానాశ్రయాలు
హెచ్-1బీ వీసా రుసుం పెంచడంతో టెక్ సంస్థలు అప్రమత్తం