సూర్యలంకలో నిర్వహించే బీచ్ ఫెస్టివల్ కు వినూత్న ప్రచారం

సూర్యలంకలో నిర్వహించే బీచ్ ఫెస్టివల్ కు వినూత్న ప్రచారం

ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 26,27,28 తేదీల్లో బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ లో నిర్వహించే బీచ్ ఫెస్టివల్ కు వినూత్న ప్రచారం కల్పించేందుకు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో వివిధ ప్రదేశాల్లో ఫ్లాష్ మాబ్స్ నిర్వహించేందుకు ఏపీటీడీసీ సన్నద్ధమైంది. టూరిజం అండ్ సస్టెయినబుల్ ట్రాన్స్ ఫార్మేషన్ థీమ్ తో  పర్యాటకానికి ప్రచారంతో పాటు యువత ప్రతిభను ప్రదర్శించే వేదికలుగా ఈ ఫ్లాష్ మాబ్స్ నిలవనున్నాయి.
 
సూర్యలంకతో పాటు విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, గుంటూరు, హైదరాబాద్ లలో జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో  ఫ్లాష్ మాబ్స్ నిర్వహించి యువతలో ఉత్సాహం కలిగించడంతో పాటు రాష్ట్ర సాంస్కృతిక వైభవం, బాధ్యతాయుత పర్యాటకాన్ని ప్రదర్శించనున్నామని ఏపీటీడీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే ఎస్ఆర్ఎం, కేఎల్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలు ఫ్లాష్ మాబ్ లకు ధృవీకరించినట్లు స్పష్టం చేసింది. 
 
మరికొన్ని యూనివర్సిటీలు తమ ఆసక్తిని ప్రదర్శించాయని, ధృవీకరించాల్సిన అవసరముందని ఈ సందర్భంగా ఏపీటీడీసీ పేర్కొంది.  ఫ్లాష్ మాబ్స్ లో పాల్గొన్న విద్యార్థులను సెప్టెంబర్ 27న వరల్డ్ టూరిజం డే రోజున సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా సత్కరించనున్నామని తెలిపారు. 
 
సుందరమైన సూర్యలంక బీచ్ ఫెస్టివల్ లో సందర్శకులకు వాటర్ స్పోర్ట్స్, బీచ్ సైడ్ గేమ్స్, హౌస్ బోట్ రైడ్స్, జీడిపప్పు తోటల సందర్శన, స్థానిక సీ పుడ్ వంటకాలు, బ్యాక్ వాటర్ ఎక్స్ ప్లోరేషన్స్ తో పాటు ఆహ్లాదకరమైన అనుభవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సెలబ్రిటీల కచేరీలు, తాటికల్లు రుచి తదితర కార్యకలాపాల ద్వారా విభిన్న అనుభవాలను అందిస్తామని ఏపీటీడీసీ వెల్లడించింది. 
 
ఫ్లాష్ మాబ్‌లలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న విశ్వవిద్యాలయాల నిర్వాహకులు pr.communication2023@gmail.com కు తమ వివరాలు పంపించాలని ఏపీటీడీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. పర్యాటక శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ వేడుకకు ఏపీ, తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుండి సందర్శకుడు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశముందని అంచనా వేసింది. 
 
స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా యువత ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాలు రాష్ట్రంలో సుస్థిర పర్యాటకాభివృద్ధితో పాటు స్థానిక సమూహాలను బలోపేతం చేస్తాయని ఏపీటీడీసీ వెల్లడించది. మరిన్ని అప్ డేట్స్ కోసం ఇన్ స్టాగ్రామ్ లోని @andhrapradeshtourismను ఫాలో అవ్వాలని సూచించింది.