హెచ్-1బి కొత్త  ధరఖాస్తులకే లక్ష డాలర్ల రుసుము

హెచ్-1బి కొత్త  ధరఖాస్తులకే లక్ష డాలర్ల రుసుము
 
* ట్రంప్ వీసా రుసుం పెంపుపై భారత్ అత్యవసర నంబర్!
 
హెచ్-1బి వీసా రుసుము విషయంలో గందరగోళం నెలకొన్న వేళ అమెరికా కీలక ప్రకటన చేసింది. . హెచ్‌-1బీ వీసాపై విధించిన లక్ష డాలర్ల రుసుము వార్షిక ఫీజు కాదని  వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్‌ లీవిట్‌ ‘ఎక్స్‌’ వేదికగా స్పష్టతనిచ్చారు. దరఖాస్తు చేసుకునే సమయంలో కట్టాల్సిన వన్‌టైమ్‌ ఫీజు మాత్రమేనని చెప్పారు. ఇప్పటికే ఈ వీసా కలిగి ఉండి అమెరికా బయట ఉన్న వారు భయపడాల్సిన అవసరం లేదని, వారిపై ఈ లక్ష డాలర్ల రుసుము విధించబోమనని ఆమె తెలిపారు. వారంతా ఎప్పటిలాగే అమెరికా నుంచి బయటకు వెళ్లి తిరిగి రావొచ్చని, కొత్త నిబంధన వారికి వర్తించదని వివరించారు.
కాగా, ఈ విషయమై , అమెరికాలోని భారత రాయబార కార్యాలయం సహాయం కోరుకునే భారతీయ పౌరుల కోసం అత్యవసర సహాయ నంబర్‌ను జారీ చేసింది.  “అత్యవసర సహాయం కోరుకునే భారతీయ పౌరులు +1-202-550-9931 (వాట్స్ అప్) సెల్ నంబర్‌కు కాల్ చేయవచ్చు. ఈ నంబర్‌ను తక్షణ అత్యవసర సహాయం కోరుకునే భారతీయ పౌరులు మాత్రమే ఉపయోగించాలి. సాధారణ కాన్సులర్ ప్రశ్నలకు కాదు” అని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ఎక్స్ లో రాసింది. 
 
ట్రంప్ చర్య భారతీయ టెక్ నిపుణులు, చెల్లింపులపై దాని ప్రభావాల గురించి పెద్ద ఆందోళనలను రేకెత్తించింది. హెచ్-1బి వీసాలలో 71-71 శాతం భారతీయులకు వెళుతుంది. రాబోయే 24 గంటల్లో అమెరికాకు తిరిగి ప్రయాణించే భారతీయ పౌరులకు సాధ్యమైనంతవరకు సహాయం అందించాలని భారత ప్రభుత్వం తన అన్ని మిషన్లు/పోస్టులకు సూచించింది. 
కాగా, అమెరికా హెచ్‌-1బీ వీసాల ఫీజు పెంపుపై స్పందిస్తూ అమెరికా తీసుకువచ్చిన కొత్త నిబంధనలపై పరిశీలిస్తున్నట్లు విదేశాంగశాఖ తెలిపింది. వీటి పరిణామాలను సంబంధిత భారత సంస్థలు సహా భాగస్వామ్య పక్షాలన్నీ అధ్యయనం చేస్తున్నాయని చెప్పింది. ఇది ఇరు దేశాల్లోని సంస్థలను ప్రభావితం చేసే అంశమని వెల్లడించింది.  అగ్రరాజ్యం నిర్ణయంతో ఎన్నో కుటుంబాలకు ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపింది. నిపుణుల రాకపోకల వల్ల రెండు దేశాలకూ పరస్పర లబ్ధి చేకూరుతోందని అభిప్రాయపడింది.
సున్నిత అంశాలపై విధాన నిర్ణేతలు ఆచితూచి అడుగులు వేయాలని సూచించింది. ఇప్పటికే ప్రాథమిక విశ్లేషణల ఆధారంగా కొన్ని ఊహాగానాలపై స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశాయని భారత విదేశాంగశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.  కొత్త వీసా నిబంధనలతో తలెత్తే ఇబ్బందులను అమెరికా పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ పోస్ట్ చేశారు. 
“ఆవిష్కరణలు, సృజనాత్మకత వంటి అంశాల్లో రెండు దేశాల్లోని సంస్థలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. నిపుణుల రాకపోకల వల్ల సాంకేతిక, ఆవిష్కరణలు, పోటీతత్వం, ఆర్థిక వృద్ధితోపాటు సంపద సృష్టితో ఇరు దేశాలు పరస్పర లబ్ధి పొందాయి” అని ఆయన గుర్తు చేశారు.  “అయితే, ప్రస్తుతం అమెరికా నిర్ణయంతో ఎన్నో కుటుంబాలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇరుదేశాల ప్రజలతో ముడిపడిన అంశంపై జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. సున్నిత అంశాలపై విధాన నిర్ణేతలు ఆచితూచి అడుగులు వేయాలి” అని హితవు చెప్పారు.

మరోవైపు హెచ్‌-1బీ వీసాల సమస్యపై ఐటీ సంస్థలు, అమెరికాతో భారత్ చర్చిస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఐటీ సంస్థల అసోసియేషన్ నాస్కామ్ ఇందుకోసం చొరవ తీసుకుందని చెప్పాయి. ఈ నిర్ణయం అమెరికన్ కంపెనీలను మరింత దెబ్బతీస్తుందని తెలిపాయి.