వైఎస్సార్సీపీ హయాంలో తిరుమల పరకామణిలో జరిగిన సుమారు రూ 100 కోట్ల కుంభకోణంలో దర్యాప్తుకై సీఐడీ బరిలోకి దిగనుంది. దేవుడి సొత్తు ఒక్క రూపాయి చోరీ చేసినా ఆ నిందితుడిని చట్టపరంగా శిక్షించాలి. కానీ వైఎస్సార్సీపీ హయాంలో తిరుమల పరకామణిలో చోరీచేస్తూ పట్టుబడిన నిందితుడిని కొందరు ఉన్నతాధికారులు, పోలీసులు, రాజకీయ ప్రముఖులు దగ్గరుండి మరీ రక్షించారు.
తిరుమల పరకామణిలో రవికుమార్ ఓ మఠం తరఫున పనిచేసేవారు. ఏళ్ల తరబడిగా గుమస్తాగా ఉంటూ విదేశీ కరెన్సీ లెక్కించేవారు. చాలా కాలంగా విదేశీ కరెన్సీని పక్కదోవ పట్టించారనే ఆరోపణలు అతనిపై ఉన్నాయి. వైఎస్సార్సీపీ హయాంలో 2023 ఏప్రిల్ 29న విదేశీ కరెన్సీని లెక్కిస్తూ అందులో కొన్ని నోట్లను పంచెలో ప్రత్యేకంగా కుట్టించుకున్న అరల్లో దాచుకున్నారు.
అతని కదలికలపై అనుమానం వచ్చి సిబ్బంది తనిఖీ చేయగా పట్టుబడ్డాడు. దీనిపై అప్పటి ఏవీఎస్వో సతీష్‌కుమార్ ఫిర్యాదు చేయడంతో రవికుమార్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆరోజు అతడు 900 డాలర్లు అపహరించగా, అప్పట్లో వాటి విలువ రూ. 72 వేలుగా తేల్చారు. అయితే, 112 నోట్లని, రికార్డుల్లో 9 నోట్లే చూపించారనే ఆరోపణలు వచ్చాయి.
ఇలా చాలాకాలంగా పరకామణిలో చేతివాటం చూపించి కాజేసిన సొమ్ముతో రవికుమార్ కోట్లకు పడగలెత్తాడని ఆరోపణలున్నాయి. ఆ తర్వాత ప్రైవేట్ పంచాయతీ జరిపిన టిటిడి పెద్దలు పరకామణిలో చోరీ చేస్తూ దొరికిన రవికుమార్, అతడి భార్య పేరిట ఉన్న ఆస్తుల్లోని కొన్ని టీటీడీకి గిఫ్ట్‌డీడ్‌గా ఇప్పించారు. తిరుపతి రూరల్ పరిధిలో ఆస్తులతో పాటు తమిళనాడులో త్యాగరాజనగర్ , నీలంగరైలో ఆస్తులను టీటీడీకి గిఫ్ట్‌డీడ్‌గా రిజిస్ట్రేషన్ చేయించారు.
ఇవికాకుండా నిందితుడు, అతని కుటుంబ సభ్యులు పేరిట తిరుపతి, చట్టుపక్కల ప్రాంతాలు, చెన్నై తదితర చోట్ల ఉన్న కోట్ల విలువైన ఆస్తులను నాడు టీటీడీలో పనిచేసిన కొందరు ఉన్నతాధికారులు, నాయకులు తమ బినామీల పేరిట రాయించుకున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో నిందితుడిని అరెస్టు చేయకుండానే 2023లో కేసును ఆఘమేఘాలపై లోక్‌అదాలత్‌లో పెట్టి రాజీ చేయించినట్లు తెలుస్తోంది.
ఈ కేసులో రాజీ కావాలంటూ అప్పట్లో కేసుపెట్టిన ఏవీఎస్వో సతీష్‌కుమార్‌పై కొందరు పోలీసులు తీవ్రస్థాయిలో ఒత్తిడి చేశారు. ఇదే విషయాన్ని ఆయన తర్వాత విజిలెన్స్ విచారణలో చెప్పారు. కాగా పరకామణిలో జరిగిన అక్రమాల వ్యవహరాన్ని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు తదుపరి దర్యాప్తు బాధ్యతలు సీఐడీకి అప్పగించింది. సీఐడీ ఐజీని వ్యాజ్యంలో సుమోటోగా ప్రతివాదిగా చేర్చింది. లోక్ అదాలత్ ద్వారా కేసును రాజీ చేసుకోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది.
లోక్ అదాలత్ ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. పరకామణిలో శ్రీవారి నగదు అపహరణపై తిరుమల మొదటి పట్టణ పోలీసులు నమోదు చేసిన కేసుకు సంబంధించిన రికార్డులను తక్షణం సీజ్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఫిర్యాధిదారుడు, పరకామణి అసిస్టెంట్ విజిలెన్స్, సెక్యూర్టీ అధికారి వై.సతీష్‌కుమార్, నిందితుడు సీవీ రవికుమార్ ఒకమాటమీదకొచ్చి లోక్ అదాలత్ ద్వారా కేసును రాజీ చేసుకోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది.
2023 సెప్టెంబర్ 9న లోక్ అదాలత్ జారీచేసిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. లోక్ అదాలత్‌లో జరిగిన ప్రొసీడింగ్స్‌కు సంబంధించిన వివరాలనూ సీజ్ చేయాలని తేల్చిచెప్పింది. పరకామణిలో సొమ్ము దొంగతనంపై టీటీడీ బోర్డు తీర్మానాల రికార్డులు, టీటీడీ అధికారులు ఏమైనా ఉత్తర్వులు జారీచేసి ఉంటే వాటిని సీజ్ చేయాలని సీఐడీని ఆదేశించింది. వాటన్నింటినీ సీల్డ్ కవర్లో రిజిస్ట్రార్ ద్వారా తదుపరి విచారణకు తమముందు ఉంచాలని పేర్కొంది.
ఫిర్యాదుదారుడు,సహాయ విజిలెన్స్, సెక్యూర్టీ అధికారి వై.సతీష్‌కుమార్, తస్కరణ ఆరోపణలు ఎదుర్కొంటున్న టీటీడీ ఉద్యోగి సీవీ రవికుమార్‌కు మూడు రోజుల్లో నోటీసులు అందజేయాలని పిటిషనర్ ఎం.శ్రీనివాసులను ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 13కు వాయిదా వేసింది. హైకోర్టు న్యా యమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ ఈ మేరకు ఇచ్చిన ఉత్తర్వులు శనివారం అందుబాటులోకి వచ్చాయి.
2023లో పరకామణిలో జరిగిన కుంభకోణంపై సీఐడీతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ ‘తిరుపతి వార్త’ విలేకరి ఎం.శ్రీనివాసులు గతేడాది సెప్టెంబర్ 10న టీటీడీ ఈవోకి వినతిపత్రం ఇచ్చారు. దానిపై చర్యలు లేకపోవడంతో హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.
మరోవంక, వైఎస్సార్సీపీ గజదొంగలు శ్రీవారి సొత్తూ దోచుకున్నారంటూ మంత్రి నారా లోకేష్ వీడియోలు విడుదల చేశారు. వంద కోట్ల పరకా”మనీ దొంగ” వెనుక భూమన కరుణాకరరెడ్డి నుంచి తాడేపల్లి ప్యాలెస్ వరకూ నేతలు ఉన్నారని లోకేశ్ ఆరోపించారు. పరకామణి వీడియోలు ఈ రోజు బయటపడ్డాయని, రేపు నిందితులే వైఎస్సార్సీపీ పాపాల చిట్టా విప్పబోతున్నారంటూ లోకేశ్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు.
తాడేపల్లి ప్యాలెస్ ఆశీస్సులు, నాటి టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి అండదండలతో తిరుమల పరకామణిలో నుంచి కోట్ల రూపాయల సొత్తు కొల్లగొట్టారని ఆయన మండిపడ్డారు. దోచుకున్న సొమ్మును రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టారని, ఇందులో వాటాలను తిరుపతిలో భూమన నుంచి తాడేపల్లి ప్యాలెస్ వరకు పంచుకున్నారని లోకేశ్ విమర్శించారు.
కాగా, వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అక్రమాలకు అడ్డాగా మర్చారని టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు, బిజెపి నేత భానుప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. భూమన టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో పరకామణిలో పనిచేస్తూ రూ. 100 కోట్లు దోచుకున్న రవికుమార్‌ను కేసు నుంచి తప్పించేందుకు యత్నించారని ఆరోపించారు. పోలీసులు, టీటీడీ ఉన్నతాధికారులు లోక్‌అదాలత్ ద్వారా ఈ కేసు విషయంలో రాజీకి కుదిర్చారని భానుప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. శ్రీవారి పరకామణి డబ్బుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని దుయ్యబట్టారు.
More Stories
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం
‘మోహన్‌లాల్’కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
హెచ్-1బి కొత్త ధరఖాస్తులకే లక్ష డాలర్ల రుసుము